ముగిసిన నామినేషన్ల గడువు

by Disha Web Desk 11 |
ముగిసిన నామినేషన్ల గడువు
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : లోక్ సభ ఎన్నికల్లో ప్రధానమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇందులో భాగంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాలలో గతానికి భిన్నంగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. రాష్ట్రం, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ,బీజేపీ, ఎంఐఎం ,బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులే కాకుండా స్వతంత్ర అభ్యర్థులు ఈ పర్యాయం అధిక సంఖ్యలో ముందుకు వచ్చి నామినేషన్లను సమర్పించారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 18వ తేదీన వెలువడింది. నాటి నుండి నేటి వరకు పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది.

అయితే అంతకు ముందే ఆర్వో కార్యాలయానికి చేరుకుని వేచి ఉన్న అభ్యర్థులకు నామినేషన్ వేసే అవకాశం కల్పించారు. ఇదిలా ఉండగా శుక్రవారం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 29వ తేదీతో ఉపసంహరణకు గడువు ముగియనుంది. ఆ తర్వాత బరిలో ఉన్న పార్టీల అభ్యర్థులు కాకుండా స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు. పోలింగ్ మే 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో జరుగనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగనున్న విషయం తెలిసిందే. కాగా నామినేషన్ల గడువు ముగిసిన అనంతరం సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి 57 మంది అభ్యర్థులు 75 సెట్ల నామినేషన్లు, హైదరాబాద్ నియోజకవర్గం నుండి 57 మంది అభ్యర్థులు 85 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.



Next Story

Most Viewed