మంత్రి పదవులపై ఆశలు.. జూపల్లికి దక్కనున్న కీలక శాఖ..?

by Sathputhe Rajesh |
మంత్రి పదవులపై ఆశలు.. జూపల్లికి దక్కనున్న కీలక శాఖ..?
X

దిశ బ్యూరో, మహబూబ్‌నగర్: తెలంగాణలో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో అధికారం చేజిక్కించుకుంది. ఇక, కొలువు తీరబోతున్న రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం లభిస్తుంది అన్న ఆశతో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ముగ్గురు ఎమ్మెల్యేలు త్వరలో కొలువు తీరబోయే మంత్రివర్గంలో తమకు స్థానం లభించబోతోందని ఆశాభావంతో ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఎవరు కొలువు దీరినా ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి తమకు తప్పనిసరిగా అవకాశాలు దక్కుతాయంటున్నారు.

మంత్రి పదవులపై ముగ్గురు ఆశలు..

త్వరలో కొలువు తీరబోయే మంత్రివర్గంలో తమకు అవకాశాలు లభిస్తాయి అని ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది గత కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలలో మంత్రి పదవిని నిర్వహించిన కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ఈసారి తప్పనిసరిగా తనకు మంత్రి పదవి లభిస్తుంది అన్న ఆశాభావంతో ఉన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటితో పాటు తన వంతు కృషి చేయడం, వనపర్తి, నాగర్ కర్నూల్ అభ్యర్థులకు టికెట్లు ఇప్పించుకోవడంలోనూ సఫలం కావడం, పాలిటిక్స్‌లో అనుభవం ఉండడంతో తనకే మొదటి ప్రాధాన్యత లభిస్తుందన్న ఆశాభావంతో జూపల్లి ఉన్నారు. ఆయన అనుచర వర్గం సైతం జూపల్లికి తప్పకుండా మంత్రి పదవి లభిస్తుంది అన్న నమ్మకంతో ఉన్నారు.

అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 50వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన చిక్కుడు వంశీకృష్ణ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధికార పార్టీకి మొదటి నుంచి ముచ్చెమటలు పట్టించి, అత్యధిక మెజారిటీతో గెలుపొందడం, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండడం తదితర కారణాల వల్ల తనకు అవకాశం లభిస్తుంది అన్న ఆశతో వంశీకృష్ణ ఉన్నారు.

కాగా మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై ఘన విజయం సాధించిన యెన్నం శ్రీనివాసరెడ్డి సైతం మంత్రి పదవి దక్కుతుంది అన్న ఆశతో ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండడంతో పాటు, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను ఓడించి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన యెన్నం తనకు తప్పనిసరిగా మంత్రి పదవి దక్కనుంది అన్న ఆశతో ఉన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేదా, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు మెండుగా ఉండడంతో మరొకరు లేదా ఇద్దరికీ మంత్రులుగా అవకాశాలు దక్కుతాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ముదిరాజ్ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో తనకు కూడా అవకాశం లభించవచ్చు అని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఉన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అండదండలతో మంత్రి పదవిపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. మొత్తంపై కొలువుదీరబోయే కొత్త ప్రభుత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఇద్దరు లేదా ముగ్గురికి మంత్రి పదవులు దక్కుతాయి అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed