వారితో అధికారులు కుమ్మ‌క్కు.. జీహెచ్ఎంసీ ఆదాయానికి గండి

by Sathputhe Rajesh |   ( Updated:2022-03-25 06:24:30.0  )
వారితో అధికారులు కుమ్మ‌క్కు.. జీహెచ్ఎంసీ ఆదాయానికి గండి
X

అక్ర‌మ నిర్మాణాల‌ను ఉపేక్షించేది లేదు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నిర్మాణాలు చేప‌డితే కూల్చివేస్తామంటూ అధికారులు, ఉన్న‌తాధికారులు నిత్యం చెప్పే మాట‌లు నీటి మూట‌లుగానే మిగిలిపోతున్నాయి. కొంద‌రు టౌన్‌ ప్లానింగ్ అధికారుల వ్య‌వ‌హారం ఉన్న‌తాధికారుల‌కు త‌ల‌నొప్పిగా మారింది. అక్ర‌మార్కుల‌తో టౌన్ ప్లానింగ్ అధికారులు కుమ్మ‌కై ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు దండుకుంటున్నార‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. అక్ర‌మ నిర్మాణం అని ముందే తెలిసినా ప‌ట్టించుకోని టౌన్‌ ప్లానింగ్ అధికారులు భ‌వ‌నం ఐదు అంతుస్తుల ఎత్తుకు లేవ‌గానే అక్క‌డ వాలిపోతూ..అక్ర‌మ నిర్మాణం అంటూ చెప్పి భ‌వ‌న య‌జ‌మానుల‌తో కుమ్మ‌క్కు అవుతున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. దీంతో య‌జ‌మానుల‌తో ఒప్పందానికి వ‌చ్చి పేరుకు మాత్ర‌మే తూ..తూ మంత్రంగా కూల్చివేత‌లు చేప‌ట్టి చేతులు దులుపుకుంటున్నార‌ని ప‌లువురు ఆరోపిస్తున్నారు. దీంతో అక్ర‌మార్కులు రెచ్చిపోతున్నారు. కూల్చివేత‌లు చేప‌ట్టిన భ‌వ‌నాల‌కు సైతం మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టి నిర్మాణాల‌ను పూర్తి చేసుకుంటున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం ఉన్న‌తాధికారుల‌కు కూల్చివేత‌లు చేప‌ట్టిన‌ట్లు మ‌స్కా కొడుతున్నారు. దీంతో ఎల్బీన‌గ‌ర్ స‌ర్కిల్-4 ప‌రిధిలో అక్ర‌మ నిర్మాణాల‌కు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు లీల‌లు అన్నీ.. ఇన్నీ కావు. మ‌రీ ముఖ్యంగా ఎల్బీన‌గ‌ర్ స‌ర్కిల్‌-4 టౌన్‌ప్లానింగ్ ఏసీపీ, టీపీఓ, చైన్‌మెన్‌లు ఉన్న‌తాధికారుల‌నే బురిడీ కొట్టిస్తున్నారు. స‌ర్కిల్ -4 ప‌రిధిలోని లింగోజీగూడలో జీ+2 అనుమ‌తులు తీసుకున్న భ‌వ‌న య‌జ‌మాని ఏకంగా ఐదు అంత‌స్తుల భ‌వ‌నాన్ని నిర్మించారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారుల‌కు ఫిర్యాదు అంద‌డంతో భ‌వ‌న య‌జ‌మానికి నోటీసులు ఇచ్చి భ‌వ‌నం కూల్చివేత‌లు చేప‌ట్టారు. అయితే ఇక్క‌డే ఓ గ‌మ్మ‌త్తు ఉంది. అక్ర‌మంగా నిర్మించిన అంత‌స్తుల‌ను కూల్చివేయాలి. కానీ టౌన్‌ప్లానింగ్ అధికారులు ఐదో అంత‌స్తులో ఉన్న భ‌వ‌నానికి రెండు చోట్ల తూ..తూ మంత్రంగా రంధ్రాలు చేసి చేతులు దులుపుకున్నార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నారు. అక్ర‌మ భ‌వ‌న నిర్మాణ య‌జ‌మానుల‌తో కుమ్మ‌కైన అధికారులు పేరుకు మాత్ర‌మే కూల్చివేత‌లు చేప‌డ‌తున్న‌ట్లు బిల్ట‌ప్ ఇచ్చార‌ని ప‌లువురు వాపోతున్నారు.

కూల్చివేత‌ల‌తో ప్ర‌యోజ‌నం ఏమిటీ..?

అక్ర‌మ నిర్మాణాలు జ‌రిగిన‌ప్పుడు కూల్చివేత‌లు చేప‌ట్టే అధికారం టౌన్‌ప్లాంగ్ అధికారుల‌కు ఉంటుంది. ఇదే ఇప్ప‌డు వారికి కాసుల పంట పండిస్తుంద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ముందే క్షేత్ర స్థాయిలో భ‌వ‌నం యొక్క నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించే చైన్‌మెన్‌ల‌కు, టీపీఓల‌కు, ఏసీపీల‌కు ఆ భ‌వ‌నం అక్ర‌మంగా నిర్మిస్తున్నార‌ని తెలుసు. అయినా ముడుపుల‌కు ఆశ‌ప‌డి ఆ అక్ర‌మ నిర్మాణాల‌పై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోరు. అయితే ఉన్న‌తాధికారుల‌కు ఎవ‌రైనా ఫిర్యాదు చేయ‌డంతో అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌లు చేప‌డుతున్న‌ట్లు బిల్డ‌ప్ ఇస్తారు. తీరా అక్క‌డికి వెళ్లి ఒక‌టి రెండు చోట్ల అక్క‌డ‌క్క‌డ కూల్చివేసి డిమాలైజేష‌న్ చేసిన‌ట్లు ఉన్న‌తాధికారుల‌కు రిపోర్ట్‌లు పంపుతున్నారు. దీంతో అక్ర‌మ నిర్మాణ ప‌నులు కొద్ది రోజులు ఆగినా.. వారం ప‌ది రోజుల్లో భ‌వ‌న య‌జ‌మానులు తిరిగి మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టి అక్ర‌మ భ‌వ‌నాల‌ను పూర్తి చేసుకుంటున్నారు. దీనివ‌ల్ల జీహెచ్ఎంసీ ఆదాయానికి రెండు విధాల గండిప‌డుతుంది. ఇలాంటి కూల్చివేత‌లు చేప‌ట్ట‌డం వ‌ల్ల ఎవ‌రికి ప్ర‌యోజ‌నం అని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

ల‌క్ష‌లు దండుకుంటున్నారు..!

కూల్చివేత‌ల పేరుతో టౌన్‌ప్లానింగ్ అధికారులు ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు దండుకుంటున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మీ భ‌వ‌నం అక్ర‌మ నిర్మాణం అని ఉన్న‌తాధికారుల‌కు ఎవ‌రో ఫిర్యాదు చేశారు. కాబ‌ట్టి మేము ఎదో రకంగా కూల్చివేత‌లు చేప‌ట్టిన‌ట్లు చేస్తాము. త‌రువాత మీరు మ‌ళ్లీ మీప‌ని మీరు కానీయండి.. కానీ మాకు ఇంత ముట్ట‌జెప్పండ‌ని ముందే అక్ర‌మ భ‌వ‌న నిర్మాణ‌దారుల‌తో ఒప్పందం చేస్తుకుంటున్న‌ట్లు ప‌లువురు ఆరోపిస్తున్నారు. అందుకే జీ+2 భ‌వ‌నం కోసం అనుమ‌తి తీసుకుని ఐదు అంత‌స్తుల భ‌వ‌నాలు నిర్మిస్తూ అక్ర‌మార్కులు రెచ్చిపోతున్నార‌ని ప‌లువురు వాపోతున్నారు. అనుమ‌తులు లేని భ‌వనాల కూల్చివేత‌లు పూర్తి స్థాయిలో చేప‌ట్టాల్సిన టౌన్‌ప్లానింగ్ అధికారులు తూ..తూ మంత్రంగా మమ అనిపిస్తున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు.

Advertisement

Next Story