అవే అబద్దాలు.. కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్

by srinivas |
అవే అబద్దాలు.. కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అబద్దాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ పాలమూరు జిల్లాను నిర్లక్ష్యం చేశారనడం సీఎం రేవంత్ అవగాహనా రాహిత్యానికి నిదర్శనం అన్నారు. కాంగ్రెస్ వందల కేసులు వేసినా కుట్రలను చేధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90 శాతం పనులు పూర్తి చేసిన ఘనత కేసీఆర్ దే అన్నారు. కేవలం రూ.200 కోట్లు ఇస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఎలక్ట్రికల్ పనులు ముందుకు సాగుతాయన్నారు. పాలమూరు బిడ్డగా చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డికి కనీసం రూ.200 కోట్లు ఇచ్చే తీరిక లేదని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చి 339 రోజులు గడుస్తున్నా పాలమూరు బిడ్డకు పాలమూరు ప్రాజెక్టుల మీద అర్ధగంట సమీక్ష చేసే తీరిక లేదని ఆరోపించారు. వట్టెం పంప్ హౌస్ నీట మునిగితే ప్రాజెక్టుల పరిశీలన పేరుతో పర్యటన పెట్టుకున్న కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ పంప్ హౌస్ వైపు కన్నెత్తి కూడా చూడలేదని.. కనీసం సమీక్ష చేయలేదని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.

కృష్ణా నీళ్లు సముద్రం పాలవుతుంటే కళ్లప్పగించి చూస్తున్నారని .. కాంగ్రెస్‌ది నిర్లక్ష్యమా ? కేసీఆర్ ది నిర్లక్ష్యమా ?అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.11 నెలల పాలనలో సీఎం 26 సార్లు ఢిల్లీకి, పలుమార్లు పక్క రాష్ట్రాలకు, మూడు సార్లు విదేశాలకు వెళ్లే తీరిక దొరికింది కానీ పాలమూరు ప్రాజెక్టుల గురించి చర్చించే సమయం లేదా?అని నిలదీశారు. కాంగ్రెస్ పాలనలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పెండింగ్ పనులు పూర్తి చేసి 3.50 లక్షల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చారన్నారు. రాజీవ్ భీమా కింద 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చారని, నెట్టెంపాడు కింద 1.40 వేల ఎకరాలకు, ఆర్డీఎస్ తుమ్మిళ్ల ఎత్తిపోతల కింద 87 వేల ఎకరాలకు, కోయిల్ సాగర్ కింద 38 వేల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీళ్లు ఇచ్చారని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు.

దశాబ్దాల పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 10 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు కేసీఆర్ సాగునీరు అందించారని నిరంజన్ రెడ్డి తెలిపారు. 12.30 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించాలనే ఆలోచనతో కేసీఆర్ ఎన్ని అడ్డంకులు ఎదురైనా పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90 పూర్తి చేస్తే .. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 11 నెలలుగా ప్రభుత్వం ఆ ప్రాజెక్టు పనులను పెండింగులో పెట్టిందన్నారు. పాలమూరు జిల్లా వ్యాప్తంగా 100కు పైగా చెక్ డ్యాం లు నిర్మించిన ఘనత కేసీఆర్ దేనని స్పష్టం చేశారు. ఒకనాడు ఒక్క మెడికల్ కళాశాల లేని పాలమూరు జిల్లాకు ఐదు ప్రభుత్వ మెడికల్, నర్సింగ్ కళాశాలలు, ఏజీబీఎస్సీ కళాశాల, మత్స్య కళాశాల, వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాల, వందల సంఖ్యలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ది .. ఇది కేసీఆర్ నిర్లక్ష్యంగా కనిపిస్తుందా ? అని నిలదీశారు. కురుమూర్తి స్వామి మీద, జోగుళాంబ అమ్మవారి మీద, మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి మీద ఒట్లు వేసి, ప్రమాణాలు చేసి రుణమాఫీ చేస్తానని మాటతప్పావుఅని అన్నారు. రేవంత్ 11 నెలల పాలన ఒట్లు, తిట్లకే సరిపోయిందని దుయ్యబట్టారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా రుణం తీర్చుకుంటారన్నారు. సీఎం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందరూ అవే అబద్దాలు వల్లె వేస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు.

Advertisement

Next Story