లక్షలలో పెట్టుబడి..కోట్ల సంపాదన.. మహంకాళి దేవాలయంలో బయటపడుతున్న అక్రమ సంపాదన

by Aamani |
లక్షలలో పెట్టుబడి..కోట్ల సంపాదన.. మహంకాళి దేవాలయంలో బయటపడుతున్న అక్రమ సంపాదన
X

దిశ, బేగంపేట: సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయం నగరంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన దేవాలయం. అమ్మవారి ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు అంటే ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయి.లక్షల మంది అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించడం, మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. అయితే ఈ దేవాలయంలో అమ్మవారికి భక్తులు సమర్పించే చీరలను టెండర్ల ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తుండగా వారు. చెల్లించేది లక్షల్లో ఉంటే కాంట్రాక్టర్లకు మాత్రం కోట్లలో ఆదాయం తెచ్చిపెడుతున్నాయి. ఇటీవల ఈ చీరలకు సంబంధించిన అంశంలోనే ఈవోకు, కాంట్రాక్టర్ కు మధ్య తలెత్తిన వివాదం సుప్రీం కోర్టుకు ఎక్కడంతో దీనిపై ఆరా తీస్తే చీరల టెండర్లలో ఆలయ ఆదాయానికి టెండర్ పెట్టిన విషయాలు వెలుగులోకి వచ్చాయి.తీగలాగితే డొంకంతా కదిలినట్లు వాస్తవాలు బయటకు వస్తున్నాయి.2024-25 ఏడాదికి గాని టెండర్ రూ.48 లక్షలకు దక్కించుకుంటే... అధికారులు కేవలం రెండు నెలల చీరలు లెక్కిస్తేనే రూ.80 లక్షల ఆదాయం వచ్చింది.ఏడాది మొత్తం లెక్కిస్తే రూ.2 కోట్లు దాటే అవకాశం ఉందని తెలుస్తుంది.

రెండు నెలలకే రూ.80 లక్షల విలువ చేసే చీరలు..

అయితే కాంట్రాక్టరు,దేవాలయ అధికారుల మధ్య కోర్టు కేసు నడుస్తుండటంతో చీరలను అధికారులు భద్రపరిచారు. అధికారులు ఇటీవల లెక్కించగా జూలై,ఆగస్టు రెండు నెలల కాలంలో 16,175 చీరలు దేవాలయానికి వచ్చాయి. ఇందులో రూ. 500 నుండి రూ.10,15 వేల వరకు విలువ చేసే చీరలు ఉంటాయి. సరాసరి రూ.500లకు ఒక్క చీర లాగా లెక్కించిన ఈ చీరల విలువ రూ.80 లక్షలు ఉంటుంది.దసరా నవరాత్రులతో పాటు మిగతా కాలంలో లెక్కిస్తే ఈ అమ్మవారికి వచ్చే చీరెల విలువ సుమారు తక్కువలో తక్కువ రెండు కోట్లు దాటే అవకాశం ఉంది. అందుకే కాంట్రాక్టర్ కట్టిన డబ్బు మొత్తం చెల్లిస్తామన్నా.. కాదు చీరలు కావాలని పట్టుబడుతున్నారు.

కొన్ని ఏళ్ల నుంచి ఇలాగే..

గత కొన్ని దశాబ్దాల నుంచి అన్ని దేవాలయాల్లో ఇలాగే చీరల టెండర్ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. ప్రతి రోజు భక్తులు తెచ్చిన చీరలు అమ్మవారి దగ్గర పెట్టగానే అక్కడే ఉండే కాంట్రాక్టర్ మనుషులు అటు నుంచి అటే తీసుకుని వెళతారు. దీంతో వచ్చే చీరలు ఎన్ని,వాటి విలువ ఎంత అనేది అధికారులు గుర్తించలేకపోయారు.కానీ ఇప్పుడు ఈ వివాదంతో చీరలను అలాగే భద్రపరిచి లెక్కిస్తే అసలు విలువ తేలింది.ఇలా కాంట్రాక్టర్లు తక్కువ ధరకు టెండర్లు దక్కించుకుని కోట్ల రూపాయలు సంపాదించే విషయం తేటతెల్లం అయింది.

ఏమిటి వివాదం..

2019-2020 ఏడాదికి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి వచ్చిన చీరలను రాకేష్ అనే వ్యక్తి రూ.25.50 లక్షలకు టెండర్ దక్కించుకున్నాడు.అటు తర్వాత 2020-2021 ఏడాదికి కూడా రూ.32 లక్షలకు చీరెల కాంట్రాక్టు అతనికే దక్కింది. 2020 మార్చిలో కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ ఏడాదిలోనే అతనికి 3 నెలల పాటు అధికారులు పొడిగించారు. అటు తర్వాత మిగిలిన 9 నెలలకు టెండర్ పిలువగా తనకు గతంలో లాస్ వచ్చిందని రూ.26 లక్షలు చెల్లించాల్సి ఉండగా రూ.18 లక్షలకే దక్కించుకున్నారు. అయితే 2021 డిసెంబర్ లో దేవదాయ శాఖ కమిషనర్ లాక్ డౌన్ సమయం లో 292 రోజుల పాటు లీజు గడువును పొడిగిస్తూ ఇచ్చిన ఉత్వర్వులతో కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లి 9 నెలల కాలం కూడా తనకు ఫ్రీగా ఇవ్వాలని కోరాడు.

అయితే కమిషన్ ఆదేశాల ప్రకారం పొడిగింపు లేదా చెల్లించిన 13 లక్షలతో పాటు బ్యాంకు వడ్డీతో కలిపి రూ.18 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశిస్తే డబ్బు చెల్లించేందుకు ఆలయ అధికారులు ఒప్పుకున్నారు. కానీ కాంట్రాక్టర్ మాత్రం తనకు చీరలే కావాలని తాను చెల్లించిన డబ్బు వద్దన్నాడు.దీనిపై ఈవో ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్లడంతో మళ్లీ టెండర్లు పిలవమని ఆయన ఆదేశాలివ్వడంతో మళ్లీ టెండర్లు పిలిచారు.దీనిపై కాంట్రాక్టర్ మళ్లీ కోర్టుకు వెళ్లడంతో ఈవో కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని కేసు వేయడంతో ఈవోకు నెల రోజుల జైలు శిక్ష కోర్టు విధించింది.అటు తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్లి ఈవో స్టే తెచ్చుకున్నారు.

ఆలయ ఈవో వివరణ..

ఈ విషయంపై సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం ఆలయ ఈవో మనోహర్ రెడ్డిని వివరణ కోరగా చీరల వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది అన్ని ఆధారాలు కోర్టుకు సమర్పిస్తానని ఆలయానికి భారీ ఆదాయం గండిపడుతుందని ఈ విషయాన్ని కోర్టుకు వివరిస్తామని ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed