Hussain Sagar: హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద! 513 దాటిన నీటి మట్టం

by Ramesh N |
Hussain Sagar: హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద! 513 దాటిన నీటి మట్టం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షానికి హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. తాజాగా కురుస్తున్న భారీ వర్షానికి ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్‌లోకి భారీగా వర్షపు నీరు చేరుతోంది. ఈ క్రమంలోనే పరివాహక ప్రాంత ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. హుస్సేన్‌సాగర్ జలాశం పూర్తస్థాయి నీటి మట్టం 514 అడుగులు. ప్రస్తుతానికి నీటిమట్టం 513.21 అడుగులకు వరద నీరు చేరింది. మరోవైపు నీటి మట్టం పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలన చేశారు.

మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో చెరువులు, కుంటలు, వాగులు వర్షం నీటితో నిండు కుండలా తలపిస్తున్నాయి. తెలంగాణ నయాగరా పేరుగాంచిన ములుగులోని బోగత జలపాతాల వద్ద అత్యంత ప్రమాదకరంగా వరద ప్రవహిస్తోంది. మరోవైపు రాత్రి కురిసిన వర్షానికి కాగజ్‌నగర్ లోని ద్వారకా నగర్ లోతట్టు ప్రాంతాలు కావడంతో ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

అదేవిధంగా తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం మహబూబాబాద్‌ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంగనర్, పెద్దపల్లి భూపాలపల్లి, వరంగల్, హనుమకొండలో మొస్తారు వర్షాలు కురుస్తాయని, హైదరాబాద్‌లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed