- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సికింద్రాబాద్‌లో ఇష్టారాజ్యంగా బేకరీల నిర్వహణ
దిశ, సికింద్రాబాద్ : సికింద్రాబాద్ సర్కిల్ జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ, మెడికల్ అండ్ హెల్త్ అధికారుల పనితీరు మాటల్లో తప్ప చేతల్లో కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో పలు బేకరీలు, హోటళ్లు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యాపారం సాగిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. బేకరీ ఉత్పత్తుల తయారీ, అమ్మకాల్లో కనీసం భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని, బేకరీలో తయారు చేసిన ఆహార పదార్థాల ప్యాకింగ్‌లపై లైసెన్స్, రిజిస్ట్రేషన్ నెంబర్, ఎక్స్పైరీ తేదీని కూడా వేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలాంటి బేకరీలకు అడ్డుకట్ట వేయాల్సిన సికింద్రాబాద్ సర్కిల్ జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు, మెడికల్ అండ్ హెల్త్ అధికారులు పట్టించుకోకపోవడంతో అడ్డు అదుపు లేకుండా పోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. బేకరీలలో లభించే కలుషిత ఆహారం తిన్న పిల్లలు, విద్యార్థులు రోగాల బారిన పడాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ తార్నాకలోని ఓ బేకరీలో పప్స్ తిన్న విద్యార్థులు వాంతులు, విరోచనాలతో ఆస్పత్రిలో చేరారు.
అపరిశుభ్రత వాతావరణంలో ఆహార పదార్థాలు..
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలు పాటించకుండా బేకరీ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా తమకు నచ్చిన రీతిలో ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయిస్తున్నారని తెలిసింది. ఆహార పదార్థాలు తయారు చేసే సమయంలో వ్యక్తులు కనీస శుభ్రత ప్రమాణాలు పాటించడం లేదని, వంట కోసం ఉపయోగించే నూనెలు, ఆహార ఉత్పత్తుల్లో ఉపయోగించే రంగులు కూడా నాసిరకం వాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పైరీ తేదీలు ఉండవు..
బేకరీలలో తయారు చేసే బ్రెడ్, బిస్కెట్, స్వీట్లు, ఇతర ఆహార పదార్థాల ప్యాకింగ్‌లపై మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పైరీ లాంటి తేదీలను వేయడం లేదని తెలిసింది. కనీసం బేకరీ పేరు, లైసెన్స్, రిజిస్ట్రేషన్ నెంబర్ వంటివి కూడా లేకుండా ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం బేకరీ చిరునామా, లైసెన్స్ నంబరు, మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పైరీ తేదీలను తప్పకుండా ప్యాకింగ్‌లపై వేయాలి. బేకరీ నిర్వాహకులు మాత్రం ఇలాంటివేవి తమకు పట్టనట్టు వ్యాపారాలు సాగిస్తున్నారు. అడ్డుకట్ట వేయాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు, మెడికల్ అండ్ హెల్త్ అధికారులు, అటు వైపు కన్నెత్తిచూడకపోవడంతో బేకరీ నిర్వాహకులకు అడ్డూ అదుపు లేకుండా పోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా బేకరీలను నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటు.
రోగాల బారిన పడుతున్న ప్రజలు..
ఆకర్షణీయ రంగులలో ప్యాకేజీలు చేసి మరి అమ్ముతుండడంతో వాటికి ఆకర్షితులై తిన్న పిల్లలు వాంతులు విరోచనాలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. గతంలో కూడా తార్నాక పరిధిలోని ఓ బేకరీలో ఎగ్ పప్స్, వెజ్ పప్స్ తిన్న నలుగురు విద్యార్థులు వాంతులు, విరోచనాలతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. సంఘటనలు జరిగినప్పుడే తూతూమంత్రంగా స్పందించిన అధికారులు తర్వాత అటువైపు కూడా కన్నెత్తి చూడటం లేదని పలువురు మండిపడుతున్నారు.