'ఎదుర్కోలేకనే రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు'

by S Gopi |
ఎదుర్కోలేకనే రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రధాని మోడీ తూట్లు పొడుస్తున్నారని, అందులో భాగమే రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడమని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ తన మిత్రుడైన అదానీ కోసం మొత్తం దేశాన్నే కొల్లగొడుతున్నారని అన్నారు. గాంధీ భవన్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలో రేవంత్ ప్రసంగిస్తూ, ఫిబ్రవరి 7న తొలిసారి పార్లమెంటులో అదానీ కుంభకోణంపై ప్రధాని మోడీని రాహుల్‌గాంధీ ప్రశ్నించారని, దీంతో సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరయ్యారని, రాజకీయంగా ఎదుర్కోలేకనే ఆయనను సభలో లేకుండా చేయాలన్న ఉద్దేశంతో అనర్హత వేటు వేశారని ఆరోపించారు. అదానీ, ప్రధాని డబుల్ ఇంజిన్ తరహాలో బీజేపీ ప్రభుత్వం నడుస్తున్నదన్నారు. రాహుల్ గాంధీని ఎదుర్కొనే ధైర్యం లేకనే ఆయనపై కుట్ర ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపించారు.

ప్రజల పక్షాన నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని పేర్కొన్న రేవంత్ రెడ్డి దీక్ష ముగిసిన తర్వాత తదుపరి కార్యాచరణపై సమిష్టిగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ దీక్షకు పార్టీకి చెందిన అన్ని గ్రూపుల నేతలు హాజరయ్యారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి సహా అన్ని జిల్లాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. తాజాగా పార్టీలో చేరిన మాజీ మంత్రి డీ శ్రీనివాస్, ఆయన కుమారుడు సంజయ్ కూడా దీక్షలో పాలుపంచుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed