- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్నట్టు ఆగమేఘాలపై స్పెషల్ డ్రైవ్
దిశ, సిటీబ్యూరో: చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్నట్టుంది జీహెచ్ఎంసీ వ్యవహారం. అస్తమానం నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామని, అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని, విదేశీ పెట్టుబడులు వస్తున్నాయంటూ గొప్పలు చెప్పుకునే పాలకులు ప్రమాదాలు, ఘటనలు జరిగి, ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిన తర్వాత ఎంత హడావుడి చేసినా ఏం లాభం అంటూ మహానగర వాసులు మండిపడుతున్నారు. కుక్కల నియంత్రపై ఇదే సోయి కాస్త ముందుంటే అంబర్‌పేట ఘటనలో మృతిచెందిన ప్రదీప్ ప్రాణాలు నిల్చుండేవి కదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన మూడు రోజుల తర్వాత హడావుడిగా కుక్కల నియంత్రణపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. ఫైర్ యాక్సిండెంట్లు జరిగి పదుల సంఖ్యలో జనాలు కాలి బూడిద కాగా, కుక్క కాటుకు ఓ బాలుడు బలైన తర్వాత ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సాక్ష్యాత్తు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించినా, ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా చైతన్యపురి, రాజేంద్రనగర్‌లలో కుక్కకాటు ఘటనలు వెలుగుచూశాయి. రాజేంద్రనగర్‌లో స్కూల్ నుంచి వస్తున్న ఐదుగురు చిన్నారులపై కుక్కలు దాడి చేయడంతో నలుగురికి, చైతన్యపురిలో మరో చిన్నారికి కుక్కకాటు ఘటనలో గాయాలైనట్లు తెలిసింది. అంబర్‌పేట ఘటన నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు చేపడుతామన్న మంత్రి ఇందుకు ఏం సమాధానం చెబుతారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. బోయిగూడ, వైఎంసీఏ, రాంగోపాల్ పేటల్లో ఫైర్ యాక్సిడెంట్లు జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసినా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ ప్రకటించిన తర్వాత ఇటీవలే ఒకే రోజు రెండు అగ్ని ప్రమాదాలు జరగడం జీహెచ్ఎంసీ అధికారుల పనితీరుకు నిదర్శనం.
శేరిలింగంపల్లి సర్కిల్‌లో విజిలెన్స్ తనిఖీలు
వెటర్నీరీ విభాగంలో చోటుచేసుకుంటున్న అక్రమాలపై బుధవారం 'దిశ' దినపత్రికలో వ్యయం కోట్లు..తప్పని కాట్లు' అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి స్పందించిన జీహెచ్ఎంసీ ఈవీడీఎం అధికారులు శేరిలింగంపల్లి సర్కిల్‌లోని వెటర్నరీ విభాగంలో తనిఖీలు నిర్వహించినట్లు తెలిసింది. ముఖ్యంగా మూగజీవాలకు పెట్టాల్సిన తిండి విషయంలో కూడా కల్తీలకు పాల్పడుతూ జేబులు నింపుకుంటున్నారన్న కోణంలో యానిమల్ షెల్టర్‌లో తనిఖీలు నిర్వహించిన అధికారులు షెల్టర్‌లోని రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
దీంతో పాటు వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ ఆపరేషన్లకు సంబంధించిన పలు ఫైళ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ తనిఖీలకు సంబంధించి ఈవీడీఎం అధికారులను శాంతింపజేసేందుకు ఏళ్ల తరబడి ఇక్కడి వెటర్నరీ విభాగంలో తిష్టవేసి, వందల కోట్లు సంపాదించిన ఓ అధికారి ఉదయం నుంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆయన ప్రలోభాలకు ఈవీడీఎం అధికారులు తలొగ్గుతారా? వెటర్నరీలోని అక్రమాలకు బ్రేక్ వేస్తూ, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటారా? వేచి చూడాలి.
ఎందుకింత వివక్ష?
మంత్రి కేటీఆర్ కుక్క చనిపోతే ఏకంగా ఇద్దరు డాక్టర్లను సస్పెన్షన్ చేసిన ప్రభుత్వం అంబర్‌పేట ఘటనపై ఎందుకు, ఎవరిపై చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్న తలెత్తుతుంది. కుక్కలు చిన్నారిపై దాడి చేసి, పీక్కు తింటున్న వీడియోను చూసిన తర్వాత కూడా ఆ ఘటనకు బాధ్యులైన స్థానిక వెటర్నరీ ఆఫీసర్ పై ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఆ చిన్నారి తల్లిదండ్రుల ఆవేదనను అంచనా వేయలేని అధికారులు పాలకవర్గం విషయాన్ని దారి మళ్లించేందుకు కుక్కలకు ఆకలేసి అలా దాడికి పాల్పడి ఉంటాయంటూ మేయర్ విజయలక్ష్మి వ్యాఖ్యానించడం పట్ల సిటిజనులు తప్పుపడుతున్నారు.
చర్యలు తీసుకునే విషయాన్ని పక్కనబెట్టి, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాపాడేందుకు పలువురు పాలకమండలి సభ్యులు బేరసారాలు కుదురుస్తున్నట్లు సమాచారం. మొత్తానికి మంత్రి కుక్క ప్రాణానికి ఉన్న విలువ ఓ పేద కుటుంబంలోని చిన్నారి ప్రాణానికి లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.