గ్రేటర్‌లో అప్రకటిత విద్యుత్ కోతలు.. ఇబ్బందులు పడుతున్న ప్రజలు

by Anjali |
గ్రేటర్‌లో అప్రకటిత విద్యుత్ కోతలు.. ఇబ్బందులు పడుతున్న ప్రజలు
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అప్రకటిత కరెంటు కోతలతో ప్రజలు ఇబ్బందులపాలవుతున్నారు. నగరంలో కరెంటు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని పర్యాయాలు గంటల పాటు కూడా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు, ఫ్యూజ్ ఆఫ్ కాల్‌కు ఫోన్ చేసినా ఫలితం ఉండడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. దీనికితోడు వర్షాలు, ఈదురు గాలులు తోడవడంతో పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోతోంది. ప్రభుత్వం 24 గంటలు అంతరాయం లేకుండా కరెంటు సరఫరా చేయాలని ఆదేశించినా ఫలితం ఉండడం లేదు. చిన్నపాటి వర్షానికి కూడా కరెంటు పోతున్నా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అప్రకటిత కోతలు..

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం గతంలో మాధిరిగానే 24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించింది. ప్రభుత్వం కొన్నేళ్ల పాటు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంది. ఇటీవల కాలంలో నగరవ్యాప్తంగా తరచుగా కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. అనధికారికంగా కోతలు విధిస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వం నిరంతర విద్యుత్ ఇవ్వాలని చెబుతున్నా అందుకు అవసరమైన చర్యలు అధికారులు చేపట్టడం లేదనే ఆరోపణలు వినబడుతున్నాయి. అంతరాయానికి కొంత మంది అధికారులు చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా విద్యుత్ నిలిపి వేస్తున్నామని చెబుతున్నారు. అయితే ట్రీ కటింగ్ లేని సమయంలో కూడా పలుమార్లు సరఫరా నిలిచిపోతోంది. దీంతో ప్రజలకు ఏం జరుగుతుందో అర్ధంకాని పరిస్థితులు నెలకొన్నాయి.

ఫ్యూజ్ ఆఫ్ కాల్‌కు ఫోన్ చేసినా..?

జీహెచ్ఎంసీ పరిధిలో తరచుగా విద్యుత్ కోతలు ఉంటుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వీఐపీలు, సంపన్నులు ఉండే ప్రాంతాలలో ఒకవేళ ఏదేని సాంకేతిక కారణాలతో సరఫరా నిలిచిపోతే వెంటనే పునరుద్ధరిస్తున్న అధికారులు ఇతర ప్రాంతాలలో పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గంటల పాటు విద్యుత్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఫ్యూజ్ ఆఫ్ కాల్‌తో పాటు ఏఈ, లైన్‌మెన్‌లకు ఫోన్ చేసినా స్పందించడం లేదని, కొంతమంది అధికారులు అసలు ఫోన్ కూడా ఎత్తకపోవడం పట్ల బస్తీల ప్రజలు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఎల్బీనగర్, మలక్‌పేట్, అంబర్‌పేట్ నియోజకవర్గాలలోని చాలా బస్తీలలో సమస్య జఠిలంగా ఉంది. ఒక్కోసారి రోజులో పదుల సార్లు విద్యుత్ నిలిచిపోతోంది. హైదరాబాద్ నగరంలో అనధికార కోతలు విధిస్తూనే 24 గంటలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

చెడిపోతున్న గృహోపకరణాలు..

విద్యుత్‌ సరఫరా హెచ్చుతగ్గులు కూడా ఉండడంతో గృహోపకరణాలు కూడా పాడవుతున్నాయని పలువురు వాపోతున్నారు. తరచుగా కరెంటు వస్తూ, పోతూ ఉండడంతో ఇండ్లలో టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఇతర విద్యుత్ వస్తువులు చెడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని నిరంతరం కరెంటు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రేటర్ వాసులు కోరుతున్నారు.

నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి..

- వీ.చక్రవర్తి, న్యూ మారుతీనగర్

ఇటీవల కాలంలో తరచుగా కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడడం ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా కొన్ని సందర్భాలలో రాత్రి సమయాలలో కరెంటు పోతుండడంతో చిన్న పిల్లలు, వృద్ధులు పడరానిపాట్లు పడుతున్నారు. తరచుగా కరెంటు వస్తూ పోతూ ఉండడంతో ఇండ్లలో విద్యుత్‌తో నడిచే ఉపకరణాలు చెడిపోతున్నాయి. అధికారులు నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుని కోతలు లేకుండా సరఫరా చేయాలి.

Advertisement

Next Story

Most Viewed