Illegal constructions : అక్రమ కట్టడాలకు అడ్డాగా హిమాయత్ నగర్..

by Sumithra |
Illegal constructions : అక్రమ కట్టడాలకు అడ్డాగా హిమాయత్ నగర్..
X

దిశ, హిమాయత్ నగర్ : ప్రభుత్వం ఎన్నిచట్టాలు తీసుకువచ్చిన, న్యాయస్థానాలు ఎన్నిసార్లు హెచ్చరించిన అక్రమ నిర్మాణదారులు రెచ్చిపోతూనే ఉన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పక్కనే ఉన్న హిమాయత్ నగర్ డివిజన్ సర్కిల్ 16 అక్రమ కట్టడాలకు అడ్డాగా మారింది. స్ట్రీట్ నెంబర్ 1లో నిబంధనలు ఉల్లంఘించి కొంతమంది బిల్డర్లు అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని, పలుమార్లు టౌన్ ప్లానింగ్ విభాగం, న్యాక్ విభాగం, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, జలమండలి అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం శూన్యం అని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు..

హిమాయత్ నగర్ డివిజన్ జీహెచ్ఎంసీ సర్కిల్ 16లో అక్రమ కట్టడాల పై చర్యలు తీసుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్ట్రీట్ నెంబర్ 1లో అమరి డిజైనర్ జ్యూవెలరీ పక్కన, హెచ్డీఎఫ్సీ బ్యాంకు దగ్గరలో అనుమతులు తీసుకోకుండా పరిమితికి మించి భారీ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని తెలిసింది. ఈ అక్రమ నిర్మాణాలు చేపడుతున్న సదరు బిల్డర్ల వద్ద నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, న్యాక్ అధికారులు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, జలమండలి అధికారులు భారీగా ముడుపులు తీసుకుని, అటు వైపుకన్నెత్తి చూడటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి నిర్మాణాలతో అధికారులు, ప్రజాప్రతినిధులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చట్టం పేరుతో ముడుపులు !

అక్రమ నిర్మాణాల పై తమకు ఎలాంటి సంబంధం లేదంటూ సంబంధిత అధికారులు దొడ్డిదారిలో ఒక్కొక్క నిర్మాణం నుంచి భారీగా మామూళ్లు వసూలు చేస్తున్నారని తెలిసింది. అక్రమ కట్టడాల పై న్యాక్, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని నెట్టివేసి టౌన్ ప్లానింగ్ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ కట్టడాల వద్ద వసూలు చేసిన ముడుపుల్లో జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, నోడల్ ఆఫీసర్లుకు నెలవారీ వాటాలు వెళ్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే అక్రమ నిర్మా ణాల పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.



Next Story