మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

by Sridhar Babu |
మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
X

దిశ, శేరిలింగంపల్లి : మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి సాధికారతతో పాటు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకుగాను తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఎంఈఐఎల్ (మెయిల్) ఫౌండేషన్, సుధా రెడ్డి ఫౌండేషన్ సంయుక్తంగా ఆదివారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా పింక్ పవర్ రన్ 2024 కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ పింక్ రన్ ను ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జెండా ఊపి ప్రారంభించగా బహుమతులను సీఎం రేవంత్ రెడ్డి ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యమే కుటుంబాలకు బలమని, సమాజ శ్రేయస్సుకు అదే పునాది అన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణ, సంక్షేమం కోసం రాష్ట్రంలో మరిన్ని ఆసుపత్రులు నిర్మిస్తామని, సంబంధిత వ్యవస్థలను బలోపేతం చేస్తామని తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్ పై మహిళలకు అవగాహన కల్పించేందుకు పింక్ రన్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను సీఎం అభినందించారు. పక్షి ఆకృతిలో అతిపెద్ద మానవహారంగా ఏర్పడిన వాలంటీర్లను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరెకెపూడి గాంధీ, శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, పలువురు వైద్యులు, సుధా రెడ్డి ఫౌండేషన్ నిర్వాహకులు పాల్గొన్నారు.

జెండాఊపి రన్ ప్రారంభించిన మంత్రి దామోదర

రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన పింక్ రన్ ను ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జెండా ఊపి ప్రారంభించారు. ఒకేసారి 3కె, 5కె, 10 కె రన్ నిర్వహించారు. ఈ రన్ లో 5 వేల మందికి పైగా రన్నర్స్ పాల్గొన్నారు. గచ్చిబౌలి స్టేడియం నుండి విప్రో సర్కిల్, టీఎన్జీఓ కాలనీ మీదుగా రన్ కొనసాగింది. పింక్ మారథాన్ లో ఇంత పెద్ద మొత్తంలో రన్నర్స్ పాల్గొనడం వరల్డ్ రికార్డు అని నిర్వాహకులు తెలిపారు. ఈ మారథాన్ లో పాల్గొన్న వారికి న్యూట్రీషన్ కిట్స్ పంపిణీ చేశారు.

Advertisement

Next Story