వైరల్ గా ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణ్ ల జీవ కారుణ్యం

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-18 07:34:58.0  )
వైరల్ గా ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణ్ ల జీవ కారుణ్యం
X

దిశ, వెబ్ డెస్క్ : సినీ ఫైట్ మాస్టర్స్, కవల బ్రదర్స్ రామ్, లక్ష్మణ్ లు చాటిన జీవకారుణ్యం వైరల్ గా మారింది. పెద్ద బండరాయి చీలిక మధ్య చిక్కుకుపోయిన తల్లి కుక్కను కాపాడి, దాని సంతానంగా ఉన్న పది కుక్క పిల్లల చెంతకు చేర్చిన ఫైటర్ల చొరవ.. గొప్ప మనసు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటుంది. మొయినాబాద్ లోని అజీజ్ నగర్‌లో ఓ సినిమా షూటింగ్ షూట్ జరుగుతుండగా ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ ల బృందానికి కుక్కల ఏడుపు శబ్దం వినిపించింది. ఏం జరిగిందో చూద్దామని సంఘటన స్థలానికి వెళ్ళి చూడగా ఓ పెద్ద బండరాయి చీలిక మధ్యలో చిక్కుకుపోయిన తల్లి కుక్క ఒక వైపు, పక్కనే తల్లి కోసం, ఆకలితో దాని పాల కోసం చూస్తున్న 10కుక్క పిల్లల రోధనలను వారు చూశారు. ఆ దృశ్యాన్ని చూసిన రామ్, లక్ష్మణ్ లు చలించిపోయారు.

తల్లి కుక్కను కాపాడేందుకు ఆ బండరాళ్లను కదిలించడం మనుషులతో సాధ్యం కాదని గుర్తించిన రామ్, లక్ష్మణ్ లు వెంటనే సొంత ఖర్చులతో జేసీబీని పిలిపించి దాని సహాయంతో తల్లి కుక్కను కాపాడి బయటకు తీసి దాని పది కుక్క పిల్లల చెంతకు చేర్చారు. అవి కోలుకునేందుకు ఆహారం, నీళ్ళు అందించారు. పిల్లల దరికి చేరిన తల్లి కుక్క సంతోషం, తల్లి రావడంతో పిల్లల ఆనందం..ఆ వెంటనే ఆ పిల్లలు తల్లి పాలు తాగడం చూసిన రామ్, లక్ష్మణ్ లు సహా అక్కడున్న వారంత తమ ప్రయత్నం సఫలమైనందుకు ఎంతో సంతోషం పొందారు. ఇందుకు సంబంధించిన వీడియోను స్వయంగా ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ లు సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది వైరల్ గా మారింది.

Advertisement

Next Story

Most Viewed