SP Akhil Mahajan : పోలీసు అమరుల త్యాగాలను స్మరించుకోవాలి..

by Sumithra |
SP Akhil Mahajan : పోలీసు అమరుల త్యాగాలను స్మరించుకోవాలి..
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : పోలీసు అమరుల చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కె రన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాట్ నుండి గాంధీ, అంబేద్కర్ చౌరస్తా మీదుగా బతుకమ్మ ఘాట్ వరకు పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు, వాకర్స్ తో 2కె రన్ ఉత్సాహభరితంగా కొనసాగింది. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా క్షేమం కోసం పని చేస్తూ అమరులైన వారి త్యాగాలు స్మరిస్తూ వారి ఆశయ సాధన కోసం పనిచేస్తూ, సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలన్నారు.

ప్రతి ఒక్కరి ఆరోగ్య రక్షణకు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండడానికి వాకింగ్, వ్యాయామం, యోగా ప్రతి నిత్యం చేయాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయని, శారీరక దారుఢ్యం పెరుగుతుందన్నారు. యువత చెడు మార్గాల వైపు మరలకుండా చదువు పై ప్రత్యేక దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని సూచించారు. అనంతరం 2కె రన్ లో అందరితో పాటుగా పాల్గొన్న ఇద్దరు మహిళలను ఆయన ప్రత్యేకంగా అభినందించి వారిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సీఐలు కృష్ణ, వెంకటేశ్వర్లు, ఆర్ఐలు యాదగిరి, రమేష్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, మెడికల్ కాలేజ్ విద్యార్థులు, నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు, పాలిటెక్నిక్, జేఎన్టీయూ కళాశాల విద్యార్థులు, పట్టణ యువత, వాకర్స్ పాల్గొన్నారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed