అభివృద్ధిని చూడలేక బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తోంది : మంత్రి పొంగులేటి

by Aamani |
అభివృద్ధిని చూడలేక బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తోంది : మంత్రి పొంగులేటి
X

దిశ,హైదరాబాద్ బ్యూరో : ఈనెల చివ‌రినాటికి రాష్ట్రంలోని ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి తొలివిడతగా మూడు వేల ఐదు వందల నుండి నాలుగు వేల ఇందిర‌మ్మ ఇళ్లు, 4 ఏళ్ల‌లో 20 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పెట్టుకుందని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. కాళ్ల‌లో క‌ట్టెలు పెట్టినా రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం ఆగ‌దని అన్నారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధ్యక్షతన గోషామహల్ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు రాంపల్లి లో నిర్మించిన 144 డబుల్ బెడ్ రూం ఇండ్ల పట్టాలను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌తో క‌లిసి అందించారు . ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ వ‌చ్చే నాలుగు సంవ‌త్స‌రాల‌లో రాష్ట్రంలో సుమారు 20 లక్షల డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి అర్హులైన పేద‌వారంద‌రికి ఇవ్వ‌డ‌మే తెలంగాణ ప్ర‌భుత్వం ల‌క్ష్య‌ంగా పెట్టకుందన్నారు.

కులాలు, మ‌తాలు, ప్రాంతాలు, పార్టీలు, ఎలాంటి తేడా లేకుండా అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ ఇందిర‌మ్మ ఇండ్లు ఇవ్వ‌నున్నట్లు తెలిపారు . ఎలాంటి భేష‌జాల‌కు పోకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావ‌ల‌సిన వాటా, నిధులు అడిగి తీసుకుంటామ‌ని , పెద్ద ఎత్తున రాష్ట్రానికి ఇండ్ల‌ను మంజూరు చేయాల‌ని ఇటీవల హైద‌రాబాద్‌కు వ‌చ్చిన కేంద్ర హౌసింగ్ జాయింట్ సెక్ర‌ట‌రీని కోర‌డం జ‌రిగిందన్నారు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ కాకి గోల వ‌ల్ల ప్ర‌భుత్వానికి వ‌చ్చే న‌ష్ట‌మేమీ లేదని , ఏడాది కూడా పూర్తికాక‌ముందే మా ప్ర‌భుత్వంపై రోడ్డు ఎక్క‌డం వ‌ల్ల బిఆర్ఎస్ కే న‌ష్ట‌మ‌ని అన్నారు. ప‌ది సంవ‌త్స‌రాల‌లో బిఆర్ఎస్ ప్ర‌భుత్వం చేయలేనిది, త‌మ ప్ర‌భుత్వం నెలల వ్యవధిలోనే చేసి చూపిస్తుంటే ప్ర‌తిప‌క్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయ‌ని మండిపడ్డారు. మూసీ ప‌రివాహ‌క ప్రాంత ప్ర‌జ‌ల‌కు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాల‌న్న ఉద్దేశ్యంతో త‌మ ప్ర‌భుత్వం వారికి ఇండ్లు, ఉద్యోగం, ఉపాధి, క‌ల్పిస్తే బి ఆర్ ఎస్ ఓర్చుకోలేక పోతోంద‌ని, ప్ర‌భుత్వం ఏదో త‌ప్పు చేస్తున్న‌ట్లుగా గోబెల్ ప్ర‌చారం చేస్తుంద‌ని, ముసలి కన్నీరు కారుస్తోందని దుయ్య‌బ‌ట్టారు.

మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసిన ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతుందన్నారు. మూసీ పునరుజ్జీవంపై అనేక అభాండాలు వేస్తున్నారని, అక్కడున్న పేదవారిని అక్కడే వదిలేస్తారా , మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసింది మీరు కాదా అని బీఆర్ఎస్ ను నిలదీశారు .ఇప్పుడు వారికి డబుల్ బెడ్రూం లు కేటాయించి మెప్మా ద్వారా వారికి ఉపాధి అవకాశాలు,పిల్లలకు చదువులు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంటే ఓర్వలేకపోతున్నారని అన్నారు . తెలంగాణ ఏర్పడినప్పుడు గళ్ళల పైసలతో ఇచ్చాం , కానీ గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసి 40 వేల కోట్ల బిల్లులు పెండింగ్ బకాయిలు చేసిందన్నారు.రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురి చేసే విధంగా ప్రభుత్వం ఇబ్బందులు పరిష్కరిస్తూ ముందుకు వెళ్తుంటే రాజకీయం చేస్తున్నారని, ఇటువంటి తీరును వెంటనే మానుకోవాలని హితవు పలికారు . బీఆర్ఎస్ బాధ్యత గల ప్రతిపక్షం అయితే నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి , కాంగ్రెస్ పార్టీకి పరిపాలన ఎలా చేయాలో ప్రతిపక్షాలకు ఎలా గౌరవం ఇవ్వాలో తెలుసునన్నారు.

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ పేదవారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు . ఇంతమంది తన ఓటర్లు ఇక్కడి నుండి వెళ్లిపోతున్నారన్న బాధ ఉన్నప్పటికీ వారికి సొంతం ఇండ్లు దక్కుతున్నాయన్న ఆనందం కలుగుతోందన్నారు . ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్, ఎమ్మెల్సీలు బలమూరి వెంకట్, రహమత్ బేగ్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ వెంకటాచారి , ఆర్డీవోలు, తహశీల్దార్లు తదితర అధికారులు పాల్గొన్నారు .

Advertisement

Next Story

Most Viewed