17 రోజుల్లో కోటి బీర్లు

by Mahesh |
17 రోజుల్లో కోటి బీర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఈ ఏడాది ఎండలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటికే హాటెస్ట్ మంథ్‌గా ఫిబ్రవరి రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అసాధారణంగా పెరుగుతున్న ఎండలు హైదరాబాద్ వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎండల నుంచి ఉపశమనం కోసం మందుబాబుల చూపు బీర్లపై పడింది. ఫలితంగా ఈ నెలలో బీర్ల అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఈ నెల(ఏప్రిల్) 1 నుంచి 17 వరకు నగరంలో ఏకంగా 1.01 కోట్ల బీర్లు అమ్ముడైనట్టు ఆబ్కారీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రోజుకు సగటున 6 లక్షల బీర్లు అమ్ముడవుతున్నట్టు ఆబ్కారీ శాఖ పేర్కొంది. ఆ శాఖ చెబుతున్న దాని ప్రకారం.. ఈ మూడు జిల్లాల్లో కలిపి ఈ నెల 17 వరకు మొత్తం 8,46,175 కేసుల బీర్లు అమ్ముడుపోయాయి.

హైదరాబాద్‌లో 1,94,351 కేస్‌లు, రంగారెడ్డి జిల్లాలో 5,59,5746 కేస్‌ల బీర్లు, మేడ్చల్ జిల్లాలో 92,078 కేస్‌ల బీర్లను విక్రయించారు. ఒక్కో కేసులో 12 బీర్లుంటాయి. ఈ లెక్కన చూసుకుంటే మొత్తం 1,01,54,100 బీర్లు అమ్ముడుపోయాయి. ఇక మార్చిలో హైదరాబాద్ జిల్లా పరిధిలో 3,68,569 కేస్‌లు, రంగారెడ్డి జిల్లా పరిధిలో 10,77,240 కేస్‌లు, మేడ్చల్ జిల్లా పరిధిలో 1,63,358 కేస్‌ల బీర్లు అమ్ముడుపోయాయి. అలాగే, ఈ ఏడాది జనవరి నుంచి హైదరాబాద్, మేడ్చల్‌ జిల్లాలలో సగటున 10 శాతం చొప్పున విక్రయాలు పెరిగాయి. రంగారెడ్డి జిల్లాలో బీర్లు రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయి. నెలకు సగటున లక్ష బీరు కేసులు అదనంగా అమ్ముడవుతున్నట్టు అబ్కారీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. కాగా, రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశముంది. దీంతో బీర్ల అమ్మకాలు మరింతగా పెరిగే అవకాశముందని ఎక్సైజ్‌శాఖ అంచనా వేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed