గ్రేటర్ హైదరాబాద్‌లో పెరిగిన గంజాయి,డ్రగ్స్‌ కేసులు..

by Aamani |
గ్రేటర్ హైదరాబాద్‌లో పెరిగిన గంజాయి,డ్రగ్స్‌ కేసులు..
X

దిశ,హైదరాబాద్ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ లో గంజాయి, డ్రగ్స్ విక్రయాలు రోజు రోజుకు పెరిగిపోవడం ఆందోళన కల్గిస్తోంది. గత కొన్ని రోజులుగా ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు నిత్యం దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నప్పటికీ గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా ఆగడం లేదు.గతంలో శ్రీమంతులు నివాసముండే ప్రాంతాలలో చిన్న చిన్న కిరాణా షాపులలో పాల ప్యాకెట్లు లభించినట్లు గంజాయి విక్రయాలు జరుగుతుండడంతో పరిస్థితికి అద్దం పడుతోంది. వీటికి అలవాటైన యువతకు సులువుగా ఇవి దొరుకుతుండడంతో వారు గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ ఉజ్వల భవిష్యత్తు ను నాశనం చేసుకుంటున్నారు. ఇటివల కాలంలో పోలీసులు దాడులు పెంచి నిందితులను కటకటాల్లోకి నెడుతున్నప్పటికీ ఎప్పటికప్పుడు గంజాయి రవాణాకు కొత్త మార్గాలు అన్వేషిస్తూ యదేచ్ఛగా విక్రయాలు చేపడుతున్నారు. ముఖ్యంగా జంట నగరాల పరిధిలో గంజాయి రవాణా, విక్రయాలకు పేరొందిన దూల్ పేట్ ప్రాంతంలో యువతలో మార్పు తెచ్చేందుకు పోలీస్ అధికారులు నిరంతరం చర్యలు తీసుకుంటున్నప్పటికీ వారిలో మార్పు రావడం లేదు.వీరిలో మార్పు కోసం ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి పటిష్టమైన చర్యలకు అధికారులను ఆదేశించారు.

పెరుగుతున్న విదేశీ సంస్కృతి....

అభివృద్ధితోపాటు విస్తరిస్తున్న హైదరాబాద్‌ నగరంలో పాశ్చాత్య సంస్కృతి పెరుగుతోంది. మద్యం, మసాజ్‌ లు, పబ్‌లు, బార్‌లు, డాన్స్‌ల వంటి విదేశీ కల్చర్ పెరిగిపోతోంది. ఫలితంగా గంజాయి అమ్మకాలతోపాటు డ్రగ్స్‌ విక్రయాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. వివిధ రకాల పేరుతో విదేశీ మార్కెట్లలో లభించే మాదకద్రవ్యాలు నేరుగా హైదరాబాద్‌ చేరుతున్నాయంటే ఈ దందా ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. డ్రగ్స్‌ విభాగాలు, పోలీసులు సైతం అడ్డుకోలేకపోతున్నారంటే వారి నెట్‌వర్క్‌ ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. నైజీరియా, ఆఫ్రికా లాంటి దేశాల నుంచి ఇక్కడికి స్టూడెంట్‌ వీసాలపై వచ్చి మత్తుమందు వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు.

కొకైన్‌, హెరాయిన్‌ చరస్‌, హీషీం వంటి డ్రగ్స్‌ను దిగుమతి చేస్తూ ఓపియం, గంజాయి లాంటి మాదకద్రవ్యాలను విక్రయించి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. డ్రగ్స్ మత్తులో ఏం చేస్తున్నారో తెలియక యువత తమకు తెలియకుండానే నేరాలకు పాల్పడుతున్నారు. మత్తు పదార్థాలు సేవించడం, విక్రయించడం వంటివి చేస్తున్నారు . మత్తు దిగిన అనంతరం చేసిన తప్పు తెలుసుకున్న అప్పటికే పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతుండడంతో వారి బంగారు భవిష్యత్ నాశనమౌతుంది. ఈ నేపథ్యంలో గురువారం మాదాపూర్ ప్రాంతాల్లో అధికారులు నిర్వహించిన దాడులలో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు డ్రగ్స్ అమ్మకానికి ప్రయత్నిస్తూ పట్టుబడ్డారు. వీరి నుంచి అధికారులు సుమారు రూ 70 వేల విలుగ గల 30 ఎల్ ఎస్ డీ బ్యాస్ట్ ను స్వాధీనం చేసుకోవడమే కాకుండా నిందితులపై కేసులు నమోదు చేశారు .

ఆకర్షితులవుతున్న విద్యార్థులు..

నైజీరియా, ఘనా లాంటి ఆఫ్రికా దేశాల నుంచి విద్యార్థులు అత్యధికంగా స్టూడెంట్‌ వీసాపై నగరానికి వస్తున్నారు. వారి అలవాట్లు, ఖర్చులకు డబ్బు సరిపోకపోవడంతో అడ్డదారులు తొక్కుతున్నారు. వారి దేశాల్లో విరివిగా లభించే మాదకద్రవ్యాలను ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో ఉన్న బడా స్మగ్లర్ల ద్వారా కొకైన్‌, హెరాయిన్‌ లాంటి వాటిని నగరానికి తరలించి వారు వాడటమే కాకుండా ఇక్కడి యువతకు దాని రుచి చూపించి వారిని మాదకద్రవ్యాలకు బానిసలుగా చేస్తున్నారు. అలవాటు పడిన తర్వాత దాన్ని కొనుగోలు చేయటానికి డబ్బులు లేకపోవడం లేదా లాభార్జన కోసం యువత డ్రగ్స్‌ వ్యాపారం చేయటానికి కూడా వెనుకాడటం లేదు. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు టార్గెట్ చేసుకుని వీరు దందాలు నడుపుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇంజనీరింగ్ కళాశాలలు అధికంగా నగరం శివారు ప్రాంతాల్లో ఉండడం, అక్కడ గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అమ్మకాలు, వినియోగం కొంత సులువు కావడంతో మాదకద్రవ్యాల సరఫరా ముఠాలు కాలేజీ విద్యార్థులనే ముఠా టార్గెట్‌ చేస్తున్నాయి.

గంజాయి , కొకైన్‌ లాంటి వాటిని రుచి చూసిన కొంతమంది విద్యార్థులు దానికి దాసోహం అవుతున్నారు. మద్యం తాగితే మత్తు గంటల పాటు ఉంటుంది, అదే మాదకద్రవ్యాలు తీసుకుంటే కొన్ని రోజుల వరకు ప్రభావం ఉంటుందని , మెదడు చురుకుగా పనిచేస్తుందని మాయ మాటలు చెప్పి యువతను ఈ వలయంలోకి నెట్టుతున్నారని సమాచారం . ఇవే కాకుండా నూతన సంవత్సర వేడుకలు, కాలేజీ ఫంక్షన్లు, ఇతర ప్రధాన కార్యక్రమాలు జరిగినప్పుడు డ్రగ్స్‌ అధిక మొత్తంలో తెప్పించి సరఫరా చేస్తున్నట్లు సమాచారం. మాదకద్రవ్యాల నిషేధాన్ని పటిష్ఠంగా అమలు చేసేందుకు పోలీసులు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నగర ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed