ఓయూలో సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నం..

by Sumithra |
ఓయూలో సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నం..
X

దిశ, సికింద్రాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే కేసీఆర్ కు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. కేసీఆర్ పట్ల రేవంత్ రెడ్డి నల్లగొండలో చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం బీఆర్ఎస్వీ నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. పోలీసులు అడ్డుకొని విద్యార్ధి నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్ధి నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ కు తక్షణమే రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మూసీ పునరుద్ధరణ బాధితులు హైదరాబాద్ లో ఉంటే నల్లగొండలో పాదయాత్ర చేసి, అక్కడ రాజకీయాలు చేయడం ఏమిటని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులకు దమ్ముంటే నగరంలో కూల్చివేతలు చేపట్టిన ప్రాంతాల్లో పర్యటించాలని సవాల్ చేశారు. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు పూర్తి చేసిన ఉద్యోగాలకు కేవలం నియామక పత్రాలు అందజేసి తమ ఖాతాలో వేసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్, చందు, శిగ వెంకట్, జీడీ అనిల్, జంగయ్య, రమేశ్ గౌడ్, ప్రశాంత్, నరేశ్, మిథున్, నాగేందర్రావు, శ్రీకాంత్, అవినాశ్, పవన్, సాయి, మనీష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed