వ్యవసాయరంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెరగాలి

by Sridhar Babu |
వ్యవసాయరంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెరగాలి
X

దిశ, ముషీరాబాద్ : వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెరగాలని సికార్ పార్లమెంట్ సభ్యులు, ఏఐకేఎస్‌ జాతీయ ఉపాధ్యక్షులు అమ్రారామ్ డిమాండ్‌ చేశారు. డిజిటలైజేషన్‌ పేరుతో కార్పొరేట్ల చేతుల్లో వ్యవసాయ రంగాన్ని పెడుతున్నారని ఇది రైతాంగం జీవనోపాధికి ముప్పుగా పరిణమించిందని అన్నారు. బీజేపీ అనుసరిస్తున్న కార్పొరేట్‌ అనుకూల వ్యవసాయ విధానాలకు వ్యతిరేకంగా సమైక్యంగా ఉద్యమించాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ లతో కలిసి బుధవారం విలేకరులతో మాట్లాడారు. భారతదేశంలో అధికభాగం రైతుల్లో చిన్న, సన్నకారు రైతులు, భూమిలేని కౌలు రైతులు ఉన్నారని అన్నారు. బడా వ్యాపారవేత్తలను డిజిటలైజేషన్‌లో చేర్చినట్లైతే ఇక మొత్తంగా వ్యవసాయ ఉత్పత్తులపై కార్పొరేట్లు ఆధిపత్యం చెలాయిస్తాయని, రైతుల జీవనోపాధి దెబ్బ తింటుందని అన్నారు. ఇటీవల డిజిటల్‌ అగ్రికల్చర్‌ మిషన్‌ (డీఎఎం)కు అధిక ప్రాధాన్యతనిస్తూ 7 కొత్త పథకాలను కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించిందని గుర్తుచేశారు.

రైతుల ఆదాయాన్ని పెంచేందుకే ఈ ప్రాజెక్టు అని ప్రభుత్వం చెబుతోందని, వ్యవసాయం, సంబంధిత రంగాలకు రూ.14వేల కోట్ల కేటాయింపులను ఆమోదించిందన్నారు. అంతర్జాతీయ ఆర్థిక పెట్టుబడిదారుల డిమాండ్లకు అనుగుణంగా భారత వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్‌ చేయడానికే ఈ ప్రాజెక్టు చేపట్టారని అన్నారు. అలాగే వ్యవసాయ పరిశోధనను ఆధునీకరించడానికి ప్రకటించిన పథకంలో కేంద్ర ప్రభుత్వ స్వేచ్ఛా మార్కెట్‌ ప్రవృత్తి స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. నయా ఉదారవాద నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ)కు అనుగుణంగా ఉండేలా వ్యవసాయ రంగ పరిశోధనను ఆధునీకరిస్తున్నామని చెప్పిందని అన్నారు. దీనివల్ల ప్రభుత్వ పెట్టుబడులు వ్యవసాయ రంగంలో మరింత తగ్గిపోతాయని, భారతీయ వ్యవసాయ పరిశోధనా ఎజెండాకు రూపమివ్వడంలో డిజిటల్‌, వ్యవసాయ కార్పొరేషన్ల ప్రభావం ఎక్కువవుతుందని అన్నారు.

బేయర్‌, సింజెటా, అమెజాన్‌ సహా బహుళ జాతి కార్పొరేట్ లను భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌)తో ఒప్పందాలపై సంతకాలు చేయడం ద్వారా పెద్ద ఎత్తున దేశ వ్యవసాయ రంగంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో వీటిని చూడాల్సి ఉంటుందని చెప్పారు. 2024-25 బడ్జెట్‌లో ప్రైవేట్‌ పరిశోధనకు ప్రభుత్వ నిధులు ఇస్తామని కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారని గుర్తు చేశారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించడానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పాల్పడుతుందని, దీనిపట్ల జాగ్రత్తగా ఉండాలని రైతులకు చెప్పారు. దేశవ్యాప్తంగా రైతులందరూ ఐక్యతతో కార్మికులను, ఇతర ప్రజలను కలుపుకుని ఈ కార్పొరేట్‌ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెంచాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ ఉపకరణాల అన్నింటిపై జీఎస్టీని ఉపసంహరించడం ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలని, రైతుల రుణ భారాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Next Story

Most Viewed