ఆస్తుల అద్దెకు వేలం..! తొలి దశగా నారాయణగూడ మార్కెట్ స్టాళ్లకు ఆక్షన్

by Shiva |
ఆస్తుల అద్దెకు వేలం..! తొలి దశగా నారాయణగూడ మార్కెట్ స్టాళ్లకు ఆక్షన్
X

దిశ, సిటీ బ్యూరో: ఎట్టకేలకు కొత్త కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలతో జీహెచ్ఎంసీ అధికారులు ఆదాయంపై దృష్టి సారించారు. నగరంలో జీహెచ్ఎంసీకి చెందిన సుమారు రూ.లక్ష కోట్ల విలువైన భవనాల్లో చాలా వరకు మలిగీలు, షాపులు, స్టాళ్లు ఖాళీగా ఉన్నట్టు గురించిన అధికారులు వాటిని తిరిగి అద్దెకు ఇచ్చేందుకు త్వరలోనే వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రైమ్ లొకేషన్ల మినహా మిగిలిన ప్రాంతాల్లో ఇప్పటి వరకు అద్దెకు ఇచ్చేందుకు వేలం నిర్వహించినా, ఎవరూ ముందుకు రాకపోవటంతో మరోసారి జీహెచ్ఎంసీ అధికారులు ప్రయత్నం చేసేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా నారాయణగూడ చౌరస్తాలో ఇదివరకున్న మార్కెట్‌ను ఆధునీకరించి ఏళ్లు గడుస్తున్నా, అందులోని స్టాళ్లు, షాపులుగా ఖాళీగానే ఉన్నాయి.

కొద్ది రోజుల క్రితం ఆమ్రపాలి జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత శానిటేషన్‌పై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ఈ మార్కెట్‌ను పరిశీలించారు. ఇందులోని ఖాళీలను వీలైనంత త్వరగా అద్దెకు ఇవ్వాలని ఆదేశించటంతో ఈ దిశగా ఎస్టేట్ విభాగం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రౌండ్ ప్లస్ మూడు అంతస్తులుగా నిర్మించిన ఈ కొత్త మార్కెట్ ఒక్కో ఫ్లోర్ లో 8 వేల చదరపు అడుగుల్లో ఉన్న పది స్టాళ్లకు మరో వారం రోజుల్లో వేలం పాట నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ వేలం పాట ముగిశాక సికింద్రాబాద్ హరిహరకళాభవన్ లో ఖాళీగా ఉన్న స్టాళ్లు, షాపులు, మలిగీలకు వేలం పాటు నిర్వహించాలని ఎస్టేట్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

వ్యాపారులెందుకు ముందుకు రావట్లే..?

నగరంలోని ప్రైమ్ లోకేషన్లలో ఉన్న జీహెచ్ఎంసీ భవనాలు, మార్కెట్లలో ఖాళీ షాపులు, స్టాళ్లు, మలిగీలను అద్దెకు తీసుకునేందుకు జనం, వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపటం లేదని తెలిసింది. ఇందుకు కారణమేమిటీ? అన్న కోణంలో అధికారులు ఆలోచించగా, నగరంలోని వివిధ ప్రాంతాల్లోని జీహెచ్ఎంసీకి చెందిన భవనాలు, మార్కెట్లలోనికి వచ్చే కొనుగోలుదారులకు, వ్యాపారులకు కావాల్సిన స్థాయిలో పార్కింగ్ వసతి లేకపోవటం వల్లే ముందుకు రావటం లేదన్న విషయాన్ని గుర్తించి, పలు భవనాలు, మార్కెట్లలో పార్కింగ్ వసతిని ఏర్పాటు చేస్తుండగా, మరి కొన్ని భవనాల్లో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తాన్ని పార్కింగ్ కు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నారు.

రెంట్లు ఎలా నిర్ణయిస్తారు?

జీహెచ్ఎంసీకి చెందిన భవనాల్లో షాపులు, మలిగీలను, స్టాళ్లను అద్దెకు ఇవ్వనున్న బల్దియా రెంట్ ఎలా నిర్ణయిస్తుందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. జీహెచ్ఎంసీకి చెందిన భవనాలున్న ప్రాంతంలో ప్రస్తుతమున్న మార్కెట్ వ్యాల్యుూలో పది శాతాన్ని వార్షిక అద్దెగా నిర్ణయించి, దాన్ని పన్నెండు నెలలకు, నెలవారీగా వసూలు చేసుకునేలా లెక్క కట్టటనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. టెండర్లలో ఎంపికైన వ్యాపారులు ఓ సంవత్సరం అద్దె ముందుగానే చెల్లించాలన్న నిబంధన కారణంగా జీహెచ్ఎంసీ ఎస్టేట్ విభాగం ఆదాయం రోజురోజుకి పెరుగుతుంది. ఈ అద్దె అగ్రిమెంట్ రెండేళ్ల వరకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ టెండర్ల ప్రక్రియ ఏర్పాటు చేసి అద్దెదారులను ఎంపిక చేయనున్నారు. గతంలో కేవలం రూ.2.5 కోట్ల వరకు వార్షిక ఆదాయం ఉండగా, ఇపుడు అది కాస్త రూ. 6 కోట్లకు పెరిగినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed