అగ్గి రాజేస్తున్నా.. ఆగని అక్రమ నిర్మాణాలు ..?

by Mahesh |
అగ్గి రాజేస్తున్నా.. ఆగని అక్రమ నిర్మాణాలు ..?
X

దిశ, ఎల్బీనగర్: మహానగరంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్న అక్రమ నిర్మాణాలు ఆగడం లేదు. అడ్డుకునేవారు లేకపోవడంతో అక్రమ నిర్మాణాలు, అనుమతులు లేని గోడౌన్లు పుట్టగొడుగుల్లా వెలువెత్తుతున్నాయి. ఫలితంగా ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని పలువురు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల సికింద్రాబాద్ డైమండ్ మాల్, బాగ్ లింగంపల్లి గోడౌన్, రాష్ట్ర సచివాలయం ఇలా వరుస అగ్ని ప్రమాదాలను గుర్తు చేసుకుని ఆందోళన చెందుతున్నారు.

ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న గోడౌన్లతో రాబోయే వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు. అనుమతులు లేని ఇలాంటి అతిపెద్ద గోడౌన్ల కు ఫైర్ ఎన్ఓసీలు కూడా లేకపోవడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. చేతులు కాలకముందే ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

జీహెచ్ఎంసీ ఈస్ట్ జోన్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ భవన, అతిపెద్ద గోడౌన్ల నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇలా వెళుతున్న అక్రమ నిర్మాణాలకు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి అనుమతులు లభించవు. దీంతో భవిష్యత్తులో ఎటువంటి అగ్ని ప్రమాదం జరిగిన బాధ్యులు ఎవరనేది శేష ప్రశ్న గానే మిగిలిపోతుంది. ఇటీవల మహానగరంలో జరిగిన కొన్ని సంఘటనలే ఇందుకు ఉదాహరణలు.

దీంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నగరంలో జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాలు పట్టించుకోకుండా సరూర్ నగర్ టౌన్ ప్లానింగ్ అధికారులు మామూళ్ల మత్తులో అక్రమ నిర్మాణ దారులకు వత్తాసు పలుకుతున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దీంతో అక్రమ నిర్మాణదారులు యథేచ్ఛగా నిర్మాణాలు పూర్తి చేస్తున్నా... ఆ వైపు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది వెళ్లినా చూసీ చూడనట్టుగా వ్యవహరించడం పరిపాటిగా మారింది. అధికారులే అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ ఉండడంతో ఈ తరహా నిర్మాణాలు జోరందుకున్నాయి. ఈస్ట్ జోన్ సరూర్ నగర్ సర్కిల్-5 పరిధిలోని పలు డివిజన్‌లలో అనేక అక్రమ గోడౌన్ల నిర్మాణాలు సాగుతున్నా.. అనుమతులు మాత్రం కొన్నింటికే ఉన్నాయని తెలుస్తోంది.

అయినా జీహెచ్ఎంసీ అధికారులు వాటి విషయంలో నోటీసులతో సరిపెట్టి ఎలాంటి చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఆదాయానికి గండి పడుతుందని తెలిసినా ఏ లాభాపేక్ష కోసం అక్రమార్కులకు వంత పాడుతున్నారో వారికే తెలియాలి మరి..!

నిబంధనలు భేఖాతర్..

ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టరాదు. కానీ ఇక్కడ మాత్రం అడ్డగోలుగా నిర్మాణాలు జరిగిపోతున్నాయి. నాగోల్ ప్రధాన రహదారిలో ఎటువంటి అనుమతులు లేకుండా అది పెద్ద గోడౌన్ నిర్మాణం జరుగుతున్నా.. టౌన్ ప్లానింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారు.

వందల కోట్ల ఆదాయానికి గండి

ఎల్బీనగర్ జోనల్ వ్యాప్తంగా ఆయా సర్కిళ్లలో సాగుతున్న నిర్మాణాలతో జీహెచ్ఎంసీకి భారీగా ఆదాయం చేకూరాలి, కానీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ మాత్రం అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. సంస్థ ఆదాయానికి అధికారులే గండి కొడుతుంటే జీహెచ్ఎంసీ ఎప్పటికి కొలుకుంటుంది అన్నది శేష ప్రశ్న అనే చెప్పాలి. అనుమతులు లేకుండా, అంతకు మించి సాగుతున్న నిర్మాణాలపై అధికారులు ఇప్పటికైనా దృష్టి సారిస్తారో లేదో వేచి చూడాలి మరి.!

Advertisement

Next Story

Most Viewed