- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సికింద్రాబాద్ కాంగ్రెస్‌లో కల్లోలం.. కేడర్‌లో డైలమా!
దిశ, హైదరాబాద్ బ్యూరో : సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎదురీదుతోంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న దానం నాగేందర్ ప్రచారంలో ఇతర పార్టీల అభ్యర్థుల కంటే వెనకబడి ఉన్నారని సొంతపార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. ఎన్నికల సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు తటస్థంగా ఉన్నవారిని సైతం కలుపుకుపోయి ప్రచారం చేపట్టాల్సి ఉండగా దానం అటువంటివి ఏమీ చేయడం లేదనే విమర్శలు వినబడుతున్నాయి. దాదాపు 85 శాతం అక్షరాస్యులు ఉన్న సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో గెలుపు అన్ని పార్టీలకు ఓ సవాల్‌గా మారింది. ఇక్కడ గెలిచిన పార్టీనే కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే నమ్మకం కూడా ఉంది. ఈ సెగ్మెంట్ పరిధిలో సికింద్రాబాద్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, అంబర్‌పేట్, ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
వీటిల్లో ఖైరతాబాద్ నుంచి కారు గుర్తుతో గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేశారు. నాంపల్లిలో ఎంఐఎం మినహాయిస్తే ఇతర అన్ని సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇలా ప్రత్యర్థి పార్టీలు బలంగా ఉన్న చోట రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం చేయాల్సి ఉండగా ఆయన ఇప్పటి వరకు ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో ప్రచారం చేపట్టలేదు. దీంతో గెలుపు ఎలా సాధ్యమని సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది.
ముంచుకొస్తున్న గడువు..
లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగింపునకు కేవలం 9 రోజుల గడువు, పోలింగ్‌కు 11 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. అయినా ఇప్పటి వరకు దానం నాగేందర్ పార్లమెంట్ నియోజకవర్గం అంతటా ప్రచారం నిర్వహించలేదు. దీంతో పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురౌతున్నారు. ఎంతో ముందుగా పార్టీ ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పటికీ ప్రచారంలో వెనుకబడ్డారు. ఓ వైపు ఎన్నికల గడువు సమీపిస్తున్నప్పటికీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థి ప్రజల వద్దకు రాకపోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ ఎంపీగా పోటీచేసేందుకు అంతగా ఆసక్తిచూపడం లేదనే ప్రచారం జరుగుతోంది.
ఎంపీగా ఓటమిపాలైతే రాష్ట్ర మంత్రివర్గంలో చోటు ఇవ్వాలనే కండీషన్‌తో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారని, ఒకవేళ ఓటమిపాలైనా రాష్ట్ర మంత్రి క్యాబినెట్‌లో బెర్త్ దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారని, అందుకే పార్లమెంట్ అభ్యర్థిగా అంతగా ఆసక్తిచూపడం లేదనే టాక్ వినబడుతోంది. ప్రత్యర్థులు బీజేపీ నుంచి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావుగౌడ్‌లు ప్రతినిత్యం నియోజకవర్గం వ్యాప్తంగా ప్రచారంతో హోరెత్తిస్తుండగా దానం నాగేందర్ శక్తి, సామర్ధ్యాల మేరకు ప్రచారం చేపట్టకపోవడం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలలో పలు రకాల అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పరోక్షంగా బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డికి ఓట్లు చీల్చకుండా మద్దతిస్తూ కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలే ఇవి అంటూ నెటిజన్ల సైతం ఎక్స్, వాట్సాప్ తదితర సోషల్ మీడియాలలో ట్రోల్ చేస్తుండడం గమనార్హం.
పక్క చూపులు చూస్తున్న క్యాడర్..?
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరినీ కలుపుకుని ముందుకు పోవడంలో పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ ఫెయిల్ అయ్యారని సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే మండిపడుతున్నారు. కేవలం తనకు నచ్చిన కొంతమందిని వెంటేసుకుని ప్రచారం చేస్తున్నారని వారు వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానం ఉన్నా దానం తీరుతో ప్రచారంలో పాల్గొనడం లేదని బహిరంగంగా రచ్చకెక్కుతున్నారు. ఏ పదవి లేనివాళ్లకు టికెట్ ఇస్తే వారు ఎలాగైనా గెలవాలనే తపనతో పని చేస్తారని, ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్‌కు పార్టీ టికెట్ ఇచ్చి పొరపాటు చేసిందనే టాక్ కూడా నాయకుల మధ్య వినబడుతోంది.
ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట..
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ పాగా వేసింది. 2014, 2019 ఎన్నికలను బీజేపీ వరుసగా గెలుస్తూ వస్తోంది. ఈ పర్యాయం గెలిచి హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ పావులు కదుపుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దక్కించుకున్న దానం నాగేందర్ ప్రచారంలో అంతగా కనబడకపోవడంతో పోటీ బీఆర్ఎస్, బీజేపీల మధ్యనే ఉంటుందనే చర్చ జరుగుతోంది.