MLA 'పైలట్‌'కు ఈడీ నోటీసు... నేడు సీఎంతో భేటీ

by S Gopi |   ( Updated:2022-12-17 07:59:22.0  )
MLA  పైలట్‌కు ఈడీ నోటీసు... నేడు సీఎంతో భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: మొయిన్ బాద్ ఫామ్ హౌస్ లో గులాబీ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ కు లాబీయింగ్ నడిపిన తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మెడకు కొత్తగా మరో కేసు చుట్టుకుంది. ఆయనకు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం నోటీసులు జారీచేసింది. మనీ లాండరింగ్‌ అంశాలపై ఎంక్వైరీ చేయనున్నట్లు హైదరాబాద్ జోనల్ ఆఫీసు అసిస్టెంట్ డైరెక్టర్ దేవేంద్రకుమార్ సింగ్ ఆ నోటీసుల్లో (సమన్ నెం. 1621) పేర్కొన్నారు. ఈనెల 19న ఉదయం 10.30 గంటలకు జోనల్ ఆఫీసులో విచారణకు హాజరయ్యేటప్పుడు ఎమ్మెల్యే ఆర్థికవ్యవహారాలకు సంబంధించిన సమస్త సమాచారం తీసుకురావాల్సిందిగా నిర్దేశించారు. ఫైనాన్స్ మేటర్‌కు సంబంధించి ఏమేం వివరాలు కావాలో పది అంశాలను ఆ నోటీసులతో జతపరిచారు. వీటితోపాటు నిర్దిష్ట ఫార్మాట్‌లో బయోడేటా తీసుకురావాల్సిందిగా నమూనా ప్రతిని కూడా పొందుపరిచారు. నిర్దిష్టంగా ఏ కేసుకు సంబంధించిన విచారణ అనేది నోటీసుల్లో పేర్కొనకపోయినా మనీలాండరింగ్ చట్టానికి సంబంధించిన అంశాలపైనేనని పేర్కొన్నారు. గురువారమే నోటీసులు రెడీ చేసినా రోహిత్‌రెడ్డికి శుక్రవారం ఉదయం అందాయి. ఈడీ నుంచి నోటీసు అందిన విషయాన్ని ధృవీకరించిన ఎమ్మె్ల్యే నిర్దిష్ట సమయానికి విచారణకు హాజరు అవుతానని మీడియాకు వెల్లడించారు. ఈడీ విచారణకు భయపడనని, వారు కోరిన సమాచారం తీసుకెళ్తానని స్పష్టం చేశారు. మరోవైపున వ్యక్తిగత లాయర్‌తోనూ సంప్రదింపులు జరిపారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు శుక్రవారం రాత్రి చేరుకోగా శనివారం ఉదయం ప్రగతి భవన్ వెళ్లికు వెళ్లి ఆయనను రోహిత్ రెడ్డి కలిసే ఛాన్స్ ఉంది.

ఆ పది అంశాలపైనే ఫోకస్..

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నుంచి పది అంశాలపై ఈడీ క్లారిటీ కోరింది. బెంగళూరు డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎంక్వైరీ చేయడానికి ఈడీ పిలిపించినట్లు మొదట వార్తలు వెలువడినా, నిర్దిష్టంగా ఆ నోటీసుల్లో ఎలాంటి కేసు ప్రస్తావన లేదు. మనీ లాండరింగ్ కోణం నుంచి మాత్రమే విచారించే అవకాశం ఉంది. ఈడీ కోరిన పది అంశాలు ఇవే..

= ఆధార్, పాన్ కార్డులు, పాస్‌పోర్టు కాపీలు

= ఎమ్మెల్యే వ్యక్తిగత, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల వివరాలు

= స్థిరాస్తి, చరాస్తులు, ఆదాయ వనరులు డేటా. ఇన్‌వాయిస్‌‌లు, సేల్‌డీడ్‌లు, ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందనే తదితరాలు

= కంపెనీలు, వ్యాపార సంస్థలు, ట్రస్టుల వివరాలు, షేర్ల రిజిస్టర్, వాటి బ్యాంకు ఖాతాలు, వాటికి సంబంధించిన స్థిర, చరాస్తులు, ఆడిట్ చేసిన బ్యాలెన్సు షీట్లు, 2015 నుంచి వార్షిక నివేదికలు, గతేడాదికి (2021-22) నివేదిక సమర్పించకపోతే ట్రయల్ బ్యాలెన్సులు.

= వివిధ కంపెనీల్లో 2015 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఉన్న షేర్లు.

= కంపెనీల పేర్లతో 2015 ఏప్రిల్ 1 నుంచి వివిధ బ్యాంకుల్లో లోన్లు, డిపాజిట్లు, క్లోజ్ చేసిన బ్యాంకు ఖాతాలు

= 2015 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు వివిధ కంపెనీల పేర్లతో సమకూర్చుకున్న స్థిర, చరాస్తులు లేదా ఇప్పటికే అమ్మినట్లయితే వాటి ఆడిట్ రిపోర్టులు, బ్యాలెన్స్ షీట్లు.

= 2015 ఏప్రిల్ 1 నుంచి వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యులు వాటాదారులుగా, డైరెక్టర్లుగా ఉన్న కంపెనీల, వ్యాపార సంస్థలు, షేర్ రిజిస్టర్, బ్యాంకు ఖాతాలు, ఆడిట్ చేసిన బ్యాలెన్సు షీట్లు, స్థిర-చరాస్తులు

= కంపెనీలు, వ్యాపార సంస్థలు, ఇతర ఎంటీటీల పేరిట రుణాలు, వాటి అగ్రిమెంట్ కాపీలు, తిరిగి చెల్లించిన రుణాలు

= నిర్దిష్ట ఫార్మాట్‌లో భర్తీ చేసిన బయోడేటా కాపీ. ఆయనతోపాటు కుటుంబసభ్యులకు సంబంధించి అన్ని వివరాలను అందించాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది.

ఆస్తుల వివరాలనను కోరిన ఈడీ

బయోడేటా ఏ విధంగా ఉండాలో నిర్దిష్ట ఫార్మాట్‌ను కూడా ఈడీ జతచేసింది. అందులో వ్యక్తిగతంగా రోహిత్‌రెడ్డి, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, అత్తమామలు, సోదరులు, అక్కాచెల్లెళ్లు, తోడల్లుడు తదితరలకు సంబంధించిన వివరాలను కూడా తెలియజేయాల్సిందిగా సూచించింది. పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు, సొంతంగా సమకూర్చుకున్నవి, వాడుతున్న వాహనాలు, ఇప్పటివరకు చేసిన ఉద్యోగాలు, నిర్వహించిన వ్యాపారం, ఆర్థిక లావాదేవీలు, ఆదాయం సమకూర్చే మార్గాలు, బ్యాంకుల్లోని లాకర్లు, విదేశీ పర్యటనలు, ఏయే దేశాలను ఎన్నిసార్లు సందర్శించారు, ఏయే క్లబ్‌లలో సభ్యత్వం ఉన్నది, చార్టర్డ్ అకౌంటెంట్ వివరాలు... ఇలాంటివన్నీ విచారణకు తీసుకురావాల్సిందిగా ఈడీ స్పష్టం చేసింది.

చెల్లించిన ఆదాయపు పన్ను..

ఇప్పటివరకు ఫెమా, ఫెరా లాంటి కేసులను ఎదుర్కొంటే వాటి వివరాలను, ఏయే భాషల్లో ప్రావీణ్యమున్నది, మొబైల్ నెంబర్లు, అందరి చిరునామాలు, సోషల్ మీడియా అకౌంట్ల వివరాలు.. ఇలా అనేకం తీసుకురావాల్సిందిగా సూచించింది. ఇప్పటివరకు చెల్లించిన ఆదాయపు పన్ను వివరాలు, డైరెక్టర్‌గా/వాటాదారుగా ఉన్న కంపెనీల అడ్రస్‌లు, వాటి వివరాలు, బయటి దేశాల్లో వ్యాపారం ఉన్నట్లయితే వాటి వివరాలు తదితరాలను కూడా తీసుకురావాలని స్పష్టం చేసింది.

ఆయనకు ముందే ఎలా తెలుసు..? కక్షసాధింపు చర్యలే: రోహిత్‌రెడ్డి

ఈడీ విచారణకు హాజరవుతానని క్లారిటీ ఇచ్చిన రోహిత్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగానే తనను ఇబ్బంది పెడుతున్నట్లు వ్యాఖ్యానించారు. మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో తన ఫిర్యాదు మేరకు జరుగుతున్న సిట్ దర్యాప్తును ఎదుర్కోలేక బీజేపీ అధికారంతో కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదని ఆరోపించారు. భయపడే ప్రసక్తే లేదని మీడియాకు ఆయన వెల్లడించారు. బండి సంజయ్ రెండు రోజుల క్రితమే ఈడీ నోటీసులంటూ వ్యాఖ్యానించారని, ఆయనకు ముందుగానే ఎలా తెలుసు అని ప్రశ్నించారు.

Also Read...

సార్.. ఎక్కడికెళ్లినా ఇదే అడుగుతున్నారు... ఏం జేయమంటర్ సార్?

Advertisement

Next Story

Most Viewed