TSPSC: గ్రూపు-4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్

by GSrikanth |
TSPSC: గ్రూపు-4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్‌పీఎస్సీ ద్వారా జూలై 1న జరగనున్న గ్రూప్‌–4 పరీక్ష నిర్వహణకు అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే రాష్టంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, చీఫ్‌ సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల అధికారులకు టీఎస్‌పీఎస్‌సీ కమిషన్ అధికారులు సూచనలు చేశారు. పరీక్ష ఏర్పాట్లు, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలపై గురించి చర్చించారు. జూలై 1న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందని అధికారులు తెలిపారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 8,180 ఖాళీలకు గాను రాష్టంలోని 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ ద్వారా ఇప్పటికే అత్యధిక మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారని, మిగతా వారు కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

అభ్యర్థులు నిర్ణీత సమయానికి కనీసం 15 నిమిషాలు ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. సమయం దాటితే లోనికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బస్టాండ్లలో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీసీ కెమెరాల నిఘాలో పకడ్బందీగా పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. లైజనింగ్‌ ఆఫీసర్‌, ఆకస్మిక తనిఖీల కోసం ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు నియమించామని చెప్పారు. అభ్యర్థులు నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు.

ప్రభుత్వం జారీచేసిన ఏదో ఒక ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరి చేసింది. హాజరు పట్టికలో ఫొటోను.. అభ్యర్థి గుర్తింపు కార్డు, ముఖాన్ని సరిచూసి సంతకం, వేలిముద్ర తీసుకోనున్నారు. పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉండటంతో పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను కమిషన్‌ ఆదేశించింది. గతంలో జరిగిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఇబ్బందులు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్‌సీ తదుపరి పరీక్షల్లో అభ్యర్థుల్లో అపోహలు లేకుండా ఉండేందుకు ఓఎంఆర్‌ పత్రాల్లో అభ్యర్థులు హాల్‌టికెట్‌ నంబరు, ప్రశ్నపత్రం కోడ్‌, పేరు, సంతకం తప్పకుండా పేర్కొనాల్సి ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed