జలాశయాలకు పెరుగుతున్న ఇన్‌ఫ్లో.. ఉదృతంగా ప్రవహిస్తున్న మూసీ

by samatah |
జలాశయాలకు పెరుగుతున్న ఇన్‌ఫ్లో.. ఉదృతంగా ప్రవహిస్తున్న మూసీ
X

దిశ, సిటీబ్యూరో : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జంటజలాశయాలకు వరద ఉద్దృతి పెరుగుతుంది. మంగళవారం ఉదయం వరకు ఉస్మాన్ సాగర్‌కు కూడా ఇన్‌ఫ్లో పెరుగుతుంది. ఇప్పటికే హిమాయత్ సాగర్ నీటిమట్టం గరిష్టస్థాయికి చేరటంతో మధ్యాహ్నం వరకు కేవలం రెండు గేట్లను రెండడుగుల మేరకు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు పెరుగుతున్న నీటి ఉద్దృతిని బట్టి అదనంగా మరో రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సోమవారం ఉదయం వరకు ఉస్మాన్‌సాగర్‌కు కూడా కేవలం 100 క్యూ సెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, మధ్యాహ్ననానికి ఇన్ ఫ్లో కాస్త 1100 క్యూసెక్కులకు పెరిగింది. దీనికి ఇన్ ఫ్లో ఇలాగే కొనసాగితే బుధవారం ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశముంది. ఇప్పటికే హిమాయత్ సాగర్ నాలుగు గేట్లను ఎత్తి దిగువకు 2750 క్యూ సెక్కుల నీటిని విడుదల చేస్తున్నందున, ఒక వేళ ఉస్మాన్ సాగర్ ఒకటి, రెండు గేట్లు ఎత్తితే మూసీనది మరింత ఉద్దృతంగా మారనుంది.

రిజర్వాయర్ల రిపోర్ట్..

ఉస్మాన్ సాగర్ పూర్తస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1786.55 అడుగులకు పెరిగింది. ఇన్ ఫ్లో ఒక్కసారిగా 1100 క్యూ సెక్కులకు పెరిగినా, ఇంకా ఔట్ ఫ్లో రిలీజ్ చేయలేదు. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1761.75 అడుగులకు చేరి, 2500 క్యూ సెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తుండటంతో మధ్యాహ్నం మరో రెండు గేట్లను రెండడుగుల ఎత్తు వరకు ఎత్తాల్సి వచ్చింది. దీంతో పాటు హుస్సేన్ సాగర్ నీటిమట్టం ఎప్పటికపుడు పెరుగుతూ దిగువనున్న ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా, గరిష్టస్థాయి నీటిమట్టం 514.75 మీటర్లుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 513.45 మీటర్లుగా ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed