Hot News: హెల్త్ సిటీ ఎస్టిమేషన్స్‌పై విజిలెన్స్ ఎంక్వయిరీ షురూ.. పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశం

by Shiva |
Hot News: హెల్త్ సిటీ ఎస్టిమేషన్స్‌పై విజిలెన్స్ ఎంక్వయిరీ షురూ..  పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: వరంగల్ హెల్త్ సిటీకి ఎస్టిమేషన్స్ అమాంతంగా ఎలా పెరిగాయని విజిలెన్స్ ఆఫీసర్లు ఆరా తీశారు. ఆ హెల్త్ సిటీ నిర్మాణాలపై వివరాలు సేకరించేందుకు విజిలెన్స్ టీం గురువారం డీఎంఈ ఆఫీసుకు వచ్చింది. హాస్పిటల్ ప్లాన్ ఎప్పుడు జరిగింది? టెండర్లు ఎప్పుడు ఇచ్చారు? ఎస్టిమేషన్ ఎలా పెరిగింది? కమిటీలో అబ్జెక్షన్స్‌ వచ్చాయా? గతంలో హెల్త్ సిటీపై ఎన్ని మీటింగ్స్ నిర్వహించారు? మినిట్స్ కాపీలు ఉన్నాయా? వంటి తదితర ప్రశ్నలు వేస్తూ ఆఫీసర్ల నుంచి సమాచారం సేకరించారు. మూడు నాలుగు రోజుల్లో మిగతా సమాచారాన్ని కూడా అందజేస్తామని అధికారులు విజిలెన్స్‌ కు తెలిపారు. విజిలెన్స్ ఆఫీసర్ల రాకతో డీఎంఈ ఆఫీసులోని స్టాఫ్‌లో హడావిడి నెలకొన్నది. ఆయా ఆఫీసర్లు ఏం అడుగుతారో? ఏం సమాధానం ఇవ్వాల్సి ఉంటుందోనని కొందరు అధికారులు టెన్షన్ పడ్డట్టు తెలిసింది. విజిలెన్స్ ఆఫీసర్లు అడిగిన వివరాల్లో కొన్ని అందజేశామని, మిగతావి ప్రిపేర్ అవుతున్నాయని ఓ అధికారి తెలిపారు. తన అధికారిక ఆఫీసులో ఉన్న వివరాలన్నీ విజిలెన్స్‌ కు సమర్పిస్తానని వెల్లడించారు.

సీఎం విజిట్‌లో గుర్తింపు

ఈ ఏడాది జూన్‌లో సీఎం రేవంత్ వరంగల్ పర్యటనకు వెళ్లారు. ఇదే సమయంలో హెల్త్ సిటీలో నిర్మిస్తున్న హాస్పిటల్‌ను పరిశీలించారు. నిర్మాణాలు, అంచనాలను అడిగి తెలుసుకున్నారు. అంచనా వ్యయం పెరిగిందని గుర్తించిన సీఎం అధికారులను నిలదీశారు. ఫైల్స్, పేపర్ వర్క్స్ లేకుండా అడ్డగోలుగా వ్యయం ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు. ఆ వెంటనే ఆయన హైదరాబాద్‌లో ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించి, నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ అధికారులకు ఆదేశాలిచ్చారు. దీనిలో భాగంగానే ఆర్ అండ్ బీ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫీసులో ఇందుకు సంబంధించిన పేపర్లు, డాక్యుమెంట్లను విజిలెన్స్ టీమ్స్ వేర్వేరుగా సేకరిస్తున్నాయి.

నిర్మాణాల బడ్జెట్ ఇలా..

వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణానికి రూ.1,100 కోట్లు ఖర్చు అవుతాయని 4 డిసెంబరు 2021న గత ప్రభుత్వం జీవో విడుదల చేసింది. నిర్మాణానికి కావాల్సిన అన్ని మెటీరియల్స్ కలిపే ఈ బడ్జెట్‌ను ఖర్చు పెడుతున్నట్టు వివరించారు. నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఏడాది ఖర్చు పెంచుతూ వెళ్లారు. కానీ అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు బయటకు రాలేదు. ఏకంగా రూ.1,700 కోట్లకు వ్యయం పెరిగింది. దీన్ని గుర్తించిన సీఎం రేవంత్ నిర్మాణాలపై ఎంక్వయిరీకి ఆదేశించారు. మరోవైపు నగరం నలుమూలలా అంటూ కొత్తపేట్, సనత్‌నగర్‌‌, అల్వాల్‌‌లో టిమ్స్‌ మల్టీ ఆస్పత్రుల నిర్మాణాలకు ఏప్రిల్ 2022న జీవో ఇచ్చారు. ఇందులో కొత్తపేట్ టిమ్స్‌ కు రూ.900 కోట్లు, సనత్‌నగర్ టిమ్స్‌ కు రూ.882 కోట్లు, అల్వాట్ టిమ్స్‌ కు రూ.897 కోట్ల అంచనా వ్యయాన్ని చూపించారు. మూడూ కలిపి రూ.2,679 కోట్ల అంచనా. దీన్ని కూడా ఏడాది‌లోనే పెంచినట్టు తెలుస్తోంది. వీటిపై కూడా ఎంక్వయిరీ జరుగుతుందని వైద్యారోగ్యశాఖలోని ఓ అధికారి ‘దిశ’కు తెలిపారు.

Advertisement

Next Story