మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందిః మంత్రి పొన్నం

by Nagam Mallesh |
మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందిః మంత్రి పొన్నం
X

దిశ, హైదరాబాద్ బ్యూరోః తెలంగాణలో మహిళల సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. జాతి నిర్మాణం, దేశ అభివృద్ధి కోసం మహిళా సాధికారిత తప్పనిసరని, ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పొన్నం ప్రభాకర్ అన్నారు. అందుకు అనుగుణంగా మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తొలి సంతకం మహిళా సాధికారత కొరకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించేలా చేసినట్టు తెలిపారు. స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో అఖిలభారత విద్యాసంఘాల సమాఖ్య అధ్యక్షుడు సుధీర్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. అఖిల భారత విద్యాసంఘాల సమాఖ్య (ఐఫియా), తెలంగాణా రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టి.ఆర్.టి.ఎఫ్) లు సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సులో మంత్రి పొన్నం ముఖ్య అతిథిగా పాల్గొని‌ మాట్లాడారు.

మహిళా ఆత్మ గౌరవాన్ని పెంపొందించడానికి ఆర్టీసీ బస్సు ప్రయాణంలో మహిళకు ఉచిత ప్రయాణం ద్వారా ఇప్పటికే 81 కోట్ల ప్రయాణాలను ఉచితంగా అందించామని పేర్కొన్నారు. సాధికారతలో భాగంగానే అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో పాఠశాల మౌలిక వసతుల కల్పనలో మహిళా సంపూర్ణ భాగస్వామి చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోనికి వచ్చిన వెంబటే 10 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ పదోన్నతులు కల్పించడం ద్వారా ఈ రాష్ట్రంలో 25 వేల మంది ఉపాధ్యాయులు పదోన్నతులు పొందారని తెలిపారు. అతి త్వరలోనే ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, ప్రొఫెసర్ వై ప్రశాంతి, ఐఫియా ప్రధాన కార్యదర్శి నబ్ కుమార్ కర్మకార్, కె.సుబ్బారెడ్డి, స్టాన్టీ కళాశాలల చైర్మన్ కె కృష్ణారెడ్డి, కావలి అశోక్ కుమార్, కటకం రమేష్, మారెడ్డి అంజిరెడ్డి, ప్రణీద్, కటకం రవికుమార్, మిథిలేష్ శర్మ, మనోజ్ కుమార్, కమల్ లోచక్, కిరణ్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు .

Next Story

Most Viewed