ప్రైవేట్ బడులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు : ప్రభుత్వ విప్ గాంధీ

by Sridhar Babu |
ప్రైవేట్ బడులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు : ప్రభుత్వ విప్ గాంధీ
X

దిశ, శేరిలింగంపల్లి : ప్రైవేట్ బడులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన బస్తీ - మన బడి కార్యక్రమంలో భాగంగా శనివారం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని హెచ్ ఎంటీ వీకర్ సెక్షన్ కాలనీలో గల మండల ప్రాథమిక పాఠశాలలో రూ. 53.58 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన మౌలిక వసతుల ఏర్పాట్లను మండల విద్యాధికారి ఆంజనేయులు, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన బస్తీ - మన బడి కార్యక్రమం మొదటి విడతలో పనులు పూర్తయిన పాఠశాలలు ఫిబ్రవరి 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించామని, దశల వారీగా అన్ని పాఠశాలలు అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయని, నిన్నా మొన్నటి వరకు శిథిలావస్థలో కునారిల్లిన పాఠశాలలు సైతం నేడు అధునాతన సకల హంగులతో, కొత్త సొగసును సంతరించుకుంటున్నాయన్నారు. సకల సదుపాయాలతో విద్యార్థులు ఏకాగ్రతతో నిశ్చింతగా చదువులు కొనసాగించేందుకు అవసరమైన ఆహ్లాదకర వాతావారణాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలు అసలు సిసలైన సరస్వతీ నిలయాలుగా రూపుదిద్దుకుంటున్నాయని, ప్రభుత్వ పాఠశాలలను అన్ని రకాల వసతులతో ప్రైవేట్ స్కూల్​లకు ధీటుగా తీర్చిదిద్దే క్రమంలో మన ఊరు మన బడి కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప విషయం అని అన్నారు. శేరిలింగంపల్లి మండల పరిధిలో 24, కూకట్ పల్లి మండల పరిధిలో 7, మొత్తం 31 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కలిపించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ దాసయ్య, ఏఈ ధీరజ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story