గోషామహల్ సర్కిల్ లో జోరుగా అక్రమ కట్టడాలు..

by Sumithra |
గోషామహల్ సర్కిల్ లో జోరుగా అక్రమ కట్టడాలు..
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ సర్కిల్ 14 (గోషామహల్) అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారింది. తక్కువ స్థలంలో ఎక్కువ అంతస్థుల నిర్మాణాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. చివరకు అందరికీ ఆదర్శంగా, మార్గనిర్ధేశకులుగా ఉండాల్సిన అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని అనుమతులు లేకుండా ఇష్టారీతిన భవన నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. భవననిర్మాణ సమయంలో తీసుకున్న అంతస్థులకు మించి అదనపు ఫ్లోర్ లు నిర్మిస్తున్నారు. పార్టీల నాయకులను ఆదర్శంగా తీసుకుంటున్న సాధారణ ప్రజానీకం కూడా అనమతులు లేని భవనాలు చేపడుతున్నారు.

జీహెచ్ఎంసీ అధికారుల పై ఉన్నతస్థాయిలో వత్తిళ్లు తెచ్చి అక్రమ కట్టడాల వైపు కన్నెత్తి చూడకుండా చేస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధి ప్రధాన అనుచరుడు ఒకరు నియోజకవర్గంలో జరుగుతున్న నిర్మాణాల విషయంలో తరచుగా జోక్యం చేసుకుంటున్నారు. ప్రతినిత్యం జీహెచ్ఎంసీ సర్కిల్ అధికారులకు అక్రమభవనాల విషయంలో ఫిర్యాదు చేయడం ఆయనకు పరిపాటిగా మారింది. అతనికి అండగా నిలుస్తున్న ప్రజాప్రతినిధిని చూసి అధికారులు కూడా తమకెందుకు గొడవ అంటూ చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నారు. అతి తక్కువ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న అక్రమ నిర్మాణదారులకు సదరు ప్రజాప్రతినిధి అండగా నిలుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

గోషామహల్ నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. కేవలం 125, 150 చదరపు గజాల్లో ఉన్న ప్లాట్లకు జీహెచ్ఎంసీ అధికారులు ఇచ్చిన అనుమతులను కాదని ఏకంగా ఐదు అంతస్థులు, అంతకు పైగా భవానాలు నిర్మిస్తున్నారు. ఇలాంటి అక్రమ నిర్మాణాల పై స్థానికంగా చాలా ఫిర్యాదులు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి.

సర్కిల్ పరిధిలో కొత్తగా జరుగుతున్న అనేక నిర్మాణాలలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయి. ప్రధానమార్గాల్లో బహుళ అంతస్తుల భవనాలతో పాటు ఇరుకుగల్లీల్లో 20 అడుగుల రోడ్డు మాత్రమే ఉన్నసందుల్లోనూ అదనపు అంతస్తులు వేసేస్తున్నారు. ఓ మాజీ కార్పొరేటర్ సైతం స్వయంగా అక్రమ నిర్మాణం చేపడుతున్నారు. సాధారణ ప్రజలు సైతం వీరిని అనుసరిస్తూ అక్రమంగా అంతస్థులు నిర్మిస్తుండడంతో అక్రమ నిర్మాణాల జోరు మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగుతున్నాయి.

విమర్శల పాలౌతున్న అధికారుల తీరు..?

జీహెచ్ఎంసీ సర్కిల్ 14లోని మంగళ్ హాట్ డివిజన్ ఇందిరానగర్ లో చేపడుతున్న భవన నిర్మాణం విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు పలువిమర్శలకు తావిస్తోంది. గతంలో ఇదే సర్కిల్ లో పనిచేసి బదిలీ అయిన ఓ సెక్షన్ ఆఫీసర్ సోదరుడు బిల్డర్ కావడంతో సదరు సెక్షన్ ఆఫీసర్ టౌన్ ప్లానింగ్ అధికారులను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 150 గజాల లోపులో ఐదంతస్తుల భవనం నిర్మాణం కొనసాగుతుండడంతో కొంత మంది స్థానికులు సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు అక్రమ నిర్మాణంగా గుర్తించి పనులు నిలిపి వేయాలని నోటీసులు జారీ చేసి పట్టించుకోవడం మానివేయడంతో నిర్మాణ పనులు ఆగకుండా కొనసాగుతున్నాయి. నిర్మాణదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా స్టేటస్ కో విధించినట్లు టౌన్ ప్లానింగ్ అధికారులే పేర్కొంటున్నారు. అయితే తదుపరి నిర్మాణ పనులు జరుగకుండా చూడాల్సిన అధికారులు కోర్టు ఆదేశాలంటూ కాలయాపన చేయడంతో నిర్మాణదారులు భవన నిర్మాణాన్ని కోర్టు నిబంధలనకు విరుద్ధంగా కొనసాగిస్తున్నారు. ముందుగా భవనం బయట నుండి పనులు పూర్తిచేసి రంగులు కూడా వేసి భవనం లోపలి భాగంలో నిర్మాణం పూర్తిచేస్తున్నారు. న్యాయస్థానం తదుపరి ఆదేశాల వరకు పనులు నిలిపి వేయాల్సి ఉండగా అవేమి పట్టించుకోకుండా అక్రమ నిర్మాణం యదేచ్చగా కొనసాగుతోంది.

అక్రమ భవనాలను కూల్చివేయాలి..

నిబంధనలకు విరుద్ధంగా, జీ ప్లస్ వన్ అంతస్తుకు అనుమతులు తీసుకుని ఐదు, ఆరు అంతస్తులలో నిర్మిస్తున్న భవనాలను గుర్తించి కూల్చి వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కండ్ల ముందే అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే కేవలం నోటీసులు ఇచ్చి తర్వాత పట్టించుకోకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. సర్కిల్ పరిధిలో బల్దియా ఉన్నతాధికారులు పర్యటించి నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలను గుర్తించి తదుపరి చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. భవన నిర్మాణాల విషయంలో నాయకుల పేరు చెప్పి అనుచరులు చేస్తున్న ఆగడాలకు చెక్ పెట్టాలని సర్కిల్ ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed