CM Revanth : హైదరాబాద్ వేదికగా ఒలింపిక్స్.. రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ: సీఎం రేవంత్ రెడ్డి

by Ramesh N |   ( Updated:2024-08-25 07:28:06.0  )
CM Revanth : హైదరాబాద్ వేదికగా ఒలింపిక్స్.. రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో స్పోర్ట్స్ హాబ్‌గా గచ్చిబౌలి స్టేడియంలో 2000 సంవత్సరంలో ఏషియన్ గేమ్స్ లాంటి చాలా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇవాళ గచ్చిబౌలి స్టేడియంలో హైదరాబాద్ రన్నర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మారథాన్ 2024 లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించాల్సిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాల ఫోకస్ లేకపోవడం వల్ల ఈ దేశానికి క్రీడాల్లో ఆదర్శంగా నిలవాల్సిన హైదరాబాద్ నగరం నేడు ఆ ప్రాధాన్యత నుంచి పక్కకు జరిగిందన్నారు. నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడలను ప్రొత్సహించాలన్న ఆలోచనతో ఆ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ప్రపంచకప్ విజేత క్రికెటర్ సిరాజ్‌కు గ్రూప్ 1 జాబ్, భూమి, బాక్సర్ నిఖత్ జరీన్‌కు రూ.2 కోట్ల నగదు, డీఎస్పీ క్యాడర్ పోస్టును కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం కింద అప్రూవ్ చేసినట్లు గుర్తు చేశారు.

తెలంగాణలో యువతను క్రీడల వైపు మళ్లించాలి.. ఆసక్తిని పెంచాలని ప్రభుత్వం సంపూర్ణంగా ఆలోచిస్తుందన్నారు. క్రిడలకు మళ్లీ పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ విలేజ్‌ను దూరదృష్టితో 25 ఏళ్ల క్రితమే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించినట్లు తెలిపారు. ఈ స్పోర్ట్స్ విలేజ్ మళ్లీ క్రీడా కార్యక్రమాలకే వినియోగించాలని ప్రభుత్వం చేస్తోందన్నారు. ఇటీవల జరిగిన ఒలింపిక్స్‌లో మనం అంత గొప్పగా రాణించలేకపోయమన్నారు. మళ్లీ 2028లో ఒలింపిక్స్‌లో తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక మెడల్స్ సాధించాలనే లక్ష్యంతో నేడు రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలన్న ఆలోచన చేశామన్నారు. డిగ్రీ పట్టాలతోనే ఉద్యోగాలు రావని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభిం చిందన్నారు.

ఇటీవల సౌత్ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీని విజిట్ చేయడం జరిగిందని, వారి మెనేజ్ మెంట్‌తో మాట్లాడటం, తెలంగాణలో స్పోర్ట్స్‌ను అభివృద్ధి చేయాలని వారితో ఒప్పందం కూడా జరిగిందని వెల్లడించారు. అందరి ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ ని తెలంగాణలో నెక్ట్స్ ఆకడమిక్ ఇయర్‌లో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో గ్రామిణ ప్రాంతాల్లో ఉండే క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఆలోచనతో ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా నిన్న ఢిల్లీలో స్పోర్ట్స్ మినిస్టర్‌‌ని కలిసినట్లు తెలిపారు. రాబోయే కేల్ ఇండియా స్పోర్ట్స్, నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్‌ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని, అధ్భుతంగా నిర్వహిస్తామని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

2036లో జరగబోయే ఒలింపిక్స్ గేమ్స్‌ని ఇండియాలో నిర్వహించాలని ప్రదాని మోడీ ఆలోచన ఉందన్నారు. ఒలింపిక్స్‌ను హైదరాబాద్‌లో నిర్వహించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో మన స్టేడియంలను తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రికి తెలిపామన్నారు. ఇప్పటి నుంచే ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చేస్తామని మంత్రికి చెప్పినట్లు వెల్లడించారు. తొందరలో ఈ దేశంలో జరిగే ఏ క్రీడలైనా.. క్రికెట్‌తో సహా తెలంగాణ రాష్ట్రం నుంచి, ముఖ్యంగా గచ్చిబౌలి ప్రాంతం నుంచే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టిందన్నారు. తెలంగాణ రాష్ట్రం క్రిడలకు వేదికగా అవ్వడానికి మీ అందరి భాగస్వామ్యం అవసరమన్నారు. తప్పకుండా మన ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించబోతుందని, దీనికి సంబంధించిన అంతర్జాతీయ కోచ్‌లను తీసుకువచ్చి రాష్ట్ర క్రిడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. దేశంలోనే క్రీడలకు కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణను తీర్చిదిద్దుతాన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు, వేణుగోపాల చారి, శివసేన రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed