BRS leaders : బీఆర్ఎస్ ఇంఛార్జి ఎవరు..?

by Sumithra |
BRS leaders : బీఆర్ఎస్ ఇంఛార్జి ఎవరు..?
X

దిశ, శేరిలింగంపల్లి : వర్షాకాలంలోనూ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. మొన్నటి వరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జంపింగ్ లతో ఎప్పుడు ఎవరు ఏ పార్టీలోకి పోతారోనన్న టెన్షన్ బీఆర్ఎస్ పార్టీలో నెలకొంది. అది కాస్త సద్దుమనిగిన వెంటనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. వర్షాలతో చల్లగా మారిన రాష్ట్రంలో అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మాటల యుద్ధంతో హాట్ హాట్ గా మారింది. ఇదిలా ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఇంఛార్జిలము మేమంటే మేమే అవుతామంటూ ఎవరికి వారుగా తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు.

శేరిలింగంపల్లి ఇంఛార్జీ పోస్ట్ కోసం పోటాపోటీ..

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అరెకపూడి గాంధీ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఎమ్మెల్యే పార్టీ మారడంతో శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్ ఎవరు అవుతారు. అందరినీ కలుపుకుపోయే లీడర్ ఎవరు అనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో, ఉద్యమకారుల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీలో ఉన్న వారిలో చాలామంది ఎవరికి వారుగా తదుపరి ఇంఛార్జీ మేమంటే మేము అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. మరికొందరు నాయకుల అనుచరులైతే కాబోయే ఎమ్మెల్యే అంటూ కొందరిని ఉద్దేశించి పోస్ట్ లు పెడుతున్నారు. ఎవరికి వారుగా తమకే వస్తుందంటే లేదు మాకే వస్తుందని అప్పుడే పోటీలు పడుతున్నారు.

ఆ ముగ్గురిలో ఎవరు..?

ఎన్నికల కన్నా ముందు ఇద్దరు ఆ తర్వాత ఇద్దరు కార్పొరేటర్లు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరగా.. ఇంకొందరు కార్పొరేటర్లు ఎమ్మెల్యే గాంధీతో పాటుగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే వివేకానంద నగర్ కార్పొరేటర్ రోజాదేవీ మాత్రం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే గాంధీ పార్టీ మారిన తర్వాత శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కొందరు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ భవన్ కు వెళ్లి కేటీఆర్ ను కలిసి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, ఇతర అంశాల పై ఆయనతో చర్చించారు. ఇందులో భాగంగా ఇంఛార్జీ ఎవరు అనే అంశం కూడా చర్చకు రాగా అక్కడికి వెళ్లిన మెజార్టీ నాయకులు, కార్యకర్తలు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్, ఉద్యమకారుడు కొమిరిశెట్టి సాయిబాబా పేరును సూచించారని సమాచారం.

ఇంకొందరు గతంలో ఎన్నికల సమయంలో నియోజకవర్గ ఇంఛార్జీగా పనిచేసిన వరంగల్ జిల్లా పరకాలకు చెందిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పేరును కూడా ప్రపోజ్ చేశారని చెబుతున్నారు. కొమిరిశెట్టి సాయిబాబా స్థానికుడు, గతంలో కార్పొరేటర్ గా పనిచేసి ఉండడం, ఉద్యమకారుడు కూడా కావడంతో చాలా మంది ఆయననే ఇంఛార్జీగా నియమించాలని కేటీఆర్ ను కోరినట్లు చెబుతున్నారు. ఈ ఇద్దరితో పాటు బిల్డర్, రియల్టర్ అయిన వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ పేరు అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా ఆయన ఎప్పుడూ పార్టీ పదవుల మీద దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. కానీ కేటీఆర్ కు సన్నిహితుడిగా పేరుంది. వీరితో పాటు మరికొంతమంది మేము సైతం ఇంఛార్జీ పదవికి అర్హులమే అంటూ కేటీఆర్ తో రహస్య రాయబారం నడుపుతున్నట్లు తెలుస్తుంది.

కష్టకాలంలో గట్టెకించేది ఎవరు..?

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై, అధికారం కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కొత్తగా జవసత్వాలు ఊదే నాయకుల కోసం పార్టీ అధిష్టానం వేయికళ్లతో ఎదురుచూస్తుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కష్ట కాలంలోనూ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండే నేతల కోసం వెతుకుతుంది. కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు కానీ పార్టీని వీడకుండా ఉండే వారే కావాలనే ఉద్దేశ్యం బీఆర్ఎస్ పెద్దల్లో కనిపిస్తుంది. అందులో భాగంగా కీలకమైన శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ బాధ్యుడు ఎవరు రానున్నారు అనేది ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story

Most Viewed