Raghunandanrao: సీఎం కేసీఆర్‌ చర్చకు సిద్ధమేనా?

by srinivas |   ( Updated:2023-07-31 15:53:30.0  )
Raghunandanrao: సీఎం కేసీఆర్‌ చర్చకు సిద్ధమేనా?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో భూముల అమ్మకం, బీసీ బంధు ఇవ్వలేకపోవడం, మైనార్టీలకు లక్ష సాయంపై సీఎం కేసీఆర్‌కు మీడియా ముఖంగా పలు ప్రశ్నలు సంధించారు. తెలంగాణలో ప్రభుత్వం భూముల అమ్మకాన్ని రఘునందన్ రావు తప్పుబట్టారు. హైదరాబాద్ చుట్టూ శ్మశానాలు అమ్ముతున్నారని కోర్టు స్టే ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ‘2014 జూన్ 2 నుంచి హైదరాబాద్ చుట్టూతో పాటు జిల్లాల్లో అమ్మిన భూములెన్ని?, వాటి విస్తీర్ణం ఎంత, దాని ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంత, ఏ పద్ధతిలో ఎక్కడ ఖర్చు పెట్టారు.’ అని రఘునందన్ రావు ప్రశ్నించారు.

అలాగే మైనార్టీలందరికి మైనార్టీ బంధు ఇస్తామని మంత్రులు చేసిన వ్యాఖ్యలపైనా రఘునందన్ రావు నిలదీశారు. ‘మైనార్టీలు ఎంత మంది ఉంటే అంతమంది మైనార్టీ బంధుకు దరఖాస్తు చేసుకోమని ఓ మంత్రి చెప్పారు. జనభాలో 55 శాతం బీసీలున్నారు. మరి బీసీబంధు అందరికీ ఎందుకు రాదు. ఏ ప్రకారం మైనార్టీలందరికీ మైనార్టీ బంధు ఇస్తామని మంత్రులు చెబుతున్నారు. అది కేబినెట్ తీర్మానమా?. ఎన్నికల అభ్యర్థనా?.. మైనార్టీల ఓట్ల కోసం బుజ్జగించే కార్యక్రమమా?. బీసీలకు ఇవ్వాల్సిన అవసరం లేదా?.. మైనార్టీలకు లక్ష ఇచ్చే మనసున్న సీఎం కేసీఆర్‌కు బీసీలకు బీసీబంధు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో చెప్పాలి. ’ అని రఘు నందన్ రావు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఈ అంశాలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్, మంత్రులు సిద్ధంగా ఉన్నారా అని రఘునందన్ నిలదీశారు.

Advertisement

Next Story