Hot New: వైద్య, ఆరోగ్య శాఖలో హైకోర్టు ఆర్డర్స్ బేఖాతరు?

by Shiva |
Hot New: వైద్య, ఆరోగ్య శాఖలో హైకోర్టు ఆర్డర్స్ బేఖాతరు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కౌన్సెలింగ్‌లో ఆయా ఉద్యోగి ఆప్షన్లు ఇచ్చిన చోట పోస్టింగులను మాడిఫికేషన్ చేయాలని ఇటీవల హైకోర్టు వైద్య, ఆరోగ్య శాఖకు ఆదేశాలిచ్చింది. 14 రోజుల్లో ఈ ప్రాసెస్ పూర్తవ్వాలని పేర్కొంది. అయితే, పబ్లిక్ హెల్త్ విభాగం కోర్టు ఆదేశాలను లైట్ తీసుకుంటున్నదని, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టింగ్ అంశంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు కోర్టు మెట్లు ఎక్కిన మల్టీ జోన్-1, మల్టీ జోన్-2 కలిపి దాదాపు 30 మంది ఉద్యోగులకు పబ్లిక్ హెల్త్ విభాగం షోకాజ్ నోటీసులిచ్చింది. మూడు రోజుల్లో నోటీసులకు స్పందించాలని సూచించింది. ఇందులో ల్యాబ్ టెక్నీషియన్, ఎంపీహెచ్ఈవో, ఎంపీహెచ్ఎస్, తదితర కేడర్ ఉద్యోగులు ఉన్నారు. తమకు పోస్టింగ్స్ ఇవ్వాలని కోర్టు చెబితే, డిపార్ట్ మెంట్ నుంచి షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఏమిటని ల్యాబ్ టెక్నీషియన్లు ప్రశ్నిస్తున్నారు. పైగా పోస్టింగుల అంశంలో వైద్య, ఆరోగ్య శాఖ అప్పీల్‌కు వెళ్లాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఆఫీసర్లు తప్పులు చేసి, తమను ఎందుకు సతాయిస్తున్నారని ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 అసోసియేషన్లు ఫైర్ అవుతున్నాయి.

మాకు ఎలాంటి ఆదేశాలు లేవు!

జనరల్ ట్రాన్స్‌ఫర్లలో భాగంగా ఆప్షన్ల ప్రకారం పోస్టింగులు ఇచ్చే వరకు ఆయా ఉద్యోగిని పాత స్థానంలోనే కొనసాగించాలని హై‌కోర్టు సూచించింది. దీంతో ఆయా ఉద్యోగులు తిరిగి పాత స్థానాలకు వెళ్లగా, తమకు ఎలాంటి ఆర్డర్స్ రాలేదని మెడికల్ ఆఫీసర్లు, డీఎమ్‌హె‌వో‌లు చెప్పారని, డీహెచ్‌ను కలిశామని కానీ ఆయన వినలేదని ల్యాబ్ టెక్నీషియన్లు ఈ లోపే షోకాజ్ నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. కరోనా సమయంలో కష్టపడినోళ్లపై ఇలాంటి వివక్ష చూపడం సరికాదని కోరుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

ఇదీ జరిగింది..

వైద్య, ఆరోగ్య శాఖలోని ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 సాధారణ బదిలీ కౌన్సెలింగ్‌లో అభ్యర్థులు ఎంచుకున్న స్థానం కాకుండా అధికారులు వారికి ఇష్టం వచ్చినట్లు బదిలీలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. కౌన్సెలింగ్ సమయంలో వేకెన్సీ పొజిషన్ చూపించి, ఆ తర్వాత ఇతర స్థానాల్లోకి మార్చేశారని ఎల్టీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్‌‌లో వేకెన్సీల ప్రకారం ఐదు ఆప్షన్లు ఇచ్చినా, ఇవేమీ కాకుండా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ఇష్టానుసారంగా పోస్టింగులు ఇచ్చారని ల్యాబ్ టెక్నీషియన్లు మండిపడుతున్నారు. పైగా కౌన్సెలింగ్ సమయంలో ఈ వేకెన్సీలో పోస్టింగ్ ఇస్తున్నట్లు సంతకాలు కూడా సేకరించారు. వాళ్ల రికార్డుల్లో ఎంట్రీ చేశారు. కానీ, పోస్టింగ్ ఆర్డర్స్‌లో మాత్రం వర్కింగ్ ప్లేస్ లను మార్చేశారని మండిపడ్డారు. ల్యాబ్ టెక్నీషియన్ క్యాడర్ స్ట్రెంత్‌లో 5 శాతం మినహాయించి 95 శాతం అభ్యర్థులు ఎంచుకున్న ప్రాంతం కాకుండా కనీసం జిల్లా లోపల కూడా కాకుండా ఇతర జిల్లాలకు ట్రాన్స్‌ఫర్లు చేశారని, దీంతోనే హైకోర్టును ఆశ్రయించామని ఉద్యోగులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed