GHMC: ఆదాయం‌పై అశ్రద్ధ.. దుబారా పైనే శ్రద్ధ..!

by Shiva |   ( Updated:2024-08-16 15:11:13.0  )
GHMC: ఆదాయం‌పై అశ్రద్ధ.. దుబారా పైనే శ్రద్ధ..!
X

దిశ, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నా, గట్టెక్కించేందుకు అధికారులు గానీ, పాలకమండలి గానీ ఏమాత్రం శ్రద్ధచూపటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం సర్కారు నుంచి జీహెచ్ఎంసీకి రూ.వేల కోట్లు బకాయిల రూపంలో రావల్సి ఉందని చెప్పుకోవటం తప్పా, తమ పని నైపుణ్యతను, సమర్థతను వినియోగిస్తూ ఆదాయ వనరులను అన్వేషించటం, వివిధ మార్గాల్లో నిధులను సమీకరించటంపై ఏమాత్రం చొరవచూపటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిటైర్‌మెంట్‌కు దగ్గరలో ఉండి, జీహెచ్ఎంసీకి ఆదాయాన్ని సమకూర్చటంతో పాటు దుబారాకు బ్రేక్ వేయగలిగే ఆఫీసర్లకు జోనల్ కమిషనర్ పోస్టింగ్‌లు, విభాగాల కేటాయింపుల్లో అన్యాయం జరుగుతున్నట్లు బల్దియాలో చర్చ జరుగుతోంది.

హైదరాబాద్ నగరం బౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అవగాహన లేకుండా, మొట్టమొదటి సారిగా జీహెచ్ఎంసీలో పోస్టింగ్‌లు పొంది వస్తున్న అధికారులకు కీలక విభాగాలను అప్పగిస్తున్నారే తప్పా, జీహెచ్ఎంసీ మనుగడను దృష్టిలో పెట్టుకుని పోస్టింగ్‌ల కేటాయింపులు జరగటం లేదన్న వాదనలున్నాయి. పట్టణ సామాజిక అభివృద్ధి అంశానికి సంబంధించి ఉన్నతాధికారుల అంచనాలే తారుమారు చేయగలిగే తరహాలో విధులు నిర్వర్తించే సమర్థత కలిగిన అధికారులకు సైతం నేటికీ ఛాంబర్లు కేటాయించటం లేదంటే జీహెచ్ఎంసీ వృద్ధిపై ఉన్నతాధికారులకు ఉన్న చిత్తశుద్ధిని అంచనా వేయవచ్చు.

లూప్ లైన్‌లో సీనియర్ అధికారులు..

ముఖ్యంగా జీహెచ్ఎంసీపై పట్టు కలిగి, దశాబ్దాలుగా జీహెచ్ఎంసీలోనే డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, అదనపు కమిషనర్లుగా విధులు నిర్వహించిన పలువురు అధికారులను నేటికీ లూప్ లైన్‌లోనే కొనసాగించటం వల్లే జీహెచ్ఎంసీ ఆర్థికంగా ఎలాంటి వృద్ధి సాధించలేకపోతుందన్న వాదనలున్నాయి. జీహెచ్ఎంసీకి ఆర్థిక వనరులను సృష్టించే సమర్థత కలిగిన ఓ అదనపు కమిషనర్‌ను కూడా లూప్ విభాగానికే పరిమితం చేశారన్న వాదనలున్నాయి. నిత్యం అవినీతి, అక్రమాల ఆరోపణలెదుర్కొంటున్న శానిటేషన్ విభాగాన్ని గాడినపెట్టి, సమర్థవంతంగా పర్యవేక్షిస్తున్న అదనపు కమిషనర్‌ను ఆ విభాగం నుంచి తప్పించి, కొత్తగా వచ్చిన అదనపు కమిషనర్‌కు అప్పగించినట్లు సమాచారం.

పైరవీలతోనే పోస్టింగ్సా?

కొత్త సర్కారు వచ్చిన తర్వాత జీహెచ్ఎంసీకి ఆర్థికంగా లాభాన్ని చేకూర్చే అధికారులను వదిలి దుబారా ఖర్చు చేసే ఆఫీసర్లకే కీలక పదవులు దక్కుతున్నట్లు ఆరోపణలున్నాయి. పైరవీలు చేసుకుని, మంత్రుల సిఫార్సులున్న వారికే పోస్టింగ్‌లు దక్కుతున్నట్లు చర్చ జరుగుతుంది. కొందరు అధికారులు డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, అదనపు కమిషనర్లుగా దాదాపు నగరంలోని అన్ని జోన్లలో విధులు నిర్వర్తించిన అనుభవం కలిగిన ఆఫీసర్లు సైతం ఉన్నా, వారిని జీహెచ్ఎంసీ ఆర్థికంగా నిలదొక్కుకునే దిశగా ఎందుకు వినియోగించుకోవటం లేదన్న విమర్శలున్నాయి.

ప్రస్తుతం అదనపు కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి గతంలో డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తూ తన సర్కిల్ పరిధిలో జరిగే అక్రమాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం పరిధిలోకి తీసుకువచ్చి, భారీగా జరిమానాలు వేసి, జీహెచ్ఎంసీకి ఆదాయాన్ని సమకూర్చారు. కొంతకాలంగా తనకు జోనల్ కమిషనర్ పోస్టు ఇవ్వాలని కోరుతున్నా ఉన్నతాధికారులు అవకాశం కల్పించటం లేదు. లక్షల రూపాయలు చేతులు మారితే గానీ, ముఖ్యమైన అమాత్యుల సిఫార్సులంటే గానీ బల్దియాలో పోస్టింగ్ దక్కటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దశాబ్ధాల తరబడి అనుభవం కలిగి, సిటీలో పెరుగుతున్న పట్టణీకరణలో ఆదాయ మార్గాలెలా సృష్టించుకోవాలన్న విషయంపై నైపుణ్యత కలిగిన ఆఫీసర్లు జోనల్ కమిషనర్లుగా వ్యవహరిస్తే బల్దియా సొమ్ము దుబారాగా ఖర్చు చేయకుండా అదుపు చేస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సిన్సియర్ ఆఫీసర్లకు దక్కని పోస్టులు..

ఎస్టేట్ విభాగానికి సంబంధించి ప్రక్షాళన మొదలుపెట్టి, ఆ విభాగాన్ని లాభాల బాటలోకి తీసుకువచ్చేందుకు కృషి చేసిన ఓ అదనపు కమిషనర్‌ను జీహెచ్ఎంసీ నుంచి బయటకు పంపేశారు. కొంతకాలం తర్వాత సదరు అధికారి మళ్లీ జీహెచ్ఎంసీలోకి బదిలీ అయినా, ఆ అధికారికి చాంబర్ సైతం కేటాయించకుండా నెలల పాటు ప్రధాన కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించుకున్నట్లు తెలిసింది. నిబద్దతతో పనిచేసే ఆఫీసర్లకు జోనల్ కమిషనర్, అదనపు కమిషనర్ పోస్టులు కేటాయించటం లేదన్న వాదనలున్నాయి. ఈ విషయాన్ని కొందరు అధికారులు నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Advertisement

Next Story