ఈ సారి మన ఎంపీ ఎవరు?

by Mahesh |
ఈ సారి మన ఎంపీ ఎవరు?
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు శనివారంతో ముగియడంతో ఇక అందరి దృష్టి ఫలితాల పైకి మళ్ళింది. ఎగ్జిట్‌పోల్స్ విడుదల కాగానే నగర ఓటర్లు తమ ప్రాంతంలో ఎవరు గెలుస్తున్నారని తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. రాష్ట్రంలోనే 85 శాతానికి పైగా విద్యావంతులు, పూర్తి పట్టణ ప్రాంత ఓటర్లతో కూడిన సికింద్రాబాద్‌తో పాటు ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న హైదరాబాద్, మల్కాజ్‌గిరి సెగ్మెంట్ల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఈ మూడు సెగ్మెంట్లలో గెలుపెవరిది? అనేది చర్చ జోరుగా సాగుతున్నది. హైదరాబాద్‌లో 40 ఏండ్లుగా ఎంఐఎం పాగా వేస్తూ వస్తోంది. ఈసారి బీజేపీ అభ్యర్థిగా మాధవీలత పోటీ చేయడంతో పరిస్థితిలో మార్పు వచ్చిందని, ఆమె ఎంఐఎంకు గట్టి పోటీ నిచ్చిందని ప్రచారం జరుగుతున్నది.

సికింద్రాబాద్ పై మూడు పార్టీల గురి..

బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు కంచుకోటగా ఉన్న సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంపై ఆ రెండు పార్టీలతో పాటు బీఆర్ఎస్ పార్టీ గెలుపుపై ధీమా తో ఉన్నాయి. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఇక్కడ విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్ పరిధిలోని నియోజకవర్గాలలో ఒక్క నాంపల్లి మినహాయిస్తే ఇతర అన్ని చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి విజయం సాధించిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడమే కాదు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. బీఆర్ఎస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పోటీకి దిగారు. ఇక బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి జీ.కిషన్‌రెడ్డి పోటీ చేశారు. ఈ నియోజకవర్గంపై మూడు పార్టీలకు పట్టు ఉండడంతో ఫలితం అందరికీ ఆసక్తి కలిగిస్తుంది.

గెలుపు పై ఎవరి ధీమా వారిదే..

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపు పై బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ధీమాతో ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో విద్యావంతులు అధికంగా ఉండడం, కేంద్రంలో ప్రధానిగా మోడీ చేసిన అభివృద్ధి పనులతో పాటు సిట్టింగ్ సీటు కావడంతో బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డికి తన గెలుపుపై ఎలాంటి అనుమానాలు లేవు. దీనికి తోడు కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తిరిగి మంత్రి పదవి దక్కుతుందని, దీంతో పార్లమెంట్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయనే నమ్మకంతో ప్రజలు కమలానికి ఓట్లు వేశారని కిషన్‌రెడ్డితో పాటు పార్టీ శ్రేణులు కూడా విశ్వాసంతో ఉన్నాయి. ఇదిలా ఉండగా ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో ప్రచారం కూడా చేపట్టని కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం కలిసి వస్తుందనే భరోసాతో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎంపీగా బరిలోకి దిగిన సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌కు స్థానికంగా మాస్ లీడర్‌గా గుర్తింపు ఉంది. దీనికితోడు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకగర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదింటిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండడం తనకు కలిసి వస్తుందని ఆయన గెలుపుపై ధీమా తో ఉన్నారు.

ఎగ్జిట్ పోల్స్ ఇలా...

శనివారం 7వ విడత లోక్‌సభ ఎన్నికలు ముగిసిన అనంతరం పలు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. వీటిల్లో మెజార్టీ సంస్థలు సికింద్రాబాద్‌లో బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి, హైదరాబాద్‌లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ, మల్కాజ్‌గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. ఇవి ఎంత వరకు నిజమవుతాయోనని అభ్యర్థులతో పాటు ప్రజలు నాలుగో తేదీ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed