సేవలన్నీ ప్రయివేటుకే...

by Sumithra |
సేవలన్నీ ప్రయివేటుకే...
X

దిశ, సిటీబ్యూరో : పన్నులు చెల్లిస్తున్న ప్రజలకు జీహెచ్ఎంసీ పలు రకాల సేవలు అందించాలి. వాటిలో ముఖ్యమైనవి రోడ్ల నిర్వహణ, డ్రెయినేజీల నిర్వహణ, జనన, మరణ ధృవపత్రాల జారీ, వీధి దీపాల నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపట్టాలి. కానీ కార్పొరేషన్ చేయాల్సిన ప్రాథమిక బాధ్యతల నుంచి బల్దియా తప్పుకుంటుంది. వీటిలో ఆదాయం వచ్చే పనులను ప్రయివేటు సంస్థలకు కట్టబెడుతోంది. ఫలితంగా ఆదాయానికి గండిపడడంతో పాటు అదనంగా సదరు సంస్థలకు చెల్లించాల్సిన దుస్థితి దాపురించింది.

రోడ్ల నిర్వహణ ఇలా..

జీహెచ్ఎంసీ పరిధిలో 9,013 కిలోమీటర్ల రోడ్లను నిర్వహిస్తోంది. అందులో 2,846 కిలోమీటర్ల బ్లాక్ టాప్ (బీటీ) రోడ్లు, 6,167 సిమెంట్ రోడ్లు (సీసీ రోడ్లు) ఉన్నాయి. ఈ రోడ్లలో 526 కిలోమీటర్ల రోడ్లు 4 లైన్లు, ఆ పైన లైన్ల రోడ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 9,013 కిలో మీటర్ల ప్రధాన బీటీ రోడ్లలో కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్ (సీఆర్ఎంపీ) పథకం ద్వారా 811 కిలోమీటర్ల ప్రజా రవాణా మెరుగుపడే ప్రధాన రోడ్డును రూ.1,839 కోట్ల అంచనా వ్యయంతో ప్రయివేటు ఏజెన్సీలకు అప్పగించారు. ఐందేండ్ల సమయం ముగియనుండడంతో మరోసారి 1,100 కిలో మీటర్లకు పెంచి ప్రయివేటు ఏజెన్సీలకు ఇవ్వాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ ఏజెన్సీలు ఫుట్‌పాత్, సెంట్రల్ డివైడర్లు, నిర్మాణాలు, కర్బ్ పెయింటింగ్, లైన్ మార్కింగ్, గ్రీనరి మెయింటెనెన్స్ చేయాల్సి ఉంది.

ఈఈఎస్ఎల్‌కు వీధి దీపాలు..

జీహెచ్ఎంసీ పరిధిలో వీధి దీపాల నిర్వహణను సైతం కేంద్ర ప్రభుత్వ సంస్థకు అప్పగించారు. 30 సర్కిళ్ల పరిధిలో 5.10 లక్షల వీధి దీపాలు ఉన్నాయి. వీటిని 25 వేల సెంట్రలైజ్డ్ కంట్రోల్ మానిటరింగ్ సిస్టం (సీసీఎంఎస్) డ్యాష్ బోర్డుకు అనుసంధానం చేశారు. ఏడేళ్ల పాటు ఎల్ఈడీ ప్రాజెక్ట్ నిర్వహణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈఈఎస్ఎల్ చేప‌డుతోందని 2018లో జీహెచ్ఎంసీ ప్రకటించింది. 90 శాతం వీధి దీపాలు వెలిగితేనే బిల్లులు చెల్లించాలని ఒప్పందంలో రాసుకున్నారు. అయితే వీధి దీపాల నిర్వహణ సరిగ్గాలేదని అప్పటి కమిషనర్ ఆమ్రపాలి రూ.70 కోట్ల బిల్లులను ఆపేశారు.

నియోజియోకు సర్వే..

హైదరాబాద్ నగరాన్ని మొత్తం స్కాన్ చేసేందుకు జీహెచ్ఎంసీ జీఐఎస్ సర్వే ఫర్ అర్బన్ ప్లానింగ్ చేపట్టింది. మూడంచెల ఈ సర్వేలో భాగంగా తొలుత శాటిలైట్ సర్వే, ఆ తర్వాత డ్రోన్లతో సర్వే నిర్వహించినానంతరం ఇంటింటికెళ్లి సమాచారం సేకరణ చేయాలని బల్దియా నిర్ణయించింది. ఉప్పల్, హయత్‌నగర్, హైదర్‌నగర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, మియాపూర్, చందానగర్ ఏరియాల్లో మొదటి దశలో సర్వే చేయాలని నిర్ణయించారు. ఈ సర్వే చేసే బాధ్యతలను నియోజియో అనే సంస్థకు అప్పగించారు. దీన్ని ఖర్చు రూ.22 కోట్ల అంచనా. ఈ సర్వే మొత్తాన్ని 18 నెలల్లో సేకరించేలా జీహెచ్ఎంసీ డెడ్ లైన్ విధించింది. కానీ మూడు నెలలు పూర్తయిన 15 వేల ప్రాపర్టీలను కూడా సర్వే చేయలేకపోయారు. దీంతో జీహెచ్ఎంసీ కోట్ల రూపాయలను దుబారా చేస్తోందని పలువురు విమర్శిస్తున్నారు.

జనన, మరణ ధృవపత్రాల జారీ..

జీహెచ్ఎంసీ పరిధిలో సిటిజన్ సర్వీర్ సెంటర్ల ద్వారా జనన, మరణ ధృవ పత్రాలు జారీ చేసేవారు. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.20 నుంచి రూ.50 వసూలు చేసేవారు. కానీ బాధ్యతలను మీ సేవా కేంద్రాలకు అప్పగించారు. వీటి ద్వారా జీహెచ్ఎంసీ ఏడాదికి సుమారు రూ.కోటిపైనే వచ్చేదని ప్రస్తుతం ఆదాయమే లేకుండా పోయిందని పలువురు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నాలాల నిర్వహణ సైతం..

సీఆర్ఎంపీలో భాగంగా రోడ్ల నిర్వహణ తరహాలోనే ఎస్ఎన్డీపీలో భాగంగా మరమ్మతులు చేస్తున్న నాలాల నిర్వహణను సైతం ప్రయివేటు ఏజెన్సీలకు ఇవ్వాలని జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 1,302 కిలో మీటర్ల నాలాల వ్యవస్థ ఉంది. వీటిలో మేజర్ నాలాలు 370 కిలో మీటర్లు, మైనర్ నాలాలు 912 కిలోమీటర్ల మేర ఉన్నాయి. ఈ నాలాల్లో పూడికతీత పనులు, ఇతర నిర్వహణ పనులకు గాను ఏడాదికి సుమారు రూ.60 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

అప్పుల కుప్ప..

కోటి 30 లక్షల మందికి సేవలందిస్తున్న జీహెచ్ఎంసీ ప్రతియేటా రూ.6వేల కోట్లపైనే బడ్జెట్ ప్రవేశపెడుతుంది. అప్పులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. 2014లో జీహెచ్ఎంసీకి రూ.1,000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. 2024లో అంటే పదేండ్ల కాలంలో రూ.5,780 కోట్ల అప్పులు పేరుకుపోయాయి. వీటిలో ఎస్ఆర్డీపీ, సీఆర్ఎంపీ, డ్రెయినేజీ వ్యవస్థ మరమ్మతులకు ఏర్పాటు చేసిన స్ట్రాటజికల్ నాలా డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్ఎన్డీపీ), జేఎన్ఎన్ యూఆర్ఎం ఇండ్ల మరమ్మతుల కోసం అప్పులు తీసుకున్నారు. వీటికి ప్రతి నెల అసలు రూ.100 కోట్లు, వడ్డీ కింద రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లు చెల్లించాల్సిందే. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులను ఇవ్వడం లేదు. ఫలితంగా జీహెచ్ఎంసీ ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. అప్పులు తీసుకోవడం ప్రయివేటు ఏజెన్సీలకు అప్పగించడమే పనిగా బల్దియా పనిచేస్తోందనే విమర్శలొస్తున్నాయి. ఇవన్ని కొత్త కమిషనర్‌కు సవాల్‌గా మారాయి.

Advertisement

Next Story