అర్ధరాత్రి మృత్యుఘోష.. 116 మందికి పైగా దుర్మరణం

by GSrikanth |
అర్ధరాత్రి మృత్యుఘోష.. 116 మందికి పైగా దుర్మరణం
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారీ భూకంపంతో మన పొరుగు దేశమైన చైనా వణికిపోయింది. భూకంప తీవ్రతతో చైనాలో పెద్ద సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ భూకంపం వల్ల దాదాపు 116 మంది మరణించారు. 400 మందికి పైగా క్షతగాత్రులు అయ్యారని స్థానిక భూకంప సహాయక ప్రధాన కార్యాలయం ఇవాళ ప్రకటించింది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వాయువ్య చైనాలోని గన్సు, కింగ్‌హై ప్రావిన్సులలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీనితీవ్రత 6.2గా నమోదయింది. భూ అంతర్భాగంలో 35 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని స్థానిక మీడియా తెలిపింది.

మరోవైపు కొన్ని ప్రాంతాల్లో రెండో భూకంపం 3.0 తీవ్రతతో నమోదైందని అధికారులు తెలిపారు. ఈ భూకంపం వల్ల రవాణా, కమ్యూనికేషన్లు, మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లిందని నిపుణులు తెలిపారు. విపత్తు యొక్క ప్రభావాన్ని అంచనా వేయడానికి, స్థానిక సహాయ కార్యకలాపాలకు మార్గదర్శకత్వం అందించడానికి ఒక కార్యవర్గాన్ని పంపినట్లు స్థానిక మీడియా తెలిపింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భూకంపం తర్వాత ప్రాణనష్టాన్ని తగ్గించడానికి పూర్తి సహాయ చర్యలను ఆదేశించారు. క్షతగాత్రులకు చికిత్స అందించాలని, భూకంప పరిస్థితిని, వాతావరణ మార్పులను నిశితంగా పరిశీలించి ద్వితీయ విపత్తులను నివారించడానికి స్థానిక అధికారులను కోరారు.

Advertisement

Next Story

Most Viewed