చదువుకునేది ఎలా సారు..? ఇదేనా కార్పొరేట్ విద్య

by Sathputhe Rajesh |
చదువుకునేది ఎలా సారు..? ఇదేనా కార్పొరేట్ విద్య
X

దిశ, కూకట్​పల్లి: నియోజకవర్గం అభివృద్ధిలో నంబర్​‌వన్, వేల కోట్లతో అభివృద్ధి జరిగింది. ప్రజలకు మౌలిక సదుపాయలు కల్పించాం అంటు ప్రజా ప్రతినిధులు ఇప్పుడు కూకట్​పల్లి నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమావేశం నిర్వహించిన ఊకదంపుడు ఉపన్యాసాలతో రానున్న ఎన్నికలలో ఓట్లు దండుకునేందుకు ప్రజలకు గాలం వేస్తున్నారు. అభివృద్ధి అంటే కేవలం లక్షలు, కోట్లు పోసి కట్టుకున్న, కొనుకున్న అపార్టుమెంట్​లు, విల్లాలు, గేటెడ్​ కమ్యునిటిలలో నివసిస్తున్న ధనికుల కాలనీలలో పార్కులు, వాకింగ్​ ట్రాకులు, ఓపెన్​ జిమ్ములు, క్రీడా మైదానాలు, షటిల్​ కోర్టులు ఏర్పాటు చేయడమేనా...?

కార్లు వేసుకుని రయ్యిమని దూసుకు పోవడానికి నిర్మించిన ఫ్లైఓవర్​లు, బ్రిడ్జిలేనా...? పేదల పిల్లలు చదువుకుంటున్న దేవాలయాల వంటి విద్యాలయాలు ఈ వేల కోట్ల అభివృద్ధి పుస్తకంలోని సెలబస్​లో ఉండవా...? అంటే అవుననే అనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దలు బడి బాట కార్యక్రమం అమలు చేశాం, ప్రభుత్వ పాఠశాలలో కార్పోరేటర్​ విద్య అందిస్తున్నాం, ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచాము అని చెప్పిన మాటలన్ని ప్రకటణలకే పరిమితం అయ్యాయి. బడిబాట కార్యక్రమం ఇప్పటి వరకు కూకట్​పల్లి, బాలానగర్​ మండలాలలోని పాఠశాలల బాట పట్టలేదు. కొత్త భవనాలలో కొనసాగుతున్న పాఠశాలల భవనాలకు సున్నం అద్ది మమా అనిపించి చేతులు దులుపుకున్నారు ప్రభుత్వ పెద్దలు, అధికారులు. నియోజకవర్గం పరిధిలో అత్యధిక శాతం ప్రభుత్వ పాఠశాలలు కమ్యునిటి హాల్​లలో, పశువుల కొట్టాల కన్న దారుణంగా ఉన్న శిథిలావస్థకు చేరుకున్న భవనాలలో కొనసాగుతు ఉన్నాయి.

పేదల పాఠశాల భవనాల దీన గాధలు ఎన్నో...?

కూకట్​పల్లి నియోజకవర్గం కూకట్​పల్లి, బాలానగర్​ మండలాలలోని పేద విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాల భవనాల దీన గాధలు వర్ణనాతీతం. నియోజకవర్గం పరిధిలోని కూకట్​పల్లి ప్రకాష్​నగర్​, దయార్​గూడ, బాలానగర్​ డివిజన్​ పరిధిలోని చరబండ రాజు కాలనీ, ఫతేనగర్​లోని గౌతమ్​ నగర్​, మూసాపేట్​ అంజయ్యనగర్​, బాలాజగనర్​ డివిజన్​ వివేక్​నగర్​ కాలనీలలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మొత్తం వేలాది మంది విద్యార్థులు కనీస మౌలిక సదుపాయాలు లేని భవనాలు, శిథిలావస్థకు చేరుకున్న భవనాలలో విద్యనభ్యసిస్తున్నారు.

ప్రతి సారి హంగామ చేయడం పాఠశాలలకు మహార్ధశ కల్పిస్తాం అంటు ప్రతి వార్షిక సంవత్సర ప్రారంభ సమయంలో నిర్వహించే బడి బాట కార్యక్రమంలో నాయకులు బడి బాట పట్టడం, ఆ తరువాత బడి బాటనే మరవడం ఆనవాయితిగా మారింది. చరబండరాజు కాలనీలో పాఠశాల భవనం పెచ్చులు ఊడి పడుతున్నాయి ఇప్పటికే పెచ్చులూడి స్లాబ్​లో నుంచి ఇనుప కడ్డిలు తొంగి చూస్తున్నాయి. శాశ్వత భవన నిర్మాణ వాగ్దానాలే తప్ప తెలంగాణ ప్రభుత్వం ఏర్పాడిన తొమ్మిదిన్నర ఏండ్లలో ఎన్నడు నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదని కాలనీ వాసులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కనీస వసతులు ఏవి...?

పేద విద్యార్థులు విద్యనభ్యసిస్తున్న పాఠశాలలో నీరు, మూత్రశాలలు, భోజనం చేసేందుకు సరియైన సదుపాయం, శుభ్రమైన వాతావరణం ఇవి ప్రభుత్వ పాఠశాలలో భూతద్దం పెట్టి వెతికిన దొరకడం లేదు. చరబండరాజు పాఠశాలలో మూత్ర శాలలు సరియైన నిర్వహణ లేక కంపు కొడుతుంటే విద్యార్థులు పాఠశాల ఆవరణలోనే మూత్ర విసర్జన కానిచేస్తున్నారు. అంజయ్య నగర్​ పాఠశాలలో మూత్రశాల ముందే ఓ తరగతి నిర్వహిస్తుంటే మూత్రశాల కంపును పీలుస్తు ఉపాధ్యాయుడు బోధిస్తుంటే, విద్యార్థులు చదువుకుంటున్నారు. ఫతేనగర్​లోని ప్రాథమిక పాఠశాల తాత్కాలిక భవనంలో నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్న ఒక్క మూత్రశాలను ఉపాధ్యాయులు వినియోగిస్తున్నారు, విద్యార్థులు రోడ్లపై మూత్ర విసర్జనకు వెళుతున్నారు, ఇండ్లు దగ్గరున్న వారు వారి ఇండ్లకు వెళుతున్నారని పాఠశాల ఉపాధ్యాయురాలు జానకి తెలిపారు.

ఒక గదిలో రెండు నుంచి మూడు తరగతులు:

నియోజకవర్గం పరిధిలోని ఒకటవ తగరగతి నుంచి 5వ తరగతి వరకు చదువు చెప్పే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండు లేదా మూడు గదులు మాత్రమే ఉండటంతో ఒక్కో గదిలో రెండు నుంచి మూడు తరగతుల విద్యార్థులకు కూర్చోబొట్టి విద్య బోధన నిర్వహిస్తున్నారు. గదులు లేని వారు బయట, మూత్రశాలల ముందే తరగతులు నిర్వహిస్తున్నారు. చిన్న చిన్న గదులలో ఒకే చోట లైబ్రరి, స్టాఫ్​, హెచ్​ఎం రూం, తరగతులు నిర్వహిస్తున్నారు. చాలి చాలని తరగతి గదులు ఉంటుండటంతో విద్యార్థులు తరచు పాఠశాలలకు గైర్హాజరు అవుతున్నట్టు ఉపాధ్యాయులు తెలుపుతున్నారు.

పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు: సత్యం శ్రీరంగం, టీపీసీసీ అధికార ప్రతినిధి.

కూకట్​పల్లి నియోజకవర్గంలో 90 శాతం అభివృద్ధి జరిగిందని స్థానిక ఎమ్మెల్యే పదే పదే మాట్లాడటం హాస్యాస్పదం. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో దుస్థితి చూస్తుంటే అధ్వాన్నంగా ఉంది. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, డ్రైనేజి మాత్రమే కాదు, విద్యా ప్రమాణాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం. పేద విద్యార్థులకు సరియైన విద్యనందించే విద్యాలయాలే అధ్వాన్నంగా ఉంటే అభివృద్ధి ఎక్కడ జరిగినట్టు.

Advertisement

Next Story

Most Viewed