నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పై నుండి పడి భర్త మృతి

by Sridhar Babu |   ( Updated:2023-08-16 14:55:54.0  )
నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పై నుండి పడి భర్త మృతి
X

దిశ, శేరిలింగంపల్లి : నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పై నుండి పడి ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన బుధవారం మాదాపూర్ ఖానామెట్ ఇజ్జత్ నగర్ లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రమణ అనే బిల్డర్ ఖానామెట్ ఇజ్జత్ నగర్ లో 60 గజాల స్థలంలో 6 అంతస్తుల బిల్డింగ్ నిర్మాణం చేపట్టాడు. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ వద్ద మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ కు చెందిన దంపతులు కృష్ణ, కవితలు నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నారు.

ఈ క్రమంలో బుధవారం కూడా 5వ అంతస్తులో మిగతా కూలీలతో పాటుగా పనిచేస్తున్నారు. వీరు కట్టెలపై నిలబడి పనిచేస్తున్న క్రమంలో అవి ఒక్కసారిగా విరిగిపోయాయి. దీంతో భవనం ఐదవ అంతస్తు పై నుండి లిఫ్ట్ గుంతలోకి పడిపోయారు. ఈ ఘటనలో కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య కవిత వెన్నుపూస విరగడంతో పాటు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. వీరికి ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారని బాధితుల బంధువులు తెలిపారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని, బిల్డర్ రమణపై కేసు నమోదు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story