Compensation : పరిహారం....ఫలహారం

by Sridhar Babu |
Compensation : పరిహారం....ఫలహారం
X

దిశ, వైరా : గత నెలలో కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు అందించాల్సిన నష్టపరిహారం (Compensation) ఫలహారంగా మారింది. వ్యవసాయ శాఖలోని మండల వ్యవసాయాధికారితో పాటు ఏఈఓ లు పంట నష్టపోయిన రైతుల ఎంపికలో చేతివాటాన్ని ప్రదర్శించారనే విమర్శలు వినవస్తున్నాయి. ఏఈఓలు తమ ఇష్టారాజ్యంగా జాబితాను తయారు చేసి అందిన కాడికి దండుకున్నారనే ఆరోపణలున్నాయి. భారీ వర్షాలకు పంట నష్టపోయిన అనేకమంది అర్హులైన రైతులకు నష్టపరిహారం అందలేదు. అంతేకాకుండా పంట నష్టపోని అనేకమంది రైతులకు నష్టపరిహారం అందటం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఏఓ, ఏఈఓలు కేవలం కాసులకు కక్కుర్తి పడి అర్హులైన రైతులను జాబితాలో చేర్చకుండా రోడ్డున పడేశారనే విమర్శలు వినవస్తున్నాయి.

ఇంత జరిగినా జిల్లా వ్యవసాయ అధికారులు తమకేమీ తెలవనట్లు వ్యవహరించటం పలు అనుమానాలకు దారితీస్తుంది. ప్రధానంగా ముగ్గురు ఏఈవోలు (AEOs)అందిన కాడికి దండుకున్నారని విమర్శలు బలంగా ఉన్నాయి. పంట నష్టపరిహారం జాబితా అధికారులు తయారు చేసిన విషయం గ్రామాల్లో రైతులకు తెలియదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏఈఓలు తమ పరిధిలోని రైతు వేదికలను రోజూ తెరవకుండా కేవలం మండల వ్యవసాయ అధికారి కార్యాలయం కేంద్రంగా తమ విధులు నిర్వహిస్తూ రైతులకు దూరంగా ఉండటం కూడా చర్చనీయాంశంగా మారుతుంది.

అనర్హులకే పెద్దపీట...లక్షలాది రూపాయలు గోల్మాల్.....

వైరా మండలంలో పంట నష్టపోయిన రైతుల ఎంపికల్లో వ్యవసాయ అధికారులు అనర్హులకు పెద్దపీట వేశారు. తమకు నగదు ఇచ్చిన రైతుల పేర్లను జాబితాలో రాసి అందిన కాడికి దండుకున్నారు. దీంతో ప్రభుత్వానికి సంబంధించిన లక్షలాది రూపాయల నిధులు గోల్మాల్ అయ్యాయి. వైరా మండలంలో మొత్తం 454 మంది రైతులకు 37 లక్షల 70 వేల 250 రూపాయలను ప్రభుత్వం నష్టపరిహారం కింద చెల్లించింది. మండలంలో అధికంగా సోమవారం గ్రామంలో 103 మంది రైతులకు, అత్యల్పంగా పుణ్య పురం గ్రామంలో ఒక్క రైతుకు నష్ట పరిహారం మంజూరైంది.

అష్టగుర్తిలో 3, బ్రాహ్మణపల్లిలో 8, గన్నవరంలో 10, గొల్లెనపాడులో 32, గొల్లపూడిలో 4, ఖానాపురంలో 4, కొండకుడిమలో 66, ముసలిమడుగులో 91, లింగన్నపాలెంలో 2, నారపనేనిపల్లిలో 8, పాలడుగులో 2, పూసలపాడులో 2, రెబ్బవరంలో 29, సిరిపురంలో 9, తాటిపూడిలో 41, వల్లపురంలో 23, విప్పలమడకలో 16 మంది రైతులకు నష్టపరిహారాన్ని ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో వేసింది. అయితే మండలంలోని సోమవారం, ముసలిమడుగు, కొండకుడిమ, గొల్లెనపాడు, తాటిపూడి, వల్లాపురం, రెబ్బవరం తదితర గ్రామాల్లో అనర్హులకు పంట నష్టపరిహారం పంపిణీ చేయడం వివాదాస్పదమవుతుంది. ప్రధానంగా ఏఈఓ గా పని చేస్తున్న వెంకటనర్సుడు గ్రామాల్లో తన ఇష్టారాజ్యంగా పంట నష్టపోయిన రైతులను ఎంపిక చేయటం వివాదాస్పదమవుతుంది.

గ్రామాల్లో తిరగని ఏఈఓలు.......

వైరా మండలంలోని గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తిస్థాయిలో చేయకుండానే ఏఈఓలు జాబితాను తయారు చేశారు. గ్రామాల్లో మొక్కుబడిగా ఇద్దరు ముగ్గురు రైతులు పొలాలను ఏఈఓలు పరిశీలించారు. అనంతరం మండల వ్యవసాయ కార్యాలయానికి ఫొటోలు తీసుకుని వెళ్లిన రైతుల పేర్లను జాబితాలో చేర్చారు. కనీసం పంట నష్టపరిహారం కోసం రైతులను ఎంపిక చేస్తున్నామని గ్రామాల్లో మండల స్థాయిలో ఎలాంటి ప్రచారం నిర్వహించలేదు. కేవలం తమ ఇష్టారాజ్యంగా ఏఈఓ లు తమకు నచ్చిన పేర్లను రాయటం వివాదాస్పదమవుతుంది. గత నెల రోజులుగా వైరా మండలంలోని ఐదు క్లస్టర్లలో ఉన్న రైతు వేదిక భవనాల తలుపుల తాళాలు తెరుచుకోవడం లేదంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వైరా మండలంలోని విప్పలమడక గ్రామంలో భారీ వర్షాలకు అనేకమంది రైతుల పంటలు నాశనమయ్యాయి. ఇక్కడ ఏఈఓ కేవలం నలుగురు రైతుల పొలాలను పరిశీలించి చేతులు దులుపుకున్నారు. ఈ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రైతులకు వారి పొలాలను పరిశీలించకుండా ఏఈఓ పంట నష్టపరిహారం అందించటం విశేషం. క్షేత్రస్థాయిలో ఏఈవోలు పర్యటించకపోవడం, పంట నష్టం జరిగిన రైతులు పేర్లు తమకు ఇవ్వాలని ప్రచారం చేయకపోవడంతో అర్హులైన వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైరా మండల వ్యవసాయ అధికారి ఏఈఓ లను తన చుట్టూ కూర్చోబెట్టుకొని రైతు వేదికలకు వెళ్లకుండా నిలువరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా స్థాయి వ్యవసాయ అధికారులు పూర్తిస్థాయిలో విచారించి పంట నష్టపరిహారంలో అనర్హులను ఎంపిక చేసిన ఏఈఓలపై చర్యలు తీసుకొని, అర్హులైన రైతుల కోసం మరోసారి పంట నష్టం అంచనా వేయాలని మండల రైతులు కోరుతున్నారు.

Advertisement

Next Story