అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎన్నికలు : మంత్రి కేటీఆర్

by Sridhar Babu |
అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎన్నికలు : మంత్రి కేటీఆర్
X

దిశ, శేరిలింగంపల్లి : అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎన్నికలు ఉంటాయని రాష్ట్ర, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం గచ్చిబౌలి డివిజన్ ఖాజాగూడలో జరిగిన ఖాజాగూడ చెరువు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎస్ఆర్ ఫండ్ కింద అభివృద్ధి చేసిన ఖాజాగూడ పెద్ద చెరువు అభివృద్ధి పనులను చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ చెరువులను అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చిన రియల్టర్లు లాభాలపై దృష్టి పెట్టకుండా ముందు తరాలకు చెరువులను అందంగా అందించడమే ముఖ్యమని అన్నారు. చెరువుల అభివృద్ధి పనులను సీఎస్ ఆర్ కింద రియల్టర్లకు అప్పగిస్తున్నామని, వారికి రాసివ్వడం లేదని, అలా ఎవరూ అపార్ధం చేసుకోవాల్సిన అవసరం లేదని, సోషల్ మీడియాలో ఈ విషయంలో రాద్దాంతం చేయకుండా నిజానిజాలు తెలుసుకోవాలని కోరారు.

వారితో ఇక్కడ డబ్బులు ఖర్చు చేయిస్తున్నామని చిన్న తప్పు జరిగినా అందరం బద్నాం అవుతామన్నారు. నగరంలోని చాలా చెరువులలో పట్టా భూములు ఉన్నాయని, 13 చెరువులలో ఉన్న 115 ఎకరాల ప్రైవేట్ భూములను సేకరించి 182 టీడీఆర్‎లు ఇచ్చామని తెలిపారు. జూలై చివరి వరకు దేశంలోనే వంద శాతం మురుగు నీటి శుద్ధి గల నగరంగా హైదరాబాద్ అవుతుందని, ప్రైవేట్ ఎస్‎టీపీలను నిర్మించాలని, చెరువుల వద్ద వాకింగ్ ట్రాక్, ప్లాంటేషన్, ఓపెన్ జిమ్, టాయిలెట్స్, లైటింగ్, పిల్లలు ఆట స్థలాలు, సామాజిక కార్యక్రమాలకు వాడుకునేలా ఉండాలని సూచించారు. ప్రతి జిల్లా కేంద్రంలో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల సుందరీకరణను చేస్తున్నామని తెలిపారు. కట్టు కథలు, పిట్ట కథలు చెబితే పెట్టుబడులు రావని, ప్రపంచ వ్యాక్సిన్ నగరంగా హైదరాబాద్ నిలిచిందని, వచ్చే సంవత్సరం వరకు 1400 కోట్ల వాక్సిన్ ఉత్పత్తి అవుతుందన్నారు. ఫాక్స్ కాన్ వల్ల 30 వేల మందికి ఉపాధి దొరుకుతుందని, ఫెడ్ ఎక్స్ సంస్థ ఒక్కటే ఏడు వేల ఉద్యోగాలు సృష్టించిందని, గతేడాది లక్షా 50 వేల ఉద్యోగాలు వచ్చినట్లు వెల్లడించారు 2021 లైఫ్ సైన్సెస్ సిస్టం విలువ 50 బిలియన్ డాలర్లని, 2030 వరకు 250 బిలియన్ డాలర్లు అనుకుంటున్నామని, ఇది ట్రైలర్ మాత్రమే నని, అసలు సినిమా ముందు ఉందని పేర్కొన్నారు.

31 కిలోమీటర్ల ఎయిర్ పోర్టు మెట్రోను మూడేళ్లలో పూర్తి చేస్తామని, పటాన్ చెరువు నుండి లక్డికాపూల్, నాగోల్ నుండి ఎల్బీ నగర్ వరకు మెట్రో విస్తరణకు సహకరించాలని కేంద్రాన్ని కోరితే అది సాధ్యం కాదు అని సమాచారం వచ్చిందని, వారు సహకరించినా, సహకరించకపోయినా మెట్రోను విస్తరిస్తామని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‎లో పది నగరాల్లో మెట్రో నిర్మాణానికి డబ్బులు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోకు మాత్రం ఇవ్వడంలేదని ఆరోపించారు. హైదరాబాద్ నగర అభివృద్దికి సహకరించండంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నగరానికి 250 కిలోమీటర్ల మెట్రో తప్పకుండా ఉండాలని, 500 ఎలక్ట్రికల్ బస్సులను తేనున్నామని, మూసీపై 14 బ్రిడ్జ్‎లను పది వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి ఇప్పటి వరకు చేసింది కొంచమేనని, చేయాల్సింది ఇంకా చాలా ఉందని అన్నారు.

రాష్ట్రంలో మరోసారి తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని, రాజాసింగ్ అడిగినా, గంగాధర్ రెడ్డి అడిగినా నిధులు ఇస్తామన్నారు. ఈ హైదరాబాద్ మనదని అందరూ కలిసి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులు ప్రతీ చెరువు వివరాలు అందరికీ అందుబాటులో ఉంచాలని, హెచ్ ఎండీఏ, టీఎస్ ఐఐసీ, జీహెచ్ఎంసీ బిల్డర్లు అందరూ చెరువుల సుందరీకరణలో ముఖ్య పాత్ర వహించాలని పిలుపునిచ్చారు. అనంతరం హెచ్ ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 50 చెరువుల అభివృద్ధి పనులకు సంబంధించిన ఎంఓయూ పత్రాలను బిల్డర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రేడాయ్ ప్రతినిధులు, రియల్టర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Next Story