President Murmu: గిరిజనుల భాగస్వామ్యంతోనే దేశాభివృద్ధి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

by vinod kumar |
President Murmu: గిరిజనుల భాగస్వామ్యంతోనే దేశాభివృద్ధి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
X

దిశ; నేషనల్ బ్యూరో: గిరిజనుల భాగస్వామ్యం లేకుండా దేశ సమగ్రాభివృద్ధి సాధ్యం కాదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Dhroupadi murmu) అన్నారు. ప్రకృతికి అనుగుణంగా జీవించడం ఎలాగో గిరిజన సమాజం నుంచి నేర్చుకోవాలని సూచించారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో ఉన్న ఐఐటీ(IIT) భిలాయ్ స్నాతకోత్సవంలో ముర్ము ప్రసంగించారు. ‘గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంతో ఛత్తీస్‌గఢ్ కీలకంగా వ్యవహరిస్తోంది. ఆదివాసీలు ప్రకృతిని చాలా దగ్గరగా అర్థం చేసుకుంటారు. శతాబ్దాలుగా పర్యావరణానికి అనుగుణంగా జీవిస్తున్నారు. వారి ఆలోచన, జీవనశైలిని అర్థం చేసుకోవడం ద్వారా భారత్ స్థిరమైన అభివృద్ధికి గణనీయమైన సహకారం అందుతుంది’ అని వ్యాఖ్యానించారు.

సాంకేతికతను అందిపుచ్చుకుని గిరిజనుల సమస్యలు పరిష్కరించడంలో ఐఐటీ బిలాయ్ ముందుండటం ప్రశంసనీయమని కొనియాడారు. ఐఐటీ భిలాయ్ ప్రత్యేకంగా అగ్రిటెక్(Agritech), హెల్త్‌టెక్(Health tech), ఫిన్‌టెక్‌(Fintech)లపై దృష్టి సారించిందని తెలిపారు. రాయ్‌పూర్‌లోని ఎయిమ్స్‌తో కలిసి ఒక మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేసిందని గుర్తు చేశారు. ఈ యాప్ గ్రామాల్లోని వారి ఇంటి వద్ద ప్రజలకు వైద్య, ఆరోగ్య సూచనలను అందించడానికి ఎంతో ఉపయోగపడుతుందని గుర్తు చేశారు. దేశంలో ప్రస్తుతం 23 ఐఐటీలు ఉన్నాయని, యువతకు అత్యంత నాణ్యమైన సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి ప్రాంతంలో ఐఐటీలను ఏర్పాటు చేసిందని తెలిపారు.

Advertisement

Next Story