గోషామహల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గోస..

by Sumithra |
గోషామహల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గోస..
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : గోషామహల్ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కంచుకోట. రోజులు, సంవత్సరాలు గడుస్తున్నా కొద్ది ఇప్పుడు పరిస్థితులు మారాయి. బండ్లు ఓడలయ్యాయి, ఓడలు బండ్లయ్యాయి అనే సామెతను నిజం చేస్తూ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 2009లో జరిగిన ఎన్నికలలో ఇప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. సరిగ్గా ఆ పరిస్థితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటోంది. పార్టీకి అభిమానులు, కార్యకర్తలు ఉన్నా వారిని నడిపించే నాయకుడు లేకుండా పోయారు. నియోజకవర్గం నుండి కనీసం నేను ఈ పార్టీ నుండి ఎన్నికలలో పోటీ చేస్తున్నాను అని చెప్పే నాయకుడే లేడంటే పార్టీ ఎలాంటి దుస్థిలో ఉందో ఇట్టే అర్థం అవుతోంది.

2008 వరకు మహరాజ్ గంజ్ నియోజకవర్గం పేరుతో ఉండగా 1989, 2004 సంవత్సరాలలో అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మూల ముఖేష్ గౌడ్ విజయం సొంతం చేసుకున్నారు. 2009 లో నియోజకవర్గాల పునర్విభన సమయంలో గోషామహల్ నియోజకవర్గం ఏర్పడగా ముఖేష్ గౌడ్ మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రిగా కొనసాగారు. నియోజకవర్గంలో ఆయన ప్రజలతో అత్యంత సన్నిహితులుగా ఉండే వారు. చిన్నకార్యకర్త నుండి పెద్ద నాయకుల వరకు ఎవరు ఎదురుపడిన, తన వద్దకు వచ్చిన వారికి సమయాన్ని కేటాయించి వారితో మాట్లాడి సమస్యను తీర్చేవారు. మంత్రి పదవిలో ఉన్నప్పటికీ అనేక సమయాలలో బస్తీలలో ద్విచక్ర వాహనం పై కూడా తిరుగుతూ ప్రజలతో మమేకమయ్యేవారు.

నియోజకవర్గంలో అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి ఇంత ప్రాభవం ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. మాస్ లీడర్ గా గుర్తింపు పొందిన ముఖేష్ గౌడ్ 2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్ధి రాజాసింగ్ చేతిలో ఓడిపోయి రెండవ స్థానంతో సరిపెట్టుకున్నారు. అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన ప్రేమ్ కుమార్ ధూత్ ఇండిపెండెంట్ కంటే తక్కువ ఓట్లు పొందగా డిపాజిట్ సైతం కోల్పోయారు. తిరిగి 2018లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మూల ముఖేష్ గౌడ్ ఓటమిపాలై మూడవ స్థానంలో నిలిచారు. అనంతరం అస్వస్థతకు గురై ఆయన చనిపోయిన నాటి నుండి గోషామహల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఆయన కుమారుడు విక్రమ్ గౌడ్ సైతం తండ్రి మరణానంతరం బీజేపీలో చేరారు.

ముఖేష్ గౌడ్ తోనే తగ్గిన కాంగ్రెస్ ప్రాభవం...

మూల ముఖేష్ గౌడ్ గోషామహల్ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో గెలిచినా, ఓడినా కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉండేది. అన్ని డివిజన్లలో కాంగ్రెస్ క్యాడర్ కనబడేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. రాబోయే ఎన్నికలలో నియోజకవర్గంలో నేనున్నాను, కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధం అని ప్రకటించే నాయకుడే లేరు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉండి అధికార, పార్టీ పదవులు పొందిన వారితో పలువురు మాజీ కార్పొరేటర్లు సైతం ఇతర పార్టీలలో చేరిపోయారు. మరికొన్ని నెలల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు ఇంత సమీపంలోనే ఉన్నా పార్టీ రాష్ట్ర నాయకత్వం గోషామహల్ నియోజకవర్గం వైపు దృష్టి సారించకపోవడంతో పార్టీ మరింత దయనీయంగా మారింది. ఇప్పటికైనా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం గోషామహల్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి పార్టీకి పునర్ వైభవం తెచ్చేలా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

గాంధీ భవన్ ఉన్నా..

రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేతలు ప్రతి రోజు సమావేశమయ్యే కార్యాలయం, పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ గోషామహల్ నియోజకవర్గం పరిధిలోనే ఉంటుంది. అయినా గోషామహల్ నియోజకవర్గం పై వారు దృష్టి సారించడం లేదు. టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు, రాబోయే ఎన్నికలలో పార్టీని విజయ తీరాలకు చేర్చేందుకు కష్టపడుతున్నారు. మరి పార్టీ రాష్ట్ర కార్యాలయం ఉన్న గోషామహల్ నియోజకవర్గం ఆయనకు గుర్తు రావడం లేదా అని నియోజకవర్గం పార్టీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

గాంధీ భవన్ ఉన్నా నియోజకవర్గంలోనే పార్టీ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇతర నియోజకవర్గాలలో ఏమిటని వారు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముఖేష్ గౌడ్ అనంతరం నియోజకవర్గంలో పార్టీని బతికించి రాబోయే ఎన్నికలలో పోటీ చేసేలా సమర్ధుడైన నాయకున్ని తయారు చేయడంలో టీపీసీసీ ఘోరంగా విఫలమైందనే ఆరోపణలు సైతం వినిబడుతున్నాయి. గెలుపు, ఓటముల సంగతి పక్కన పెడితే రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసే నాయకుడు కూడా లేకపోవడంతో నియోజవకర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓటమిని ముందుగానే ఒప్పుకున్నట్లైందని పలువురు పార్టీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed