మూసీ పునరావాస మహిళా సంఘాలకు రుణాలు.. ఒక్కో మహిళకు రూ.2 లక్షలు.. కీలక హామీలు

by Ramesh N |   ( Updated:2024-10-18 09:27:13.0  )
మూసీ పునరావాస మహిళా సంఘాలకు రుణాలు.. ఒక్కో మహిళకు రూ.2 లక్షలు.. కీలక హామీలు
X

దిశ, డైనమిక్/ తెలంగాణ బ్యూరో: మూసీ నది పునరావాస మహిళా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం రుణాలు ఇచ్చింది. పునరావాసం పొందిన 17 గ్రూపుల నుంచి రూ. 3.44 కోట్ల రుణాల చెక్కులు 172 మంది మహిళలు అందుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో మంత్రి సీతక్క మహిళ సంఘాలకు రుణాల చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ఒక ప్రాంతం నుంచి మరొక చోటుకు వెళ్ళినప్పుడు కొంత కష్టంగా ఉంటుందని, కానీ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మూసీ నది వరద ఉధృతి పెరిగితే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ప్రకృతి వైపరిత్యాలు దేశంలో సంభవిస్తున్నాయన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, మంచి వాతావరణంలో మనం జీవించాలన్నారు.

మంచి గాలి, నీళ్లు దొరికే ప్రదేశంలో జీవనం సాగించాలన్నారు. ఒక తరం మూసీ నది పరీవాహక ప్రాంతంలో ఇబ్బందుల్లో నివసించారని, రేపటి తరమైన మంచి వాతావరణంలో బతికేలా చూడాల్సిన బాధ్యత మన మీద ఉందన్నారు. మహిళా గ్రూపులలో ఒక్కో మహిళలకు 2 లక్షలు రూపాయలు రుణాలు ఇస్తున్నామని చెప్పారు. రూ.2 లక్షల రుణాల్లో రూ. లక్షా 40 వేలను ప్రభుత్వం మాఫీ చేస్తుందని, కేవలం రూ. 60 వేలు మాత్రమే మహిళా సంఘాలు కట్టాల్సి ఉంటుందని చెప్పారు. అది కూడా మూడేళ్ల గడువుతో చెల్లించవచ్చు. నేలకు రూ. 2 వేలు తిరిగి ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.

మూసీ మహిళలకు కీలక హామీలు

ప్రభుత్వం సహాయంతో మంచి వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. కుట్టు మిషన్‌లను సైతం మూసీ నది మహిళా సంఘాలకు ఇస్తామని హామీ ఇచ్చారు. వివిధ రకాల వ్యాపారాలకి మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. మూసీ నది పునరావాస పొందిన వారి పిల్లలకు అన్ని రకాల విద్యా సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు బలాలా, కౌసర్ మొయినుద్దీన్, హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, స్త్రీ నిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed