సైరన్ ల మోత.. వీఐపీలను మరిపిస్తున్న గల్లీలీడర్లు

by Sumithra |
సైరన్ ల మోత.. వీఐపీలను మరిపిస్తున్న గల్లీలీడర్లు
X

దిశ, శేరిలింగంపల్లి : అంబులెన్స్ లకు, పోలీసులకు, వీఐపీలకు ఎమెర్జెన్సీ సేవల కోసం వినియోగించే సైరన్ లు లోకల్ గల్లీ లీడర్ల బిల్డప్ లకు, వాటి హంగు ఆర్భాటాలకు పావులుగా మారిపోతున్నాయి. ఉదయం లేచిన నుండి ప్రయాణీకులను ఆపి ముక్కుపిండి చలాన్లు వేసి, సరైన పత్రాలు లేని వారి వాహనాలను జప్తుచేసే ట్రాఫిక్ పోలీసులు.. ఎలాంటి పదవులు లేకున్నా సైరన్ లు వేసుకుని, హల్చల్ చేస్తున్న బడాబాబుల వాహనాలను మాత్రం ఆపుతున్న దాఖలాలు లేవు. వారు వెళుతున్న దారిలో ఏమాత్రం ట్రాఫిక్ కనిపించినా, లేదా ఎక్కడైనా జనాలు గుమికూడినా వెంటనే సైరన్ లు వేసిహల్చల్ చేస్తూ నానా యాగి చేస్తున్నారు కొందరు ఛోటామోటా లీడర్లు.

గల్లీ లీడర్ల హల్చల్..

శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన ఓ గల్లీ నాయకుడు గత కొద్దిరోజుల క్రితం ఓ ఇన్నోవా కారు కొన్నారు. దానికి మామూలు హారన్ తీపించి సైరన్ బిగించారు. ఇక ఎక్కడికి వెళ్లినా, రోడ్డుపై ఏ కాస్త రద్దీ ఉన్నా ఆ వాహనం డ్రైవర్ హారన్ మోగిస్తూ నానా యాగీ చేసేస్తున్నారు. ఆయనే కాదు ఆయన కుటుంబ సభ్యులు ఆ వాహనంలో ప్రయాణించినా అదే రణగొన ధ్వని ఇష్టారీతిగా సైరన్ వేయిస్తూ రోడ్డుపై హల్చల్ చేస్తున్నారు. అయినా ట్రాఫిక్ పోలీసులు ఎందుకో ఆ వాహనం పై దృష్టి పెట్టడం లేదు. ఈ ఒక్క వెహికిల్ మాత్రమే కాదు ఇలాంటివి శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా చాలానే ఉన్నాయి. గల్లీ లీడర్లు తమ దర్పం చూపించుకునేందుకు ఇలాంటి సైరన్ లు బిగించుకుని హారన్ లతో మామూలు ప్రజానీకాన్ని, రోడ్లపై వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

చాంతాడంత ఛలాన్లు..

సైరన్ లు మోగిస్తూ రోడ్లపై నానా హంగామా సృష్టిస్తున్న ఇలాంటి వాహనాలకు సంబంధించిన పెండింగ్ ఛలాన్లు వేలల్లో ఉన్నాయి. శేరిలింగంపల్లి ప్రాంతంలో నిత్యం హల్చల్ చేస్తున్న ఓ ఇన్నోవా వాహనం పై ఓవర్ స్పీడింగ్, సిగ్నల్ జంపింగ్, రాంగ్ పార్కింగ్ అంటూ వేల రూపాయల చలాన్లు ఉన్నాయి. కానీ ఆ చలాన్లలో ఒక్కటి కూడా ధ్వని కాలుష్యానికి సంబంధించిన ఫైన్స్ లేకపోవడం గమనార్హం. స్పెషల్ సైరన్ లు వేసుకుని వాహనాలు నడపడం ఆర్టీఏ రూల్స్ కు వ్యతిరేకం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేవలం కొందరికి మాత్రమే ఈ సైరన్ లు ఉపయోగించుకునే అవకాశం ఉంది. మిగతా ఎవరు ఇలాంటివి ఉపయోగించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆర్టీఓ అధికారులు చెబుతున్నారు.

వీరు తగ్గరు.. వారు పట్టించుకోరు..

చాలామంది నాయకులు తమ పలుకుబడిని, తమకు ఉన్న రాజకీయ పదవులను బహిరంగంగా జనాల ముందు చూపెట్టుకునేందుకు తెగతాపత్రయ పడుతున్నారు. ఇందులో భాగంగా తమ వాహనాలకు సైరన్ లు పెట్టించి రోడ్ల మీదకు రావడం, జనాల మధ్య సైరన్ లు మోగించి తాము గొప్ప వాళ్లం అని చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాఫిక్ లోనే కాదు మామూలు చోట, హాస్పిటల్స్ ఉన్న చోట, పెళ్లిల్లు, ఇతర కార్యాలకు వెళ్లిన చోట కూడా ఈ తరహా మోతలు మోగిస్తూ సొంత డబ్బా కొట్టుకునేందుకు ఉబలాట పడుతున్నారు. సంబంధిత అధికారులు ఇలాంటి వాహనాలను సీజు చేసి, వాటికి కారణమవుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed