ఈ రహదారి మహాడేంజర్..

by Sumithra |   ( Updated:2023-06-07 16:20:24.0  )
ఈ  రహదారి మహాడేంజర్..
X

దిశ, మియాపూర్ : మియాపూర్ జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. ప్రతియేటా ఈ రహదారి పై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో పదుల సంఖ్యలో వాహనదారులు, పాదచారులు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకు రెట్టింపు స్థాయిలో క్షతగాత్రుల సంఖ్య ఉంటోంది. ముఖ్యంగా ఇటీవల జాతీయ రహదారి పై చోటుచేసుకుంటున్న వరుస సంఘటనలు వాహనదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో ఈ రహదారి పై మియాపూర్, మదీనగూడ వద్ద రోడ్డు దాటుతున్న ఇద్దరు మృత్యువాత పడ్డారు.

అదేవిధంగా గడిచిన ఆరు నెలల వ్యవధిలో మరో పదిమంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. ప్రధానంగా మియాపూర్, మదీనగూడ, చందానగర్ ప్రాంతాల్లో జాతీయరహదారి పై గతంతో పోల్చుకుంటే జాతీయ రహదారికి అనుసంధానంగా పెద్దఎత్తున నివాస సముదాయాలు, కాలనీలు, వాణిజ్య సముదాయాలు వెలిశాయి. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసులు పాదచారులు దాటేందుకు కొన్ని చోట్ల భారికేడ్ల మధ్యఖాళీలు వదిలివేశారు. ట్రాఫిక్ పోలీసులు సూచించిన యూటర్న్ ప్రాంతంలో కాకుండా ఆ ఖాళీగా వదిలిన భారీకేడ్ల మధ్యనుంచే పాదచారులు డివైడర్లు దాటుతూ ప్రమాదాల బారిన పడి ప్రాణాలుకోల్పోతున్నారు.

ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలి..

మియాపూర్ జాతీయ రహదారి పై ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకోవడంతో ఈ ప్రాంతాన్ని గతంలోనే సైబరాబాద్ పోలీసులు బ్లాక్ స్పాట్ గా గుర్తించారు. దీంతో పాటు పాదచారులు దాటేందుకు వీలుగా కొన్నిచోట్ల పుట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేసినప్పటికి వాటి వినియోగం మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నది. చాలా పుట్ బ్రిడ్జిలు ఏర్పాటు చేశారు కానీ వృద్ధులు, వికలాంగులు, చిన్నారులు ఎక్కేందుకు వీలుగా లిఫ్ట్ లు ఇంకా ఏర్పాటు చేయకపోవడంతో చాలామంది వాటివైపు చూడడంలేదు. అయితే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలతో పాటు అందుకుగల కారణాల పై సంబంధిత అధికారులు సమీక్షలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవల వరుస ప్రమాదాల నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యల పై స్థానిక ట్రాఫిక్ పోలీసులతో పాటు జీహెచ్ఎస్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు మియాపూర్ కూడలి నుంచి బీహెచ్ఈఎల్ కూడలి వరకు రోడ్లను క్షుణ్నంగా పరిశీలించి నివారణ చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed