Hot News: బీసీ కమిషన్ కొత్త టీం రెడీ..! తుది దశకు చేరుకున్న కసరత్తు

by Shiva |
Hot News: బీసీ కమిషన్ కొత్త టీం రెడీ..! తుది దశకు చేరుకున్న కసరత్తు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త బీసీ కమిషన్ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కసరత్తు తుది దశకు చేరినట్టు తెలుస్తున్నది. రెండు, మూడు రోజుల్లో కొత్త కమిషన్ చైర్మన్, మెంబర్లను అపాయింట్ చేస్తూ రాజ్ భవన్ నుంచి గెజిట్ విడుదలయ్యే చాన్స్ ఉందని సమాచారం. ప్రస్తుతం ఉన్న కమిషన్‌కు కొన్ని రోజుల పాటు ఎక్స్‌టెన్షన్ ఇవ్వాలని వచ్చిన ప్రతిపాదనను సీఎం పక్కన పెట్టారని తెలిసింది. అయితే చైర్మన్, మెంబర్లుగా ఎవరిని నియమించాలనే అంశంపై పార్టీ లీడర్లతో పాటు రిటైర్డ్ జడ్జీల పేర్లను కూడా పరిశీలించినట్లు ప్రచారం జరుగుతోంది.

త్వరలో కొత్త కమిషన్

ప్రస్తుత బీసీ కమిషన్ పదవీ కాలం ఈనెల 31తో ముగియనుంది. ఈలోపే కొత్త కమిషన్ ఏర్పాటు చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. కొత్త కమిషన్ కే బీసీ కుల గణన బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. అయితే ఎవరిని నియమించాలనే అంశంపై ఆయన తుది కసరత్తు చేసినట్టు చర్చ జరుగుతున్నది. అందులో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఇప్పటికే సంప్రదింపులు పూర్తి చేసినట్టు టాక్ ఉంది. చైర్మన్, మెంబర్లుగా అపాయింట్ చేసే వ్యక్తుల పేర్లను సిఫారసు చేస్తూ ప్రభుత్వం రాజ్ భవన్ కు శుక్రవారం లేదా శనివారం లేఖను పంపే చాన్స్ ఉంది. ఆ తర్వాత గవర్నర్ ఆమోదించి, కొత్త బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేసే అవకాశముంది.

పదవుల కోసం తీవ్ర పోటీ

బీసీ కమిషన్‌లో చైర్మన్, ముగ్గురు సభ్యులు ఉంటారు. హైకోర్టు జడ్జితో సమానమైన ప్రొటోకాల్, జీతభత్యాలు ఉండటంతో ఆ పదవులను దక్కించుకునేందుకు కాంగ్రెస్ బీసీ లీడర్లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని లీడర్లు, పోటీ చేసి ఓడిపోయిన నాయకులు, పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ లో పనిచేసిన లీడర్లు పదవులు దక్కింకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ ను కలిసి, తమకు ఆవకాశం ఇవ్వాలని కోరారు. మరికొందరు లీడర్లు నేరుగా అధిష్టానంలోని కొందరు లీడర్ల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు లీడర్లు బీసీశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి తమకు బీసీ కమిషన్ లో చోటు కల్పించాలని వినతులు ఇచ్చినట్టు తెలిసింది.

పొడిగింపు కోసం పైరవీలు?

ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్ పదవీ కాలాన్ని మరికొంత కాలం పొడిగించాలని కొందరు కాంగ్రెస్ లీడర్లు లాబీయింగ్ చేశారనే ప్రచారం ఉంది. సదరు లీడర్లు ప్రస్తుత చైర్మన్‌తోనే కులగణన జరిపించాలని సీఎం రేవంత్ వద్ద ప్రస్తావించగా.. ఆయన తోసిపుచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీలో చాలామంది సీనియర్ బీసీ లీడర్లు ఉన్నారని, వారికి ఛాన్స్ ఇవ్వాలని క్లారిటీ ఇవ్వడంతో లాబియింగ్ చేస్తున్న లీడర్లు మరో మాట మాట్లాడకుండా వెనక్కి వచ్చినట్లు తెలిసింది.

Advertisement

Next Story