Body Fitness: బాడీ ఫిట్నెస్ పేరుతో భారీ దోపిడీ

by Kalyani |   ( Updated:2024-10-13 13:38:26.0  )
Body Fitness: బాడీ ఫిట్నెస్ పేరుతో భారీ దోపిడీ
X

దిశ, శేరిలింగంపల్లి : ఉరుకుల పరుగుల జీవితాలు. ఉదయం లేచినప్పటి నుంచి మొదలు రాత్రి వరకు క్షణం తీరిక లేని పనులు. దీంతో మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఉన్న కాస్త సమయంలోనే ఆరోగ్యం విషయంలో కాస్త కేర్ చూపెడుతున్నారు సిటీ జనాలు. ఫిట్ గా ఉండేందుకు జిమ్ ల బాట పడుతున్నారు. ఆడ, మగ తేడా లేకుండా జిమ్ కు వెళ్లి వ్యాయామం చేస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం, సాయంత్రం నుంచి రాత్రి వరకు బ్యాచ్ ల వారీగా వర్కవుట్స్ చేయిస్తూ ట్రెయినర్లు బిజీగా ఉంటున్నారు.

అందరికీ అవసరమే..

ఇది వరకు జిమ్ అంటేనే సెలబ్రెటీల కోసం అన్నట్లుగా ఉండేది. క్రీడాకారులు, సినీ హీరో హీరోయిన్లు ఇతర బిజినెస్ ప్రముఖుల కోసం స్పెషల్ గా ఫిట్ నెస్ స్టూడియోలు ఉండేవి. కానీ ఇప్పుడు జిమ్ సెంటర్లు అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. ఫిట్ గా ఉండాలనుకునే వారు వారి వారి స్థాయిని బట్టి అనుకూలంగా ఉన్నచోట జిమ్ లో చేరి వర్కవుట్స్ చేస్తున్నారు . జిమ్ సెంటర్ల నిర్వహణలో ప్రముఖ సంస్థలు కూడా భాగస్వామ్యమవుతున్నాయి. కస్టమర్ల కోరికను బట్టి ట్రెయినర్లు వర్కవుట్స్ ప్లాన్ చేస్తున్నారు. మజిల్స్, షోల్డర్స్, చెస్ట్ ఎక్సర్ సైజ్, బాడీ బిల్డింగ్ లాంటి వాటికి యూత్ లో మంచి క్రేజ్ కనిపిస్తుంది. లేడీస్ కోసం ప్రత్యేక వ్యాయామాలు చేయిస్తున్నారు. అందులోనూ మేల్, ఫిమేల్ కు డ్యాన్స్, ఏరోబిక్స్, జుంబాలతో పాటు ఇతర డ్యాన్స్ లు చేయిస్తూ పలు రకాల వ్యాయామాలు ఉండేలా చూస్తున్నారు. కొన్నిచోట్ల వ్యాయామాలు, డ్యాన్స్ లతో పాటు యోగా పాఠాలు కూడా చెబుతున్నారు. లేడీస్ ట్రెయినర్లు అందుబాటులో ఉంటున్నారు.

ఫిట్నెస్ పేరుతో దోపిడీ

ఫిట్ గా ఉండాలంటే అందుకు తగ్గట్టుగానే డైట్ పాటించాలని, ఫలానా మందులు వాడాలంటూ సూచిస్తున్నారు ట్రైనర్లు. డైట్ పాటిస్తే మంచిదే అయినా మజిల్స్, షోల్డర్స్, చెస్ట్ సైజ్, బాడీ బిల్డింగ్ లాంటి వాటికి కొన్ని రకాల మందులు తప్పనిసరిగా వాడాల్సిందే అని సూచిస్తున్నారు కొన్ని సెంటర్ల జిమ్ నిర్వాహకులు. ఇన్నాళ్లు జిమ్ కు వచ్చాం.. కండలను ప్రదర్శించక పోతే ఎలా అన్న భావన చాలామందిలోనూ ఉంటుంది. దీంతో ట్రైనర్లు సూచిస్తున్న మందులను విధిగా వాడుతున్నారు. వీటిలో చాలా వరకు బ్యాండ్ మందులే ఉంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెర్మిన్, నోవా ట్రాప్, ప్రిమో 100, అడినోసిన్ మోనో ఫాస్పేట్ ఇంజక్షన్, క్లెన్ బటర్ లిన్ ట్యాబ్లెట్లు, ఈవమిన్, అనవార్, స్టానా, సైటోమేల్, టీ3 సైటోమేల్, మాస్టాజెమ్, స్ట్రాంబాజెమ్, క్లన్ 60, ట్రెన జెమ్ లాంటి డ్రగ్స్ ను బాడీ ఫిట్నెస్ కోసం అందిస్తున్నారని సమాచారం.

వీటిలో కొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. కానీ జిమ్ నిర్వాహకులు మాత్రం వాటిని దొంగచాటుగా తెప్పించి వేలల్లో ఫీజులు లాగి ఫిట్నెస్ కోసం వచ్చిన వారికి అంటగడుతున్నారని ఆరోపిస్తున్నారు చాలామంది. వీటిని విరివిగా వాడడం వల్ల కార్డియాక్ అరెస్ట్, నిద్రలేమి, పక్షవాతం వంటి తీవ్ర ప్రభావాలకు దారితీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ మందులను వాడాలని సూచిస్తున్న ఫిట్నెస్ ట్రైనర్లలో 90 శాతం మందికి మెడికల్ ఫీల్డ్ కు ఏమాత్రం సంబంధం లేకపోగా కనీసం అందులో ఎలాంటి శిక్షణ తీసుకోని వారే ఉంటున్నారు. ఇలాంటి నిషేధిత డ్రగ్స్ ఇస్తున్నారని, జిమ్ ల పేరున దోపిడీ చేస్తున్నారని తెలిసిన పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని, నిషేధిత డ్రగ్స్ జిమ్ యాజమాన్యాలకు ఎలా వస్తుంది.? ఎక్కడి నుంచి తెస్తున్నారు అన్నదానిపై పోలీసులు విచారణ చేపట్టి యువతకు నిషేధిత డ్రగ్స్ ఇస్తున్న జిమ్ నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ఇటీవల బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిమ్ సెంటర్లకు నిషేధిత డ్రగ్స్ సప్లై చేస్తున్నా ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. జిమ్ లపై ఇటీవల డ్రగ్స్ కంట్రోల్ అధికారులు నిర్వహించిన దాడుల్లోనూ పలు నిషేధిత డ్రగ్స్ పట్టుబడ్డ విషయం తెలిసిందే. శరీర సౌష్టవం కోసం జిమ్ లకు వెళుతున్న యువతకు వ్యాయామాలకంటే ఎక్కువగా మజిల్స్ పెరిగేందుకు, బాడీ ఇంప్రూవ్ కోసమని ఇంజెక్షన్స్, స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. ఇవి దీర్ఘకాలంలో అనేక దుష్ప్రభావాలు ఎదురవయ్యే అవకాశాలున్నాయి. వీటి వల్ల మరణాలు కూడా సంభవిస్తాయని ఇలాంటి జిమ్ లను వెంటనే బ్యాన్ చేయాలని, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed