మీరు హైదరాబాద్‌లో నివసిస్తున్నారా..? అయితే, మీకో శుభవార్త...

by S Gopi |   ( Updated:2022-12-01 03:19:01.0  )
మీరు హైదరాబాద్‌లో నివసిస్తున్నారా..? అయితే, మీకో శుభవార్త...
X

దిశ, సిటీబ్యూరో: మెరుగైన వైద్య సేవలందించే దిశగా మహానగరంలో ఏర్పాటు చేసిన బస్తీదవాఖానాల సంఖ్య మరింత పెరగనుంది. ఇప్పటివరకు మహానగరంలో గుర్తింపు పొందిన 1700 మురికివాడలు, బస్తీల ప్రజలకు సుమారు 263 బస్తీదవాఖానాలు వైద్య సేవలందిస్తుండగా, తాజాగా మరో 37 ఏర్పాటు చేయాలని బల్దియా భావిస్తుంది. వీటిలో 20 బస్తీ దవాఖానాలు ప్రారంభానికి సిద్దంగా ఉండగా, మరో 17 దవాఖానాల ఏర్పాటు ప్రతిపాదనల స్థాయిలో ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. బక్కో బస్తీ దవాఖానాలో స్థానికులకు అందించే వైద్య సేవలు కూడా 57కు పెంచినట్లు అధికారులు వెల్లడించారు.

ఒక్కో డివిజన్‌కు రెండు

మహానగరంలోని 150 మున్సిపల్ డివిజన్లలో ఒక్కోదానిలో రెండు బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతమున్న 263 బస్తీ దవాఖానాల్లో నేటికీ కొన్ని వార్డుల్లో బస్తీ దవాఖానాలు ఒకటికే పరిమితం కాగా, తాజాగా ఏర్పాటు చేయాలనుకున్న 37 బస్తీ దవాఖానాలు అందుబాటులోకి వస్తే, బస్తీ దవాఖానాల సంఖ్య దశల వారీగా 300 పెరిగి, 150 డివిజన్లలో ఒక్కోదానిలో రెండు దవాఖానాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్టవుతుందని అధికారులు భావిస్తున్నారు. కానీ మూడున్నరేళ్ల క్రితం నగరంలో మొట్టమొదటి బస్తీ దవాఖానాను అందుబాటులోకి తెచ్చినా, అప్పట్లోనే 300 బస్తీ దవఖానాలు అందుబాటులోకి తేనున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. కానీ వీటిని ఏర్పాటు చేసేందుకు బస్తీల్లోని కమ్యూనిటీ హాళ్లు, ఇతర ప్రభుత్వ భవనాలను గుర్తించటంలో జీహెచ్ఎంసీలోని సర్కిళ్ల వారీగానున్న అధికారుల అలసత్వం కారణంగా కాస్త ఆలస్యమైవుతున్నట్లు సమాచారం. నేటికీ ఇంకా ప్రతిపాదనల స్థాయిలోనే ఉన్న 17 బస్తీదవాఖానాల ఏర్పాటుకు సైతం ఇలాంటి అలసత్వ గ్రహణమే పట్టినట్లు విమర్శలున్నాయి. వీలైనంత త్వరగా ఇవీ కూడా అందుబాటులోకి వస్తే త్వరలోనే బస్తీదవఖానాల సంఖ్య 300కు పెరగనుంది.

57 రకాల వైద్య సేవలు

ఒక్కో బస్తీదవాఖానాలో 57 రకాల వైద్య సేవలను అందుబాటులో ఉంచుతున్నారు. వీటిని ఏర్పాటు చేసిన కొత్తలో అంతంతమాత్రంగా ఉన్న వైద్య సేవలు కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో సేవలను పెంచుతూ నేడు 57 రకాల సేవలందించేలా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ప్రతి బస్తీదవాఖానాలో ఔట్ పేషెంట్, ప్రాథమిక రోగనిర్ధారణ పరీక్షలు, గర్భిణీలు, బాలింతలకు పరీక్షలు, టీకాలు వేయడం, రక్తహీనత, కుటుంబ నియంత్రణ పరీక్షలు, బీపీ, షుగర్, క్యాన్సర్ పరీక్షలు, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన, చైతన్య వంటి కార్యక్రమాలతోపాటు, ఇతర ప్రాథమిక చికిత్సలు, అంతకు మించి అత్యవసర ఆరోగ్య సమస్యలకు రిఫరెల్ ప్రభుత్వ హాస్పిటల్‌కు పంపించి మెరుగైన చికిత్స అందించేలా కూడా బస్తీదవాఖానాల ద్వారా కృషి జరగటం హర్షణీయమేనని బస్తీవాసులు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed