TFCC: ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా దిల్‌రాజు గెలుపు

by srinivas |   ( Updated:2023-07-30 17:11:50.0  )
TFCC: ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా దిల్‌రాజు గెలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్యానల్ గెలుపొందింది. అధ్యక్షుడిగా దిల్ రాజు, వైస్ ప్రెసిడెంట్‌గా ముత్యాల రాందాస్, కార్యదర్శిగా దామోదర్ ప్రసాద్, కోశాధికారిగా ప్రసన్న కుమార్ ఎన్నికయ్యారు. రెండేండ్లకోసారి జరిగే కార్యవర్గ ఎన్నికల్లో 2023-25 సంవత్సరాలకుగాను ఆదివారం జరిగిన పోలింగ్‌లో మొత్తం 1600 ఓట్లకుగాను 1339 పోల్ అయ్యాయి. నాలుగు రౌండ్ల లెక్కింపు అనంతరం దిల్ రాజు విన్నర్‌గా నిలిచారు. ప్రొడ్యూసర్, స్టూడియో, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ విభాగాలకు చెందిన పోలింగ్‌లో తొలి రెండు సెక్టార్‌లలో దిల్ రాజు ప్యానల్ మెజారిటీ ఓట్లను పొందింది. ప్రొడ్యూసర్ సెక్టార్‌లో 12 పోస్టుల్లో దిల్ రాజు ప్యానెల్ తరఫున ఏడుగురు, స్టుడియో సెక్టార్‌లో నలుగురిలో ముగ్గురు గెలుపొందారు. డిస్ట్రిబ్యూటర్ల సెక్టార్‌లో మొత్తం 12 పోస్టుల్లో సీ.కల్యాణ్ ప్యానెల్‌కు సమానంగా ఆరింటిని దిల్ రాజు ప్యానెల్ చేజిక్కించుకున్నది.

ప్రొడ్యూసర్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్న పన్నెండు స్థానాలకు జరిగిన పోలింగ్‌లో మొత్తం 890 ఓట్లు పోల్ కాగా దిల్ రాజుకు 563 ఓట్లు లభించాయి. సీ.కల్యాణ్ 497 ఓట్లతో నాల్గో స్థానంలో నిలిచారు. మొత్తం 28 మంది అభ్యర్థులు ఈ కమిటీ తరఫున పోటీచేస్తే అందులో పన్నెండు మంది గెలుపొందారు. ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్‌లో 20 మందిని ఎన్నుకోడానికి 45 మంది పోటీ చేస్తే అందులో తొలి 20 మంది విజేతలుగా నిలిచారు. ఆ తర్వాత నాలుగు సెక్టార్లలో గెలుపొందినవారంతా కలిసి ఫిలిం చాంబర్ అధ్యక్షుడిని ఎన్నుకోడానికి జరిగిన పోలింగ్‌లో పాల్గొన్నారు. మొత్తం 48 మంది పాల్గొంటే మ్యాజిక్ ఫిగర్‌గా 25 ఓట్లు వచ్చినవారు గెలుపొందుతారు. దిల్ రాజుకు 31 ఓట్లు రావడంతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

అనంతరం దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో గెలుపోటముల గురించి మాట్లాడుకోవడం కంటే సినిమా ఇండస్ట్రీని పటిష్టంగా మల్చడానికి ఎక్కువ శ్రమ పడడం అవసరమన్నారు. చిన్న సినిమాల మనుగడ, డిజిటల్ సర్వీసు ప్రొవైడర్ల ఛార్జిల తగ్గింపు తదితర హామీలతో సీ.కల్యాణ్‌ ప్యానెల్‌ ఓటర్లకు చేరువైంది. ఫిల్మ్ ఛాంబర్ మనుగడ, భవిష్యత్ తరాలకు మంచి పరిశ్రమను అందించాలనే లక్ష్యాలతో దిల్‌రాజు ప్యానెల్ బరిలోకి దిగింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ, ఎస్వీసీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత బాపినీడు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత కూచిభొట్ల వివేక్ తదితరులు ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. దిల్ రాజు ప్యానెల్ తరఫున పోటీ చేసిన వైవీఎస్ చౌదరి, పద్మిని, అశోక్ కుమార్, స్రవంతి రవికిషోర్, యలమంచిలి రవిశంకర్, వడ్లపట్ల మోహన్ తదితరులు గెలుపొందారు.

Advertisement

Next Story